హైదరాబాద్: స్వాతంత్ర్య సమరయోధుడు, మాజీ మంత్రి భాట్టం శ్రీరామమూర్తి(89) మృతి పట్ల వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. కాగా శ్రీరామమూర్తి మృతికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ఎపీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి లు తమ సంతాపాన్ని ప్రకటించారు.
కాగా గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో భాదపడుతున్న శ్రీరామమూర్తి విశాఖలోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మరణించారు. గతంలో ఆయన ఎమ్మెల్యేగా , ఒకసారి ఎంపీగా పనిచేశారు. భాట్టం శ్రీరామమూర్తి 1926, మే 12న విజయనగరం జిల్లా ధర్మవరం గ్రామంలో జన్మించారు. మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కేబినెట్ లో ఆయన మంత్రిగా కూడా పనిచేశారు. భాట్టం కు ఓ కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.