
రేపు నగరం గ్రామానికి వైఎస్ జగన్
తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు మండలం నగరంలో జరిగిన గెయిల్ పైపులైను పేలుడు సంఘటనపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సంఘటనలో మరణించిన వారి కుటుంబాలకు తన సంతాపం, సానుభూతి ప్రకటించారు. క్షతగాత్రుల పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తోందని, వారికి మెరుగైన చికిత్స అందించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రమాద సంఘటనపై విచారణ జరిపించాలని జగన్ కోరారు. కాగా, శనివారం నాడు నగరం గ్రామానికి వైఎస్ జగన్ వెళ్లనున్నారు.
కాగా.. క్షతగాత్రుల్లో ఎనిమిదిమందిని అమలాపురంలోని కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. వారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. తీవ్రంగా కాలిన గాయాలు కావడంతో వారిని కాపాడేందుకు వైద్యబృందాలు శ్రమిస్తున్నాయి. మరోవైపు రాజోలు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిలో ఇద్దరు మరణించారు. క్షతగాత్రులలో 15 మంది పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. వాళ్లు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు.