ప్రభుత్వ పాఠశాలల్లో ఎల్‌కేజీ, యూకేజీ | YS Jagan Holds Review On School Education And Goru Mudda | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ పాఠశాలల్లో ఎల్‌కేజీ, యూకేజీ

Published Tue, Jul 21 2020 6:44 PM | Last Updated on Tue, Jul 21 2020 8:27 PM

YS Jagan Holds Review On School Education And Goru Mudda - Sakshi

సాక్షి, తాడేపల్లి : ఆంధ్రప్రదేశ్‌ విద్యావిధానంలో సంచలన మార్పులకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ పాఠశాలల్లో వచ్చే ఏడాది నుంచి ఎల్‌కేజీ, యూకేజీ విద్య అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. పీపీ-1, పీపీ-2గా ప్రీప్రైమరీ విద్యను అమలు చేయాలని చెప్పారు. ప్రీ ప్రైమరీ విద్య కోసం ప్రత్యేక సిలబస్‌ రూపొందించాలని సూచించారు. మంగళవారం పాఠశాల విద్య, గోరుముద్ద నాణ్యతపై సీఎం వైఎస్‌ జగన్‌ క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. విద్యావ్యవస్థలో ఇటీవల తీసుకున్న నిర్ణయాలు, వాటి అమలు సహా నాణ్యమైన విద్యకోసం తీసుకుంటున్న చర్యలపై ఈ సమావేశంలో చర్చించారు. మానవవనరుల సమర్థ వినియోగం, ఉత్తమమైన బోధన తదితర అంశాలపై కూడా చర్చ సాగింది. అనంతరం ఆ దిశగా సీఎం జగన్‌.. మరి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అనంతరం స్కూలు పిల్లలకోసం రూపొందించిన పాఠ్యపుస్తకాలను ముఖ్యమంత్రి పరిశీలించారు. (రేపే ‘జగనన్న పచ్చతోరణం, 20 కోట్ల మొక్కలే లక్ష్యం)

స్కూళ్ల పక్కనే అంగన్‌వాడీ కేంద్రాలు ఉంటే బాగుంటుందని అధికారులు ఈ సందర్భంగా ప్రతిపాదించగా.. అందుకు సీఎం వైఎస్‌  జగన్‌ సానుకూలంగా స్పందించారు. రాష్ట్రంలో 55వేల అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయని సీఎం తెలిపారు. అందులో దాదాపు 35వేల కేంద్రాలకు భవనాలు లేవని అన్నారు. ప్రైమరీ స్కూళ్ల కు సమీపంలోనే అంగన్‌వాడీలు ఉండాలంటే.. ముందుగా ఆయా స్కూళ్లలో తగిన స్థలాలు ఉన్నాయా? లేవా? అన్నదాన్ని పరిశీలించి నివేదిక తయారు చేయాలని అధికారులను ఆదేశించారు.

పకడ్బందీ పాఠ్యప్రణాళికలు ఉండాలి..
అలాగే పీపీ-1, పీపీ-2 క్లాసులను కూడా ప్రాథమిక విద్య పరిధిలోకి తీసుకురావడంపై ఈ సమావేశంలో చర్చించారు. పీపీ-1, పీపీ-2 పిల్లలకు నాణ్యమైన విద్యను అందించే దిశగా చర్యలుండాలని సీఎం తెలిపారు. వీరికి పకడ్బందీ పాఠ్యప్రణాళిక ఉండాలని ఆదేశించారు. ఒకటో తరగతి నుంచి బోధించే పాఠ్యాంశాలతో, పీపీ-1, పీపీ-2 పాఠ్యాంశాల మధ్య  సినర్జీ ఉండాలని సూచించారు. 

జూనియర్‌ కాలేజీల స్థితిగతులపైనా చర్చ..
ఈ సమావేశంలో రాష్ట్రంలోని జూనియర్‌ కాలేజీల స్థితిగతులపైనా కూడా చర్చ సాగింది. 270 మండలాల్లో జూనియర్‌ కాలేజీలు లేవని అధికారులు సీఎంకు వివరించారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి.. ప్రతి మండలానికో హైస్కూల్‌ను జూనియర్‌ కాలేజీగా మార్చేలా తీసుకున్న నిర్ణయం ద్వారా ఈ సమస్యను అధిగమిస్తామని తెలిపారు. అలాగే ప్రస్తుతం ఉన్న జూనియర్‌ కాలేజీల్లో ఖాళీను భర్తీ చేయడంపైనా దృష్టిపెట్టాలని ఆదేశించారు. పోటీ పరీక్షలకు అవసరమైన విధంగా విద్యార్థులకు బోధన అందించాలని సూచించారు. జాతీయ స్థాయిలో ఐఐటీ, జేఈఈ లాంటి పోటీ పరీక్షలకు వారిని సిద్ధం చేసే దిశగా కార్యాచరణ ఉండాలన్నారు.

ప్రైవేటు స్కూళ్లకు అక్రిడేషన్‌ విధానం..
ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో టీచర్లకు శిక్షణ ఇచ్చేందుకు ఒక భవనం ఉండేలా చూసుకోవాలని సీఎం జగన్‌ అన్నారు. ఉపాధ్యాయులకిచ్చే శిక్షణ కార్యక్రమంలో కూడా సరైన పాఠ్యప్రణాళికను అనుసరించాలని సూచించారు. ఈ సందర్భంగా ప్రైవేటు స్కూళ్లపై పర్యవేక్షణ, నియంత్రణల విషయంలో కమిషన్‌ ఇచ్చిన మార్గదర్శకాల అమలును అధికారులు సీఎం జగన్‌కు వివరించారు. దీనిపై స్పందించిన సీఎం వైఎస్‌ జగన్‌.. ప్రైవేటు స్కూళ్లకు అక్రిడేషన్‌ విధానం ఉండాలన్నారు. వాటి ఫీజులపై పర్యవేక్షణ ఉండాలని.. ప్రతి ఏటా ప్రైవేటు స్కూళ్లలో తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. అధికారికంగా ఫిర్యాదు చేసుకునేందుకు కంప్లైంట్‌ బాక్స్‌ ఉండాలని సూచించారు. అలాగే ఒక మంచి యాప్‌ తీసుకు రావాలని తెలిపారు. అదే సమయంలో ఇందులో లంచాలకు, ప్రలోభాలకు తావు ఉండకూడదని స్పష్టం చేశారు. 

ప్రాథమిక విద్య పరిధిలోకి పీపీ–1, పీపీ–2, విద్యార్థుల సంఖ్యకు తగినట్టుగా టీచర్లు, మండలానికి ఒక హైస్కూల్‌ జూనియర్‌ కాలేజీగా మార్పు... వీటన్నింటినీ పరిశీలించిన తర్వాత  ఖాళీలపై ఒక అవగాహనకు రావాలని, ఆ తర్వాత భర్తీ ప్రక్రియ చేపట్టాలన్న సీఎం ఆదేశించారు. టీచర్స్‌ విషయంలో రాజీ పడొద్దని, మౌలిక సదుపాయల కల్పనకోసం ఇంత పెద్ద మొత్తంలో నాడు – నేడు కింద డబ్బు ఖర్చు చేసిన తర్వాత తగిన టీచర్లను ఉంచకపోతే ప్రయోజనం ఉండదని అభిప్రాయపడ్డారు. 



గోరుముద్ద చాలా ప్రాధాన్యత ఉన్న కార్యక్రమం..
మధ్యాహ్న భోజనంలో నాణ్యత, అలాగే స్కూళ్లలో బాత్‌రూమ్స్‌ పరిశుభ్రత ఈ రెండు కూడా చాలా ముఖ్యమైనవి అని సీఎం జగన్‌ తెలిపారు. మధ్యాహ్న భోజనంపై ఫీడ్‌ బ్యాక్‌ వచ్చిన తర్వాత ఏ విధంగా స్పందిస్తున్నామన్న దానిపైనే ఈ కార్యక్రమం విజయం ఆధారపడి ఉంటుందన్నారు. ఫిర్యాదులు రాగానే వెంటనే రెస్పాండ్‌ అవుతున్నారా? లేదా? అన్నదానిపై పర్యవేక్షణ కూడా చేయాలని చెప్పారు. పాఠశాలలు తెరిచే సమయానికి మధ్యాహ్న భోజనంపై రూపొందించుకున్న స్టాండర్డ్‌ ఆపరేషన్‌ ప్రొసీజర్‌ పాటించేలా అన్నిరకాల చర్యలూ తీసుకోవాలి ఆదేశించారు. 

బాత్‌రూమ్‌ల పరిశుభ్రతకోసం అవసరమైన వస్తువులు ఉన్నాయా? లేవా?, అలాగే శుభ్రంచేసే మనిషి ఉన్నారా? లేదా? అన్నదానిపై దృష్టిపెట్టాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చేపడుతున్న నాడు – నేడు కార్యక్రమాల్లో భాగంగా మధ్యాహ్న భోజనం తయారీకోసం కిచెన్‌ షెడ్‌ను కూడా నిర్మించాలని ఆదేశించారు. నాడు నేడు కార్యక్రమాల్లో 10వ అంశంగా దీన్ని చేర్చాలన్నారు. మధ్యాహ్న భోజనం తయారీకోసం వినియోగించే పాత్రలు, పరికరాలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. స్కూళ్లలో ఉన్న విద్యార్థుల ఆరోగ్యంపైన కూడా దృష్టిపెట్టాలని సీఎం వైఎస్ జగన్‌ సూచించారు. రెగ్యులర్‌గా హెల్త్‌ చెకప్స్, పరిశుభ్రత పాటించడంపై విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో సిబ్బందిని పూర్తిస్థాయిలో వినియోగించుకునే యంత్రాంగం ఉండాలన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉన్న హెల్త్‌ అసిస్టెంట్, డిజిటల్‌ అసిస్టెంట్, ఏఎన్‌ఎంల సేవలను సంపూర్ణంగా వినియోగించుకోవాలని చెప్పారు. ​​​​​​​

అనంతరం మంత్రి సురేష్‌ మాట్లాడుతూ.. ‘ప్రీప్రైమరీ విద్యను బలోపేతం చేసేందుకు అవసరమైన టీచర్లను నియమించాలని సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశించారు. సెప్టెంబర్‌ 5 నుంచి పాఠశాలలు తెరిచేందుకు సిద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి సూచించారు. దీనిపై అప్పటి పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఉపాధ్యాయుల ఉమ్మడి సర్వీసు రూల్స్ పై ఈ సమావేశంలో చర్చించాం. కమిటీ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి చెప్పారు. ప్రతీ నియోజకవర్గానికి ఓ విద్యాశాఖ అధికారిని తీసుకోస్తాం. జిల్లా స్థాయిలో డీఇవో, జేడీలు ఉంటారు. జిల్లాల్లో జేసీల పరిధిలోకి విద్యాశాఖను తెస్తాం. పాఠశాలల్లో 8వ తరగతి నుంచే కంప్యూటర్‌ విద్యను అందిస్తాం. ప్రతి జిల్లాలో టీచర్‌ ట్రైనింగ్‌ సెంటర్లు ఏర్పాటు చేయబోతున్నాం. అలాగే వర్చువల్‌ కాస్ల్‌ రూమ్‌, ఇంగ్లిష్‌ ల్యాబ్‌లు ఏర్పాటు చేస్తాం’ అని తెలిపారు.(అమూల్‌తో ఏపీ ప్రభుత్వం అవగాహన ఒప్పందం)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement