
ఇడుపులపాయ చేరుకున్న జగన్
వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కొద్ది సేపటి క్రితమే ఇడుపులపాయ చేరుకున్నారు.
ఇడుపులపాయ : వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి కొద్ది సేపటి క్రితమే ఇడుపులపాయ చేరుకున్నారు. పదహారు నెలల నిర్బంధం తర్వాత ఆయన తొలిసారిగా తండ్రి సమాధిని దర్శించుకోనున్నారు. తెల్లవారుజామున ఐదుగంటలకు వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌లో ఎర్రగుంట్ల రైల్వే స్టేషన్‌కు జగన్ చేరుకున్నారు. ఈ సందర్భంగా జగన్‌ను చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. అభిమానుల తాకిడిని ముందుగానే అంచనా వేసిన పోలీసులు భారీగా బలగాలను మోహరించారు.
అర్థరాత్రే రైల్వే స్టేషన్‌కు చేరుకొని జగన్‌ను చూసేందుకు గంటల తరబడి ఎదురు చూసిన అభిమానులు.... జగన్ రాకతో ఒక్కసారిగా భావోద్వేగానికి లోనయ్యారు. జగన్‌ను తాకేందుకు.... ఆయనతో మాట్లాడేందుకు పోటీ పడ్డారు. అభిమానులను అదుపు చేయలేక పోలీసులు ఇబ్బంది పడ్డారు. అభిమానులకు అభివాదం చేస్తూ ముందుకు సాగిన జగన్ రైల్వే స్టేషన్ నుంచి నేరుగా ఇడుపులపాయకు చేరుకున్నారు.