మమ్మల్ని పట్టించుకున్నవాడే లేదు | ys jagan fires on chandrababu govt | Sakshi
Sakshi News home page

మమ్మల్ని పట్టించుకున్నవాడే లేదు

Published Sat, Nov 28 2015 3:36 AM | Last Updated on Sat, Jul 28 2018 4:24 PM

మమ్మల్ని పట్టించుకున్నవాడే లేదు - Sakshi

మమ్మల్ని పట్టించుకున్నవాడే లేదు

జగన్‌కు మొర పెట్టుకున్న రైతులు
కొత్తపేట/రావులపాలెం : భారీ వర్షాలకు పంట నీటమునిగి తీవ్ర నష్టం వాటిల్లినా ప్రభుత్వం తరఫున పట్టించుకున్న నాథుడే లేడని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహనరెడ్డికి పలువురు రైతులు మొర పెట్టుకున్నారు. ఇటీవలి భారీ వర్షాలకు తీవ్రంగా నష్టపోయిన పంటల పరిశీలనకు శుక్రవారం వచ్చిన జగన్‌మోహన్‌రెడ్డి కొత్తపేట శివారు చినగూళ్ళపాలెం, పెదగూళ్ళపాలెం; రావులపాలెం మండలం దేవరపల్లి, ఈతకోట గ్రామాలను సందర్శించారు.

నేలనంటిన వరి పంటను పరిశీలించారు. ఎక్కడిక్కడ రైతులతో మమేకమయ్యారు. ఇంతవరకూ ప్రభుత్వం తరఫున సరైన భరోసా పొందని రైతులు జగన్‌మోహన్‌రెడ్డికి తమ గోడు వెళ్లబోసుకున్నారు. తొలుత చినగూళ్ళపాలెంలో నేలనంటి మొలకవస్తున్న విత్తనాల రామకృష్ణకు చెందిన వరి చేనును జగన్‌మోహన్‌రెడ్డి పరిశీలించారు. నీట మునిగి, మొలక వచ్చి, రంగు మారిన ధాన్యాన్ని ఆ రైతు చూపించారు. ఈ సందర్భంగా వారిమధ్య సంభాషణ ఇలా సాగింది.
 
జగన్ : రామకృష్ణా! ఎన్నెకరాలు సాగు చేస్తున్నావు? సొంత భూమా? కౌలుకా?
రామకృష్ణ : సార్, రెండెకరాలు కౌలుకు సాగు చేస్తున్నాను. చేతికొచ్చే సమయంలో మాయదారి తుపాను వచ్చి పంటను ముంచేసింది. కోయకుండానే నీటిలో ఇలా మొలక వచ్చింది.
 
జగన్ : ఈ వరి కోసి మాసూళ్లు చేస్తే ఏమైనా దిగుబడి వస్తుందా?
రామకృష్ణ :
ఇప్పటికే పది రోజుల నుంచి నీటిలో నానుతోంది. మొలక కూడా వచ్చింది. ఇది ఎందుకూ పనికొచ్చే పరిస్థితి లేదు. కోసి మాసూళ్లు చేసినా కొంటారో కొనరో తెలియదు.
 
జగన్ : ఎంత పెట్టుబడి అయింది?
రామకృష్ణ :
ఎకరానికి దాదాపు 20 వేలు పెట్టుబడి పెట్టామండి. ఇది కాకుండా 15 బస్తాల శిస్తు చెల్లించాలి.
బొక్కా సత్యనారాయణ, కొప్పిశెట్టి గణపతి, సుబ్రహ్మణ్యం, కాండ్రేగుల బాబూరావు తదితర రైతులు : మొలకొచ్చిన, రంగు మారిన ధాన్యం గురించి పట్టించుకున్న నాథుడు లేడు. అసలు ఆ ధాన్యం కొంటారో లేదో తెలియదండి. కొనకపోతే తీవ్రంగా నష్ట పోతాం సార్!
 
జగన్ : ప్రభుత్వం తరఫున ఎవరైనా వచ్చారా? హామీ ఇచ్చారా?
రైతులు :
మొన్న ఎవరో అధికారి వచ్చి, చూసి వెళ్లారు. ఏ హామీ ఇవ్వలేదండి. మా పరిస్థితి అంతా అయోమయంగా ఉంది సార్ ! మీరే వచ్చారు. మీరు దయతలచి పట్టించుకొంటే మా కష్టాలు తీరుతాయి.
 
జగన్ : ఇంతవరకూ ప్రభుత్వం తరఫున ఎవ్వరూ రాకపోవడం చాలా దారుణం. మొలకొచ్చిన, రంగుమారిన ధాన్యం కొనుగోలుకు హామీ ఇవ్వకపోవడం బాధాకరం. ఈ నియోజకవర్గంలో 37 వేల ఎకరాలు సాగవుతూ అత్యధిక శాతం పంట దెబ్బ తింటే అధికారులు మాత్రం కేవలం సుమారు 2 వేల ఎకరాలు దెబ్బతిన్నట్టు లెక్కలు చూపుతున్నారు. గతంలో నీలం, లైలా, పైలీన్ తదితర తుపాన్లు వచ్చాయి. పంటను దెబ్బ తీశాయి. ఆ పరిహారం కూడా ఇవ్వలేదు. సరే దీనిపై మీ తరఫున ప్రభుత్వాన్ని నిలదీస్తాం. పరిహారం ఎలా చెల్లించరో చూస్తాం.
 దేవరపల్లి శివారు బాలయోగిపేట వద్ద రైతులు బయ్యే పెద్దిరాజు, గుత్తుల సత్యనారాయణ, దంగేటి సత్యనారాయణ, దంగేటి రాముడు తదితరులు మొలకొచ్చిన వరిపనలను వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి చూపి తమ కష్టాలు గట్టెక్కించాలని కోరారు. వారి సంభాషణ సాగిందిలా..

జగన్ : అధికారులు వచ్చారా? మీ పంట నష్టాలు నమోదు చేశారా?
రైతులు :
వచ్చారండి. అయితే ఇలా గట్టుకు తెచ్చుకోకూడదంట సార్! చేలోనే మునిగిపోవాలంట. చేలోనే మొలిచేయాలంట. అలా ఉంటేనే రాసుకుంటారంట సార్! వారికిష్టం వచ్చినచోట కూర్చొని, ఇష్టం వచ్చిన వారి పేర్లు రాసుకు వెళ్లారు. మా ఊరికి జేసీగారు వచ్చి అసలు మీ పంట నష్టపోలేదని చెప్పారు.
 
జగన్ : ఇదేం దారుణం? ఉన్న పంటను కూడా ఒబ్బిడి చేసుకోనివ్వరా? ఇదేం ప్రభుత్వం? ఇదేం అధికారులు? వారి ఆటలు అలా సాగుతున్నాయి. పోనీ ఈ ధాన్యం ఎవరైనా కొంటారా?
రైతులు :
ఎవ్వరూ కొనే పరిస్థితి లేదు సార్! మిల్లర్లను అడిగితే అయిన కాడికి అడుగుతారు. బస్తా రూ.1057 ఉండగా రూ.600కు అడుగుతారు. వారు ఎక్కువకు అమ్ముకుంటారు.
 
జగన్ : ప్రభుత్వం మద్దతు ధరకు ధాన్యం కొంటున్నామని ప్రకటించింది. ఈ ధాన్యాన్ని పట్టుకుపోతే కొనరా? పోనీ మీ పంట రుణాలు మాఫీ అయ్యాయా?
రైతులు :
మాఫీ కాలేదండి. ఇళ్లు వేలం వేస్తామంటే వడ్డీకి అప్పులు తెచ్చి కట్టాం.
 
జగన్ : రుణాలు మాఫీ కాకపోగా ఇళ్లు వేలం వేస్తామంటే వడ్డీకి తెచ్చి కట్టారా? రుణమాఫీ చేశామని గొప్పగా చెప్పుకున్నారు. కనీసం ముఖ్యమంత్రిగా చంద్ర బాబు ఏ హామీ ఇవ్వలేదు. మీ దగ్గరకొచ్చిందీ లేదు. ఇదీ ఆయన పాలన.
రైతులు :
ఏం పాలనండీ బాబూ! పేదలు ఇళ్లు కట్టుకునే పరిస్థితి లేదు. ఇక్కడ ఇసుక రేటు బంగారంలా మారింది. లారీ రూ.25 వేలు అంటున్నారు. రుణామాఫీ అన్నాడు. ఏదో చేస్తాడని ఎదురు చూశాం. తీరా చేసిందేమీ లేకపోగా వేలకు వేలు వడ్డీలు కట్టాం.
 
జగన్ : సరే ఈ సమస్యలపై మీ తరఫున ప్రభుత్వంతో పోరాడి రంగు మారిన ధాన్యం కొనుగోలుకు కృషి చేస్తా.
 
వీఆర్‌ఏల సమస్యలపై అసెంబ్లీలో చర్చిస్తా
రాజమండ్రి రూరల్ : వీఆర్‌ఏల న్యాయ సమ్మతమైన సమస్యలపై అసెంబ్లీలో చర్చించి, పరిష్కరించేందుకు కృషి చేస్తానని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారు. సర్వీస్ కమిషన్ ద్వారా నియమితులైన వీఆర్‌ఏలు శుక్రవారం మధురపూడి విమానాశ్రయంలో ఆయనను కలిసి వినతి పత్రం అందజేశారు.

వీఆర్‌ఏల సంఘం జిల్లా అధ్యక్షుడు మల్లేశ్వరరావు తదితరులు మాట్లాడుతూ తమను ఫుల్‌టైమ్ ఉద్యోగులుగా గుర్తించి  పేస్కేలు మంజూరు చేయాలని కోరారు. రాజేష్, కుమార్, దార్ల ప్రసాద్, సుబ్బారెడ్డి, ఆర్.లావణ్య, కె.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement