మాట్లాడుతున్న సీఎం వైఎస్ జగన్. చిత్రంలో విశాఖ కలెక్టర్ వినయ్‌చంద్, సీఎస్ నీలం సాహ్ని
ఈ ఘటనలో 10 మంది ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరం. వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఆ మనుషులను వెనక్కి తీసుకురాలేకపోయినా, ఒక మంచి మనసున్న వ్యక్తిగా కచ్చితంగా ఆ కుటుంబాలకు అన్ని రకాలుగా తోడుగా ఉంటానని హామీ ఇస్తున్నాను.
చనిపోయిన ప్రతి వ్యక్తి కుటుంబానికి కోటి రూపాయల నష్టపరిహారం ప్రకటిస్తున్నాను. కంపెనీ పునఃప్రారంభమైన తర్వాత, లేదంటే వేరొక చోటుకు తరలించిన తర్వాతైనా సరే కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇచ్చేలా చూడాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్‌కు అప్పగించాను.
సాక్షి, విశాఖపట్నం: విపత్తుతో విషాదంలో ఉన్న బాధిత కుటుంబాలకు ఒక మంచి మనసున్న వ్యక్తిగా అన్ని విధాలా అండగా ఉంటానని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి భరోసా ఇచ్చారు. బాధిత కుటుంబాలకు ఎవరూ ఊహించని విధంగా నష్టపరిహారం ప్రకటించారు. విశాఖపట్నంలోని గోపాలపట్నం సమీపంలోనున్న ఎల్‌జీ పాలిమర్స్ కంపెనీలో గురువారం తెల్లవారుజామున గ్యాస్ లీక్ దుర్ఘటన విషయం తెలిసిన వెంటనే ఆయన స్పందించారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేసి.. మధ్యాహ్నం విశాఖకు చేరుకున్నారు. కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న ప్రమాద బాధితులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఆంధ్రా వైద్య కళాశాలలో అధికారులు, మంత్రులతో సమీక్ష నిర్వహించిన అనంతరం ప్రమాద బాధిత కుటుంబాలకు అన్నివిధాలా అండగా ఉంటామని చెప్పారు. ఈ సందర్భంగా సీఎం ప్రకటించిన వివరాలు ఇలా ఉన్నాయి.
ఈ ఘటన దురదృష్టకరం
► గురువారం తెల్లవారుజామున జరిగిన గ్యాస్ లీకేజీ ఘటన దురదృష్టకరం. స్టైరీన్ అనే ఒక హైడ్రోకార్బన్ ముడి సరుకును ఎక్కువ రోజులు నిల్వ చేయడం ఇందుకు కారణమైంది. ఈ గ్యాస్ లీక్ కావడం వల్ల ఐదు గ్రామాలు ప్రభావానికి గురి కావడం బాధాకరమైన అంశం.
► ఎల్‌జీ అనే ప్రముఖ సంస్థ నిర్వహిస్తున్న కంపెనీలో ఇలాంటి దుర్ఘటన చోటుచేసుకోవడం ఇంకా బాధాకరం. దీనిపై లోతుగా అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని కమిటీని వేస్తున్నాం. పర్యావరణం, అటవీ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ, పరిశ్రమల శాఖ కార్యదర్శి, కాలుష్య నియంత్రణ మండలి కార్యదర్శి, జిల్లా కలెక్టర్, విశాఖ నగర పోలీసు కమిషనర్ ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు.
► ఈ దుర్ఘటనకు కారణాలేమిటి? ఇలాంటివి పునరావృతం కాకుండా ఏం చేయాలి? అనే అంశాలపై అధ్యయనం చేసి, ఈ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా కంపెనీపై తదుపరి చర్యలు ఉంటాయి. చదవండి: విశాఖ విషాదం
వెంటిలేటర్ సాయంతో వైద్యం పొందుతున్న వారికి రూ.10 లక్షలు.. రెండు మూడు రోజుల పాటు చికిత్స అవసరమైన వారికి రూ.లక్ష.. ఆసుపత్రుల్లో ప్రాథమిక వైద్యం చేయించుకున్న వారికి రూ.25 వేలు చొప్పున ఆర్థిక సహాయం అందజేస్తాం.
గ్యాస్ లీక్ వల్ల ఆయా గ్రామాల ప్రజలపై నేరుగా కాకపోయినా, పరోక్షంగా కొద్ది రోజుల పాటు స్ట్రెస్ ఉంటుంది. వెంకటాపురం–1, వెంకటాపురం–2, ఎస్సీ, బీసీ కాలనీ, నందమూరినగర్, పద్మనాభనగర్ గ్రామాల్లోని ప్రజలు ఎలాంటి భయాందోళన చెందవద్దు. అన్ని రకాలుగా ప్రభుత్వం తోడు, నీడగా ఉంటుంది. ఈ గ్రామాల్లో 15,000 మంది వరకు నివాసం ఉంటారని తెలిసింది. ప్రతి ఒక్కరికీ రూ.10 వేలు ఆర్థిక సాయం చేస్తాం
కేజీహెచ్‌లో బాధితులను పరామర్శిస్తున్న సీఎం
వైద్యానికి ఒక్క రూపాయి కూడా చెల్లించొద్దు
► బాధితులెవ్వరూ ప్రస్తుతం ఆసుపత్రుల్లో వైద్యానికి అయ్యే ఖర్చు ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. పూర్తిగా కోలుకున్న తర్వాత ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యేటప్పుడు పరిహారం మొత్తాన్ని ఇచ్చి, సంతోషంగా ఇంటికి పంపించే ఏర్పాటు చేస్తాం.
► బాధిత గ్రామాల్లో మెడికల్ క్యాంపులు పెట్టాలని ఆదేశిస్తున్నాను. గ్రామాలకు వెళ్లలేని పరిస్థితుల్లో ఉన్న వారి కోసం షెల్టర్లు ఏర్పాటు చేయాలి. మంచి భోజనం పెట్టించాలి.
అలారం ఎందుకు మోగలేదు?
► గ్యాస్ లీక్ అయినప్పుడు అందరినీ అప్రమత్తం చేసే అలారం ఎందుకు మోగలేదు? ఇది నన్నెంతో కలతకు గురి చేస్తోంది.
► ఈ విషయం, మిగతా విషయాలపై కమిటీ నివేదిక వచ్చాక తదుపరి నిర్ణయం తీసుకుంటాం. వేరొక చోటుకు తరలించాల్సిన అవసరం ఉందని కమిటీ చెబితే.. నిర్మొహమాటంగా ఈ పరిశ్రమను తరలించేలా చూస్తాం.
ప్రభావిత గ్రామాల్లో కొంత మంది రైతులకు చెందిన పశువులు చనిపోయాయి. వారికి నూరు శాతం నష్ట పరిహారం ఇవ్వడమే కాకుండా అదనంగా రూ.20 వేలు సాయం చేస్తాం.
అధికారులకు అభినందనలు
► గ్యాస్ లీక్ దుర్ఘటన తెల్లవారుజామున జరిగిన వెంటనే 4.30 గంటలకే పోలీసులు.. డీసీపీ, 5 గంటలకే జిల్లా కలెక్టర్, ఇతర అధికారులు ఘటన స్థలికి వెళ్లారు. బాధితులకు సహాయం అందించే విషయంలో బాగా స్పందించారు.
► వెనువెంటనే అంబులెన్స్‌లు తరలించి, దాదాపు 348 మందిని ఆసుపత్రుల్లో చేర్పించారు. ఆ సమయంలో స్పృహలో లేని వారు సైతం ఆసుపత్రుల్లో వైద్యులు, ఆసుపత్రి సిబ్బంది అందించిన చికిత్సతో వెంటిలేటర్ అవసరం లేకుండా శ్వాస తీసుకునేంతగా కోలుకున్నారు. ఇందుకు కృషి చేసిన వారందరికీ అభినందనలు. చదవండి: యుద్ధ ప్రాతిపదికన స్పందించాం
Comments
Please login to add a commentAdd a comment