
సాక్షి, తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇవాళ పలు కీలక శాఖలపై సమీక్షలు నిర్వహించనున్నారు. ఆయన గురువారం ఉదయం వ్యవసాయ శాఖపై సమీక్ష చేపట్టారు. సీఎం ముఖ్య సలహాదారు అజయ్ కల్లం, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పీవీ రమేష్, వ్యవసాయ శాఖ సలహాదారు విజయ్ కుమార్, ముఖ్య కార్యదర్శి రాజశేఖర్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ ఎస్ రావత్, వ్యవసాయ శాఖ ప్రత్యేక కమిషనర్ మురళీధర్ రెడ్డితో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. నిజానికి వ్యవసాయ శాఖపై సమీక్ష నిన్న(బుధవారం) జరగాల్సి ఉండగా, రంజాన్ పర్వదినం సందర్భంగా రద్దు అయింది. రాష్ట్రంలోని వ్యవసాయ పరిస్థితులు, ఖరీఫ్ సీజన్‌లో రైతులకు నీటి లభ్యత, వివిధ ప్రాజెక్టుల్లో నిల్వ ఉన్న నీరు తదితర అంశాలపై సీఎం జగన్ సమీక్ష చేయనున్నారు.
ఇక జన వనరుల శాఖపై ముఖ్యమంత్రి రెండోసారి సమీక్ష జరుపుతున్నారు. పోలవరం సహా సాగు, తాగునీటి ప్రాజెక్టులపై ఆయన అధికారులతో సమీక్షించనున్నారు. దీనికి సంబంధించిన సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆయన ఇప్పటికే అధికారులకు ఆదేశించారు కూడా. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం వైఎస్ జగన్ వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్న విషయం విదితమే. ఇప్పటికే ఆర్థిక, రెవెన్యూ, వైద్య, ఆరోగ్య, విద్యాశాఖపై ఆయన సమీక్ష జరిపారు.