
సీమాంధ్రకు జరిగిన అన్యాయంపై రాష్ట్రపతికి జగన్ లేఖ
హైదరాబాద్: రాష్ట్ర విభజనపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి లేఖ రాశారు. మిమ్మల్ని నేరుగా కలిసి రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని వివరించాలనుకున్నా, అయితే అపాయింట్మెంట్ దొరకనందున లేఖ రాస్తున్నట్లు రాష్ట్రపతికి తెలిపారు. అధికార పక్షం, ప్రతిపక్షం కుమ్మక్కై రాజ్యాంగాన్ని, సాంప్రదాయాలను ఉల్లంఘించి రాష్ట్రాన్ని విభజించాయని ఆ లేఖలో తెలిపారు. స్వతంత్ర భారత చరిత్రలో అసెంబ్లీ తిరస్కరించిన బిల్లును పార్లమెంట్ ఆమోదించడం ఇదే తొలిసారని ఆయన తెలిపారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈ విభజన ఎంతవరకు సబబని ఆయన ప్రశ్నించారు.
రాష్ట్ర ఆదాయానికి సంబంధించి పూర్తి వివరాలను రాష్ట్రపతి రాసిన లేఖకు జతపరిచారు. అయిదేళ్ల ప్రత్యేక హొదాతో సీమాంధ్రకు ఒరిగేదేమీలేదు. ప్రత్యేక హోదా కనీసం 15 ఏళ్లపాటు ఉంచాలి. మా వినతులపై న్యాయబద్ధతతో కూడిన హామీ ఇవ్వండి. కొత్తరాజధాని నిర్మాణానికి సంబంధించి నిధుల మంజూరుపై బిల్లులో ఎలాంటి హామీలేదు. ఛత్తీస్గఢ్ ఏర్పడి 14 ఏళ్లు అవుతుంది. ఆ రాష్ట్ర రాజధాని నిర్మాణానికి అప్పట్లో 10వేల కోట్ల రూపాయల వ్యయాన్ని అంచనా వేశారు. కానీ కేంద్రం విదిల్చింది 400 కోట్ల రూపాయలే. ఇప్పుడు సీమాంధ్ర రాజధానికి మౌళిక నిర్మాణాలైన అసెంబ్లీ, హైకోర్టు, సెక్రటేరియట్, వివిధ ప్రభుత్వశాఖల భవనాలు, అంతర్జాతీయ విమానాశ్రయం... వంటి వాటికి వేలాది కోట్ల రూపాయలు అవసరం అమవుతాయి. వాటిని ఎలా సమకూరుస్తారో బిల్లులో పొందుపరచలేదు. సింగరేణి కాలరీస్లో కూడా సీమాంధ్రకు వాటా ఇచ్చేందుకు తిరస్కరించారు అని ఆ లేఖలో జగన్ వివరించారు.