
న్యాయస్థానంలో న్యాయమే గెలిచింది: మైసూరారెడ్డి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జరప తలపెట్టిన 'సమైక్య శంఖారావం' సభకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అనుమతి ఇవ్వడం పట్ల ఆ పార్టీ సీనియర్ నాయకుడు ఎం.వి.మైసూరారెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. బుధవారం హైదరాబాద్లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద ఆయన మాట్లాడుతూ... సభకు అనుమతి ఇవ్వడం ద్వారా న్యాయస్థానంలో న్యాయం గెలిచిందన్నారు. న్యాయం ఇంకా బతికే ఉందనడానికి హైకోర్టు ఇచ్చిన తీర్పే నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.
సమైక్య శంఖారావం సభ ఎవరికి వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. విద్వేషాలు రెచ్చగొట్టడానికి అంతకన్నా కాదన్నారు. దేశం, రాష్ట్రం సమైక్యంగా ఉన్నప్పుడే అభివృద్ధి చెందుతాయని చెప్పడమే సమైక్య శంఖారావం ముఖ్య ఉద్దేశ్యమని మైసూరారెడ్డి పేర్కొన్నారు. సమైక్య శంఖారావం సభకు ప్రభుత్వం అనుమతించక పోవడంపై ఆయన ఈ సందర్భంగా స్పందించారు. రాజ్యాగ్యం కల్పించిన భావ ప్రకటన స్వేచ్చను.. ప్రభుత్వం కాలరాయాలనుకోవడం దురదృష్టకరమని మైసూరారెడ్డి అభిప్రాయపడ్డారు.