వెంకటేష్ కుటుంబాన్ని పరామర్శించిన వైఎస్ జగన్
మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి మరణవార్త జీర్ణించుకోలేక అసువులు భాసిన వెంకటేష్ కుటుంబాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరామర్శించారు. ఆయన ఈరోజు మధ్యాహ్నం కుప్పం నియోజకవర్గంలోని పైపాళ్యం చేరుకుంటారు. అక్కడ వైఎస్ మరణవార్త విని గుండెపోటుతో మరణించిన వెంకటేష్ కుటుంబాన్ని ఓదార్చిన జగన్ వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అంతకు ముందు తమిళనాడు సరిహద్దు క్రిష్ణగిరిలో యువనేతకు ప్రజల ఘన స్వాగతం పలికారు.
మరోవైపు కుప్పంలో జనం పోటెత్తారు. కార్యకర్తలు, సమైక్యవాదులతో రోడ్లు కిక్కిరిసాయి. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. జగన్ను చూసేందుకు అభిమానులు పోటెత్తారు. కాగా జగన్ ఎడుంగపల్లెలో, మల్లానూరు క్రాస్‌లో మహానేత విగ్రహాలను ఆవిష్కరిస్తారు. ఆ తర్వాత కుప్పం చేరుకుని బస్డాండ్ కూడలిలో వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించి బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అనంతరం అదే ప్రాంతంలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పుష్పాంజలి ఘటిస్తారు. సాయంత్రానికి గుడుపల్లె మండలం కంచిబందార్లపల్లెకు చేరుకుని లక్ష్మి కుటుంబాన్ని ఓదార్చుతారు.