పొన్నూరులో అశేష జనవాహిని మధ్య అభివాదం చేస్తున్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి (ఫైల్)
సాక్షి, అమరావతి బ్యూరో: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జిల్లాలో మార్చి 12 నుంచి ఏప్రిల్ 14 వరకు చేసట్టిన ప్రజాసంకల్ప యాత్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో నూతనోత్తేజాన్ని నింపింది. బాపట్ల నుంచి మంగళగిరి నియోజకవర్గం వరకు జిల్లాలో మొత్తం 12 నియోజక వర్గాల్లో ప్రజా సంకల్పయాత్ర జరిగింది. పాదయాత్రకు స్వచ్ఛందంగా ప్రజలు హాజరై జననేతకు తమ సమస్యలను విన్నవించారు. దారిపొడవునా పూల వర్షం కురిపిస్తూ, మంగళహారతులు పట్టారు. ప్రత్యేక హోదా –ఆంధ్రుల హక్కు అంటూ నినదించారు. బాపట్ల నియోజక వర్గంలో పాదయాత్రకు వచ్చిన స్పందన చూసి తెలుగుదేశం నేతల్లో గుబులు మొదలైంది. ప్రజల్లో నెలకొన్న అసంతృప్తి బయటపడటంతో టీడీపీ శ్రేణులు కంగుతిన్నాయి. వైఎస్సార్ సీపీకి ప్రజల్లో ఆదరణ రోజు రోజుకు పెరుగుతుండటంతో, గండం నుంచి గట్టెక్కెదెలా అని టీడీపీలో అంతర్మథనం మొదలైంది. జిల్లాలో జరిగిన 11 బహిరంగ సభలకు ప్రజలు పోటెత్తారు.
నీవెంటే.. మేమంతా..
ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పాదయాత్ర విశాఖపట్నం జిల్లాలో సాగుతుండగానే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో పెద్ద ఎత్తున చేరికలు మొదలయ్యాయి. విడదల రజనితో పాటు పెద్ద ఎత్తున నాయకులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆమెను చిలకలూరిపేట నియోజక వర్గ సమన్వయకర్తగా నియమించగా, మాజీ డీఐజీ ఏసురత్నాన్ని గుంటూరు పశ్చిమ నియోజక వర్గ సమన్వయకర్త భాద్యతలు అప్పగించారు. వీరిద్దరు బీసీ వర్గానికి చెందిన వారు కావటం విశేషం. తాడికొండ నియోజకవర్గంలో డాక్టర్ ఉండవలి శ్రీదేవిని సవన్వయకర్త నియమించారు. పెదకూరపాడు నియోజక వర్గంలో జరిగిన ప్రజా సంకల్ప యాత్రలో నంబూరి శంకరావు చురుగ్గా పాల్గొన్నారు. ఉత్తరాంధ్రలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్ర సాగుతున్న సమయంలోనే, పెదకూరపాడు నియోజక వర్గ సమన్వయకర్తగా నియమించారు. నరసరావు పేట పార్లమెంట్ సమన్వయకర్తగా లావు శ్రీకృష్ణదేవరాయలు, గుంటూరు పార్లమెంట్ సమన్వయకర్తగా కిలారి రోశయ్యలను నియమించారు. గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా లేళ్ల అప్పిరెడ్డి, గుంటూరు నగర అధ్యక్షుడిగా పాదర్తి రమేష్ గాంధీలను ఎంపిక చేశారు. వేమూరు నియోజక వర్గానికి చెందని పలువురు ముఖ్య నేతలు దాసరి మత్తయ్య, పేరికల పద్మారావు, ఎం. కుబేరుడు, పెద్దబుజ్జి, చీకటి భుజంగరావుతో పాటు పలువురు నేతలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. జిల్లాలో వైఎస్ జగన్ ప్రజా సంకల్పయాత్ర సాగుతున్న సమయంలో సత్తెనపల్లిలో మున్సిపల్ వైఎస్ చైర్మెన్ అతుకూరి నాగేశ్వరరావు, నిమ్మకాయల రాజనారాయణ, గుంటూరు తూర్పు నియోజక వర్గంలో పాదర్తి రమేష్‌గాంధీ, కరామత్, రిజ్వాన్‌లు జగన్ సమక్షంలో పార్టీలో చేరారు. జిల్లాలో జగన్ ప్రజాసంకల్పయాత్ర సాగుతున్న సమయంలో పలువురు నేతలు పార్టీలోచేరి, పాదయాత్రకు సంఘీభావం తెలిపారు.
మసకబారిన టీడీపీ ప్రతిష్ట..
తెలుగు దేశం కంచకుకోట పొన్నూరులో ప్రజాసంకల్పయాత్రకు జనాలు పోటెత్తారు. ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర సొంత గ్రామంలో జననేతకు పూలబాట వేసి స్వాగతం పలికారు. అక్కడి బహిరంగ సభకు పెద్ద ఎత్తున జనాలు హాజరయ్యారు. దీనిని బట్టి స్థానిక ఎమ్మెల్యే, తెలుగదేశం పార్టీపైన ఉన్న వ్యతిరేకత స్పష్టంగా కనిపించింది. ప్రత్తిపాడు నిమోజక వర్గంలోని పెద్దనందిపాడులో సైతం ప్రజా సంకల్పయాత్రకు విశేష స్పందన లభించడాన్ని టీడీపీ శ్రేణులు జీర్ణించుకొలేక పోతున్నాయి. చిలకలూరిపేటలో ప్రజాసంకల్పయాత్రకు జనం ఉప్పెనలా తరలివచ్చారు. దీంతో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు వర్గీయుల్లో ఆందోళన మొదలైంది. ఈ సారీ ఎన్నికల్లో ఎదురీదక తప్పదనే భయం పట్టి పీడిస్తుంది. నరసరావుపేట, సత్తెనపల్లెలో జననేత జగన్ మోహన్‌రెడ్డి ప్రసంగానికి విశేష స్పందన లభించింది. అక్కడ తెలుగు దేశం పార్టీ నేతలు చేస్తున్న దోపిడీని ప్రజలు జననేతను కలిసి వివరించడం టీడీపీ నాయకులను కలవరపెడుతుంది. పెదకూరపాడు నియోజకవర్గంలో సైతం ఇసుక దోపిడీ, ఎత్తిపోతల నిర్వహణ అటకెక్కడం వంటి విషయాలు అధికారపార్టీని ఇరకాటంలోకి నెట్టాయి. తాడికొండ నియోజక వర్గంలో రాజధాని ప్రాంతంలో భూములిచ్చిన రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయ్యింది. ఈ క్రమంలో న్యాయం కోసం పోరాటే జగన్ వెంటే వారూ అడుగులేశారు. గుంటూరు నగరంలో డయేరియా సమస్య అధికార పార్టీకి కంటిమీద కునుకు లేకుండా చేసింది. కనీసం నగరంలో ప్రభుత్వం తాగునీరు ఇవ్వలేని దుస్థితిలో ఉందనే భావనే నెలకొంది. మొత్తం మీద డయేరియాతోపాటు, జీజీహెచ్ ఆస్పత్రిల్లో జరుతున్న ఘటనలు టీడీపీ ప్రతిష్టను మసకబార్చాయి. తెనాలి నిమోజకవర్గంలో సైతం స్థానిక తెలుగుదేశం పార్టీ నేతలు చేస్తున్నా భూకబ్జాలు, ఇసుక దోపిడీ వంటివి అక్కడ ప్రజల్లో పార్టీని పలుచనా చేశాయి. మంగళగిరి నియోజక వర్గంలో రైతులు, చేనేత, రాజధాని ప్రాంత సమస్యలు పట్టి పీడిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment