
ములాయంతో వైఎస్ జగన్ భేటీ
ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాస్వామ్యాన్ని నిలువునా ఖూనీ చేస్తున్న విషయమై ఢిల్లీలో పలువురు పెద్దలను కలుస్తున్న ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. శుక్రవారం ఉదయం సమాజ్‌వాదీపార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్‌ను కలిశారు.
ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాస్వామ్యాన్ని నిలువునా ఖూనీ చేస్తున్న విషయమై ఢిల్లీలో పలువురు పెద్దలను కలుస్తున్న ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. శుక్రవారం ఉదయం సమాజ్‌వాదీపార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్‌ను కలిశారు. రాష్ట్రంలో జరుగుతున్న ఫిరాయింపుల వ్యవహారాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. వైఎస్ఆర్‌సీపీ తరఫున గెలిచి, తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరిన 21 మంది ఎమ్మెల్యేలలో నలుగురికి మంత్రిపదవులు కట్టబెట్టిన వైనాన్ని వివరించారు. దాదాపు అరగంట పాటు ములాయంతో సమావేశమైన జగన్.. అసలు స్పీకర్ వద్ద అనర్హత పిటిషన్లు పెండింగులో ఉండగానే ఆ నలుగురిని ఎలా మంత్రులు చేస్తారని అడిగారు.
ఇలాగే జరుగుతుంటే దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ కుప్పకూలే ప్రమాదం ఉందని, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ముందుకు రావాలని కోరారు. తాము ఇచ్చిన అనర్హత పిటిషన్లపై అసెంబ్లీ స్పీకర్ చర్యలు తీసుకోవడం లేదని, ఇలాంటి పరిస్థితుల్లో ఫిరాయింపుల నిరోధక చట్టానికి పదును పెట్టాల్సి ఉందని ఆయనకు తెలియజెప్పారు. ముఖ్యమంత్రి, స్పీకర్, గవర్నర్.. ఈ ముగ్గురూ ఉన్నా కూడా ప్రజాస్వామ్యానికి పాతరేశారని చెప్పారు. వైఎస్ జగన్ వాదనకు ములాయం సింగ్ యాదవ్ కూడా సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది. ములాయం సింగ్‌ను కలిసిన వారిలో వైఎస్ జగన్‌తో పాటు పార్టీ ఎంపీలు వైఎస్ అవినాష్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, మిథున్ రెడ్డి, మేకపాటి రాజమోహనరెడ్డి ఇతర నేతలు ఉన్నారు.