సాక్షి, అమరావతి బ్యూరో :యువోత్సాహం ఉవ్వెత్తున ఎగిసింది. రైతు, శ్రామిక, కర్షకలోకం సంబరం చేసుకుంది. వేయికళ్లతో ఎదురు చూసిన అక్కాచెల్లెళ్లు, అవ్వాతాతల మోము చిరునవ్వుతో మురిసింది. కష్టాలు, కన్నీళ్లలో తోడుండే నేస్తం, మా ధైర్యం నీవే అంటూ ప్రవాహంలా తరలివచ్చింది.. గతేడాది ప్రజా సంకల్పయాత్రలో భాగంగా జననేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి జిల్లాలో పర్యటించినప్పుడు కనిపించిన దృశ్యాలు ఇవి. ఏ రోడ్డు చూసినా జనసంద్రమే.. అన్న అడుగుజాడలోనే మేము అంటూ ‘కృష్ణా’భిమానం ఆయన వెంట పరుగుపెట్టింది. జననేతతో మాటలు కలుపుతూ.. సెల్ఫీలు దిగుతూ.. సుర్రుమంటున్న సూరీడును సైతం లెక్కచేయకుండా పదం కలిపింది. ఆ మహా ‘సంకల్పం’ తుది అంకానికి చేరుకుంటున్న తరుణంలో నాటి మధుర స్మృతులను అంతా జ్ఞప్తికి తెచ్చుకుంటున్నారు.
సెల్ఫీ అనిర్వచనీయం
నూజివీడు మీదుగా జగన్ పాదయాత్ర చేసేటప్పుడు ఆయనను కలవడానికి మొదటి రోజు వెళ్లాం. కానీ కలవలేకపోయాం. ఎలాగైనా సాధించాలని రెండోరోజు వెళ్లి ఇద్దరు పిల్లలతో కలిసి సెల్ఫీ దిగాను. జీవితంలో అది ఒక మరచిపోలేని అనుభూతిగా మిగిలిపోయింది. అటువంటి గొప్ప నేతతో కలసి అడుగులు వేయడం నా అదృష్టం. – నాగరాణి, గృహిణి, నూజివీడు
ప్రజల కష్టం తెలిసిన నాయకుడు
ప్రజాసంకల్పయాత్ర జిల్లాలోకి ప్రవేశించిన నాటి నుంచి పశ్చిమగోదావరి జిల్లాలోకి వెళ్లే వరకూ జననేత జగన్ వెంట నడిచాను. ఆయన ప్రజల కష్టాలు తెలిసిన గొప్పనాయకుడు. సమస్యల్లో ఉన్న వారు ఆయన వద్దకు వచ్చి తమ కష్టాలను చెప్పుకుంటే.. ఓదార్పునివ్వడంతో పాటు, పరిష్కార మార్గాలను చూపిన గొప్పవ్యక్తి. ఆయనతో కలిసి నడవటాన్ని నా జీవితంలో ఎన్నటికీ మరువలేను.
– సారేపల్లి సుధీర్, బ్రహ్మానందరెడ్డినగర్,విజయవాడ తూర్పు
నా బిడ్డను ఆశీర్వదించారు..
మా అభిమాన నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నా బిడ్డను ముద్దాడిన ఆత్మీయ సంఘటనను ఎన్నటికి మరువలేం. ప్రజా సంకల్పయాత్రలో భాగంగా కైకలూరు వచ్చిన సందర్భంగా గతేడాది ఏప్రిల్ 14న సీఎన్నార్ గార్డెన్ వద్ద జగనన్నను మా కుటుంబమంతా వెళ్లి కలిశాం. నా బిడ్డ హేమశ్రీని ఆయన చేతితో ఆశీర్వదించారు. ఓ అన్నలా నాతో ఎంతో ప్రేమగా మాట్లాడారు. –టి.భగవాన్, బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగి, కైకలూరు
చేపను బహుమతిగా ఇచ్చాం..
దశాబ్ధాలుగా అపరిష్కృతంగా ఉన్న కొల్లేరు రైతుల, కూలీల సమస్యలను తీరుస్తానని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీని జననేత తప్పక నెరవేర్చుతాడన్న నమ్మకం మాకుంది. పాదయాత్రలో భాగంగా జగన్‌ను కలసి మాపై తనకున్న ప్రేమకు కృతజ్ఞతగా చేపను బహూకరించాం. మేమిచ్చిన చిరుకానుకకు ఆయనెంతో సంబరపడ్డారు.–ముంగర నరసింహరావు, కొల్లేరు ప్రాంత చేపల రైతు, వడ్లపూటితిప్ప
ఇడుపులపాయ టు ఇచ్ఛాపురం
వైఎస్ జగన్ వెంట ప్రజాసంకల్ప యాత్ర మొదలైన ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం దాకా వెన్నంటే ఉంటూ నడుస్తున్నాను. పాదయాత్ర మొదలైన 2017 సంవత్సరం నవంబర్ 6 నుంచి గెడ్డం తీయించుకోలేదు. యాత్ర విజయవంతమవగానే తిరుమలలో మొక్కు చెల్లించుకుంటాను. రాష్ట్రంలోని యువతకు న్యాయం జరగాలంటే ఒక్క జగన్‌తోనే సాధ్యం. –వైఎస్ ప్రశాంత్,వైఎస్సార్‌సీపీ సేవాదళం, గుడివాడ
నా చేతులతో ప్రార్థన చేశాను..
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాబోయే ఎన్నికల్లో అఖండ విజయం సాధించి ముఖ్యమంత్రి అవుతారు. ప్రజా సంకల్పయాత్రలో భాగంగా మండవల్లి వచ్చిన జగన్‌కు ఈ చేతులతో ప్రార్థన చేశాను. ప్రభు ఏసు ఆయనపై కరుణ చూపుతారనే నమ్మకం ఉంది. ఎందరో బడుగు, బలహీన వర్గాల ప్రజలు జగన్ ఎప్పుడు సీఎం అవుతారా, తమ కష్టాలు ఎప్పుడు తీరతాయా అని ఎదురు చూస్తున్నారు. – రాణీఅబ్రహాం,హోలీ ఆర్మీ ఫెలోషిప్ చర్చి నిర్వాహకురాలు, మండవల్లి
Comments
Please login to add a commentAdd a comment