వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి (ఫైల్ ఫోటో)
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఆడపడుచుల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్రంగా దుయ్యబట్టారు. మధ్యాహ్న భోజనం వండే పనిని వారి నుంచి తప్పించి ప్రైవేటుకు అప్పగించడాన్ని వ్యతిరేకించారు. తాము అధికారంలోకి రాగానే ఈ దుస్థితిని సమూలంగా సంస్కరిస్తామని భరోసా ఇచ్చారు. ఈ మేరకు జగన్ మంగళవారం ట్వీట్ చేశారు. ‘‘చంద్రబాబు గారూ.. ఏమిటీ అమానుషం? వాళ్లేం తప్పు చేశారు? అధికారం ఉంది కదాని కర్కశంగా వ్యవహరిస్తారా? మహిళా పార్లమెంట్ విజయవాడలో నిర్వహించామని గొప్పలు చెప్పుకున్న మీరు.. అదే విజయవాడలో అక్కచెల్లెమ్మల పట్ల ప్రవర్తిస్తున్న తీరు సిగ్గుచేటు కాదా? వారిపట్ల దురుసుగా ప్రవర్తించడం అత్యంత హేయం, దారుణం కాదా?
మీ ప్రభుత్వం సరిగా వేతనాలు ఇవ్వకున్నా, ఐదారు నెలలుగా సరుకుల బిల్లులు చెల్లించకపోయినా.. 85 వేల మంది అప్పోసొప్పో చేసి పిల్లలకు భోజనం వండి పెడుతున్నారు. అయినా సరే దేశంలో ఎక్కడా లేని విధంగా భోజనం వండే పని నుంచి వారిని తొలగించి, ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగించడానికి ఈ సర్కారు తహతహలాడుతోంది. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మధ్యాహ్న భోజనం వండే పనిని అక్కచెల్లెమ్మలకే అప్పగిస్తాం. వారికి గౌరవ వేతనం పెంచి అండగా ఉండటంతో పాటు.. పిల్లలకు పౌష్టికాహారం అందేలా భోజన ధరలు పెంచి, బిల్లులు సకాలంలో చెల్లిస్తాం’’ అని ఆయన తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
— YS Jagan Mohan Reddy (@ysjagan) 7 August 2018
Comments
Please login to add a commentAdd a comment