వైఎస్ జగన్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్న వసంత కృష్ణప్రసాద్ (ఫైల్)
అరాచక శక్తుల అంతుచూడాలని.. బాధలు నిండిన జనానికి భరోసానివ్వాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సాగిస్తున్న ప్రజా సంకల్ప పాదయాత్ర ఓ మహోజ్వల ఘట్టం. నేటి రాజకీయ నాయకులకు భిన్నంగా.. ఎండనక.. వాననకా.. ఏడాదికిపైగా జనం మధ్యలో.. జనం అడుగులో అడుగువేస్తూ పాదయాత్ర పరిపూర్తికి చేరువయ్యారు. కృష్ణా జిల్లాలో ప్రజాసంకల్ప పాదయాత్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో సరికొత్త ఉత్సాహం తెచ్చిపెట్టింది. అందరి చూపు జగన్ వైపు.. అందరి నోట జగన్మోహనుడి మాటగా మారిపోయింది. పార్టీలో చేరికలు.. కలయికలు.. ఉప్పొంగిన ప్రేమాభిమానాలు ఇవన్నీ సంకల్ప సూరీడు అడుగులతోటే చేరువయ్యాయి. గత ఏడాది ఏప్రిల్ 14న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కనకదుర్గ వారధి మీదుగా జిల్లాలోకి ప్రవేశించిన ఘట్టం.. ఇసుక వేస్తే రాలనంతగా జనం మరపురాని సన్నివేశం. వైఎస్సార్ సీపీకి కొత్త ఉత్సాహం తెచ్చిపెట్టిన మహోన్నత ఘట్టం.
సాక్షి, అమరవాతి బ్యూరో : ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్ని వర్గాల ప్రజలతో మమేకమవుతూ సాగిన ప్రజా సంకల్ప యత్ర జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో నూతనోత్సాహం నింపింది. జననేత వేసిన ప్రతి అడుగు పార్టీలోని నాయకులు, కార్యకర్తల్లో రెట్టింపు జోష్ తెచ్చిపెట్టింది. జిల్లాలో వైఎస్ జగన్ పాదయాత్ర జరిగినన్ని రోజులు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. పాదయాత్రలో తీసుకున్న నిర్ణయాలు పార్టీని బడుగు బలహీన వర్గాలకు చేరువవ్వడానికి దారితీశాయి. పోరాట వీరుడి స్ఫూర్తితో జిల్లాలో పార్టీ రోజురోజుకు బలపడుతోంది.
చేరికలతో మరింత బలోపేతం
బలమైన కార్యకర్తలు, నాయకులతో పటిష్ట స్థితిలో ఉన్న వైఎస్సార్ సీపీ జననేత పాదయాత్ర సమయంలో కొత్తగా చేరికల ద్వారా మరింత బలపడింది. గత ఏడాది ఏప్రిల్ 14న విజయవాడ కనకదుర్గ వారధి మీదుగా జిల్లాలోకి జననేత పాదయాత్ర ప్రవేశించటంతోనే పార్టీలోకి చేరికలు మొదలయ్యాయి. మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవి తన అనుచరులతో కలసి వారధి మీద పార్టీలోకి చేరారు. తదనంతరం ఆయన్ని విజయవాడ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించడంతో తూర్పులో తిరిగిలేని శక్తిగా వైఎస్సార్ సీపీ మారింది. జిల్లాకే చెందిన మాజీ రాష్ట్ర హోం మంత్రి వసంత నాగేశ్వరరావు, ఆయన కుమారుడు వసంత కృష్ణప్రసాద్ పార్టీ కండువా కప్పుకున్నారు. మైలవరం వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్తగా కృష్ణప్రసాద్ నియామకం జరగడం, ఆయన నిత్యం ప్రజల్లో తిరుగుతూ సమస్యలు తెలుసుకోవడం వల్ల రోజురోజుకు ఆదరణ పెరుగుతోంది.
తీవ్ర అవినీతి ఆరోపణలతో ఉక్కిరిబిక్కిరవుతున్న మంత్రి ఉమామహేశ్వరరావు వచ్చే ఎన్నికల్లో మరో నియోజకవర్గం చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. పాదయాత్ర జరిగినన్ని రోజులు జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు చెందిన నేతలు, కార్యకర్తలు భారీ స్థాయిలో పార్టీలో చేరారు. పార్టీలో చేరికలేకాక క్షేత్ర స్థాయి నుంచి పార్టీ బలపడటానికి ఎన్నో కీలక నిర్ణయాలను పాదయాత్రలో భాగంగా జననేత తీసుకున్నారు. కైకలూరులో నిర్వహించిన భారీ బహిరంగ సభ సాక్షిగా నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా దూలం నాగేశ్వరరావు (డీఎన్నార్)ను ప్రకటించటం ఒక సంచలనం. పెడన నియోజకవర్గ సమన్వయకర్తగా జోగి రమేష్‌ను నియమించారు. 70 ఏళ్లుగా శాసన మండలిలో ప్రాతినిధ్యం నోచుకోని నాయీబ్రాహ్మణ, విశ్వబ్రాహ్మణులకు అవకాశమివ్వాలని నిర్ణయం తీసుకున్నారు. వైఎస్ జగన్ తనకు దళితుల పట్ల ఉన్న ప్రత్యేక అభిమానాన్ని చూపి వారికి మరింత చేరువయ్యారు. ఇలా అన్ని వర్గాల వారిని తన పాదయాత్ర ద్వారా ఆకట్టుకున్నారు.
యాత్ర స్ఫూర్తితో..
జననేత ఇచ్చిన స్ఫూర్తితో జిల్లా పార్టీ నాయకులు, కార్యకర్తలు జెట్ స్పీడ్‌తో మరింత కష్టపడి పనిచేయడం మొదలుపెట్టారు. రావాలి జగన్.. కావాలి జగన్ అనే కార్యక్రమం ద్వారా వైఎస్సార్ సీపీని అన్ని వర్గాలకు చేరువ చేస్తున్నారు. వైఎస్ జగన్ ప్రకటించిన నవరత్నాల ద్వారా ప్రతి ఇంటికి చేకూరే లబ్ధిని వివరిస్తున్నారు. అగ్రిగోల్డ్ బాధితుల బాసట కమిటీ ద్వారా పోరాటాలు చేస్తూ అగ్రిగోల్డ్ బాధితులకు భరోసా ఇస్తున్నారు. నిన్ను నమ్మం బాబు కార్యక్రమం ద్వారా ఎన్నికల ముందు అలవిగాని హామీలతో గద్దెనెక్కి ప్రజలను మోసం చేసిన తీరును ఎండగడుతున్నారు. నిత్యం ప్రజా సమస్యలపై అలుపెరగని పోరాటాలతో పార్టీ పట్ల ప్రజల ఆదరాభిమానాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. పాదయాత్ర తెచ్చిన ఉత్సాహం ఏమాత్రం తగ్గనీయకుండా కదనోత్సాహంతో ఈ ఏడాది జరగనున్న ఎన్నికలకు సిద్ధపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment