రిటైర్డ్ ఐజీ ఇక్బాల్, బైరెడ్డి
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర జిల్లాలో రాజకీయ వేడిని రగిలించింది. పాదయాత్రలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనాలు, బహిరంగ సభలకు లక్షలాదిగా జనాలు తరలిరావడంతో ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. పోటెత్తిన ప్రజాభిమానాన్ని చూసి దడుచుకున్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజాగ్రహంలో కొట్టుకుపోవడం ఖాయమని టీడీపీ నేతలు భావిస్తున్నారు. జిల్లాలో ప్రజాసంకల్పయాత్ర విజయవంతం కావడం, వైఎస్సార్‌సీపీలోకి ప్రముఖులు చేరడంతో పార్టీ శ్రేణుల్లో ఫుల్ జోష్ నెలకొంది. వచ్చే ఎన్నికల్లోసులభంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఉరకలెత్తినా ఉత్సాహం...
కర్నూలు జిల్లాలో నవంబర్ 14 నుంచి డిసెంబర్ 3వ తేదీ వరకు 18 రోజులపాటు ప్రజా సంకల్ప పాదయాత్ర జరిగింది. ఏడు నియోజకవర్గాలు, 14 మండలాలు, 66 గ్రామాల మీదుగా 263 కిలోమీటర్ల మేర ప్రతిపక్ష నేత వైఎస్‌జగన్‌మోహన్ రెడ్డి పాదయాత్ర చేశారు. జిల్లాలో అడుగడుగునా వేలాది మంది ప్రజలు ప్రతిపక్ష నేతతో కలసి అడుగులు వేశారు. వృద్ధులు, మహిళలు, విద్యార్థులు, నిరుద్యోగులు, యువకులు, ఉద్యోగులు, రైతులు, రైతు కూలీలు, వికలాంగులు.. పెద్ద ఎత్తున తమ సమస్యలను చెప్పుకున్నారు. ప్రజల సమస్యలను వింటూ వాటికి పరిష్కారాలు చూపుతూ వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ముందుకు సాగారు. అధికారంలోకి వస్తే 15 రోజుల్లో ఓపీఎస్ విధానాన్ని(పాత పెన్షన్) తెస్తానని ఉద్యోగులకు కర్నూలు జిల్లాలో హామీ ఇచ్చారు. అలాగే నవరత్నాల్లో తొలి మార్పు ఇక్కడ నుంచే మొదలైంది. వైఎస్సార్ భరోసాను ఐదెకరాల్లోపు రైతులకు మాత్రమే కాకుండా అన్నదాతలకు అందరికీ వర్తించేలా ప్రకటన చేశారు. మొత్తంగా తన పాదయాత్రలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్ని వర్గాల ప్రజలకు తాను అండగా ఉంటానని, ఏడాది పాటు ఓపిక పడితే ప్రజా ప్రభుత్వం వస్తుందని ధైర్యం చెబుతూ యాత్రను కొనసాగించడంతో వైఎస్సార్‌సీపీలో నూతన ఉత్తేజం, ఉత్సాహం నెలకొంది. పాదయాత్ర పార్టీకి కొత్త ఊపును తెచ్చింది. జిల్లాలో వైఎస్సార్‌సీపీ బలపడింది. దీంతో అధికార, ఇతర పార్టీల నుంచి ఎంతో మంది పార్టీలో చేరేందుకు ముందుకు వస్తున్నారు.
పలువురు వైఎస్సార్‌సీపీలో చేరిక...
జిల్లాలో వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి పాదయాత్ర విజయవంతం కావడంతో పక్క పార్టీల చూపు వైఎస్సార్‌సీపీ వైపు పడింది. నవంబర్ 14వ తేదీన పాదయాత్ర జిల్లాలో అడుగు పెట్టగానే ఆళ్లగడ్డ మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ పలచాని బాలిరెడ్డి పార్టీలోకి వచ్చారు. తరువాత కోవెలకుంట్లకు చెందిన సీనియర్ టీడీపీ నాయకుడు, జిల్లా వైద్య సంఘం అధ్యక్షుడు రామిరెడ్డి, బనగానపల్లె నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జి పేరా రాముసుబ్బారెడ్డి కుటుంబం వైఎస్సార్‌సీపీలో చేరింది. కృష్ణా జిల్లాలో పాదయాత్ర జరుగుతుండగా మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి, రాయలసీమ ఐజీగా పనిచేసి రిటైర్డ్ అయిన షేక్ మహ్మద్ ఇక్బాల్ వైఎస్సార్‌సీపీలో చేరారు. అంతేకాక నందికొట్కూరు, పాణ్యం నియోజకవర్గాల్లో పట్టున్న బైరెడ్డి శేషశేనారెడ్డి కుటుంబం నుంచి బైరెడ్డి సిద్ధార్థరెడ్డి పార్టీలో చేరారు. త్వరలోనే ఆళ్లగడ్డకు చెందిన మాజీ టీడీపీ ఇన్‌చార్జి ఇరిగెల రాంపుల్లారెడ్డి పార్టీలో చేరనున్నారు. వీరితోపాటు కొందరు అధికార పార్టీ నేతలు, మాజీ ఎమ్మెల్యేలు వైఎస్సార్‌సీపీలోకి వచ్చేందుకు మొగ్గుచూపుతున్నారు.
టీడీపీ మోసాన్ని గమనించిన బీసీలు...
తెలుగుదేశం పార్టీ బీసీలకు చేస్తున్న మోసాన్ని పాదయాత్రలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎత్తి చూపారు. ఏళ్లుగా బీసీలను కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలకు వాడుకుంటున్న వైనాన్ని చక్కగా వివరించారు. అంతేకాక బీసీలను చట్టసభలకు పంపుతానని హామీ ఇచ్చారు. కర్నూలు పార్లమెంట్ స్థానం నుంచి బీసీలకే తన పార్టీ నుంచి టిక్కెట్ ఇస్తానని కోడుమూరు సమీపంలోని గోరంట్లలో జరిగిన బీసీ ఆత్మీయ సమ్మేళనంలో ప్రకటించారు. నాయీబ్రాహ్మణ, విశ్వబ్రాహ్ముణులకు ఎమ్మెల్సీలు ఇస్తానని జిల్లాలోనే ప్రకటన చేశారు. వీటితో బీసీలు సామాజికంగా, ఆర్థికంగా ఎదగడానికి కార్పొరేషన్లు, ఫెడరేషన్లను ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. బీసీ కులాలు ఎదుర్కొంటున్న సమస్యలపై అధ్యయనానికి పార్టీ పరంగా ఉన్నత స్థాయి కమిటీని నియమించారు. పాదయాత్ర ముగిసిన తరువాత బీసీ డిక్లరేషన్‌ను ప్రకటిస్తానని చెప్పడంతో బీసీలు రాజకీయ మార్పు దిశగా అడుగులు వేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ చేసిన మోసాన్ని గమనిస్తున్నారు. ఆదరణ పథకంలో తుప్పు బట్టిన పరికరాలు, ఎన్నికల్లో ఓటు బ్యాంకుగానే ఇన్నాళ్లు తెలుగుదేశం పార్టీ చూసిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నేడు మెజార్టీ బీసీ కులాలు వైఎస్సార్‌సీపీ వైపు చూస్తుండడంతో టీడీపీలో గుబులు రేపుతోంది. వచ్చే ఎన్నికల్లో ఓటమి తప్పదని కొందరు నాయకులు విశ్లేషణ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.
బీసీలు రాజకీయ మార్పును కోరుకుంటున్నారు
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో బీసీలకు పెద్ద గుర్తింపు ఉంది. గత ఎన్నికల్లో కర్నూలు ఎంపీ, ఆలూరు అసెంబ్లీకి బీసీలను బరిలో నిలిపి గెలిపించుకుంది. ఈసారి కూడా అదే ప్రాధాన్యం ఇస్తానని వైఎస్ జగన్ చెబుతున్నారు. చట్టసభల ముఖం చూడడని కులాలకు అవకాశం కల్పిస్తానని హామీ ఇచ్చారు. ఇన్నాళ్లు తెలుగుదేశం పార్టీ బీసీలకు చేస్తున్న మోసాన్ని ఇప్పుడిప్పుడే గమనిస్తున్నారు. కేవలం బీసీలను టీడీపీ ఓటు బ్యాంకుగానే చూస్తోంది. ఆర్థిక, సామాజిక ఎదుగుదల కోసం చర్యలు తీసుకోవడంలేదు. ఆదరణ పథకంలో తుప్పు బట్టిన పరికరాలు తప్ప వాటితో ఉపయోగం ఉండదు. మా పార్టీకి బీసీలే కొండంత అండా.
– బీవై రామయ్య,కర్నూలు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు
వైఎస్ జగన్ నిర్ణయంహర్షణీయం
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బీసీలను చట్టసభలకు పంపుతానని ప్రకటించడం హర్షణీయం. ఇప్పటికే పలు కులాలకు ఆయన హామీ ఇచ్చారు. అధికారంలోకి వస్తే ప్రతి బీసీ కులానికి కార్పొరేషన్ లేదా ఫెడరేషన్‌ను ఏర్పాటు చేస్తానని చెప్పారు. బీసీ డిక్లరేషన్‌ను ప్రకటిస్తానని, బీసీ కులాల సమస్యల అధ్యయనంపై కమిటీని వేశారు. తెలుగుదేశం, కాంగ్రెస్, జనసేన పార్టీలు బీసీలకు వైఎస్‌ఆర్‌సీపీ మాదిరిగానే ప్రాధాన్యం ఇవ్వాలి. లేదంటే వాటి అడ్రస్సులు గల్లంతే. – లక్ష్మీనరసింహ, బీసీ, ఎస్సీ, ఎస్టీ,మైనార్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు
Comments
Please login to add a commentAdd a comment