వైద్యం అందించటంపై దృష్టి పెట్టాలి: సీఎం జగన్‌ | YS Jagan Mohan Reddy Review Meeting On Coronavirus In Amaravati | Sakshi
Sakshi News home page

వైద్యం అందించటంపై దృష్టి పెట్టాలి: సీఎం జగన్‌

Published Sat, May 9 2020 3:06 PM | Last Updated on Sat, May 9 2020 8:05 PM

YS Jagan Mohan Reddy Review Meeting On Coronavirus In Amaravati - Sakshi

సాక్షి, అమరావతి: కరోనా(కోవిడ్-19)‌ వల్ల మరణాలు లేకుండా మంచి వైద్యాన్ని అందించడంపై దృష్టిపెట్టాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. కోవిడ్‌-19పై క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్‌ జగన్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధ పడుతున్న వారే రాష్ట్రంలో మరణిస్తున్నారని అధికారులు సీఎం జగన్‌ దృష్టికి తీసుకువచ్చారు. కోవిడ్-19‌ అనుమానం ఉంటే వెంటనే సమాచారం ఇస్తే ఈ ముప్పు తప్పుతుందని, దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టామని అధికారులు సీఎంకి తెలిపారు.  (సమగ్ర కార్యాచరణతో రండి)

కోవిడ్‌ పరీక్షల్లో ప్రథమ స్థానం:
ప్రతి మిలియన్‌ జనాభాకు అత్యధిక పరీక్షలతో దేశంలో ప్రధమస్థానంలో ఆంధ్రప్రదేశ్‌ కొనసాగుతుందని అధికారులు సీఎంకి వివరించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 1,65,069 పరీక్షలు చేశామని సీఎం వైఎస్‌ జగన్‌కి అధికారులు తెలిపారు. నిన్న ఒక్క రోజే రాష్ట్ర వ్యాప్తంగా 8388 పరీక్షలు నిర్వహించామని, రాష్ట్రంలో ప్రతి మిలియన్‌కు 3091 పరీక్షలు చేస్తున్నామని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. పాజిటివ్‌ కేసుల నమోదురేటు రాష్ట్రంలో 1.17 శాతం కాగా, దేశంలో 3.92 శాతం ఉందని అధికారులు అన్నారు. మరణాలరేటు కూడా ఏపీలో 2.28 శాతం ఉండగా, దేశంలో 3.3 శాతం నమోదు అయిందని అధికారులు తెలిపారు. (కరోనా నియంత్రణ ఏపీలో బాగుంది)

డిశ్చార్జీలు పెరుగుతున్నాయి: 
రాష్ట్రంలో కొత్తగా నమోదవుతున్న కేసుల కన్నా డిశ్చార్జీల సంఖ్య పెరుగుతోందని అధికారులు సీఎం వైఎస్‌ జగన్‌కి వివరించారు. నిన్న(శుక్రవారం) రాష్ట్ర వ్యాప్తంగా 43 కేసులు నమోదైతే 45 మంది డిశ్చార్జ్‌ అయ్యారని అధికారులు తెలిపారు. నిన్న నమోదైన కేసుల్లో 31 కేసులు పాత క్లస్టర్ల నుంచే వచ్చాయని అధికారులు సీఎం వైఎస్‌ జగన్‌ దృష్టికి తీసుకువచ్చారు.

చెన్నైలోని కోయంబేడు మార్కెట్‌కు వెళ్లిన రైతులతో పాటు, అక్కడి నుంచి ఇక్కడకు వచ్చిన వారిమీద కూడా దృష్టిపెట్టామని అధికారులు తెలిపారు. కోయంబేడు మార్కెట్‌ వల్ల చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో కేసులు పెరుగుతున్నాయని చెప్పారు. రాష్ట్రానికి తిరిగి వస్తున్న వలస కార్మికులపై దృష్టి సారించామని అధికారలు సీఎం జగన్‌కు వివరించారు. కంటైన్‌మెంట్‌ క్లస్టర్లలో ఉంటున్నవారికి ఎక్కువగా పరీక్షలు చేస్తున్నామని తెలిపారు. వైరస్‌వ్యాప్తి దాదాపుగా కంటైన్‌మెంట్‌ క్లస్టర్లకే పరిమితం చేయగలుగుతున్నామని ముఖ్యమంత్రికి అధికారులు తెలియజేశారు.

కూలీల రాక: 
700 మంది కూలీలు ఎలాంటి అనుమతులు, పరీక్షలు లేకుండానే రాష్ట్రంలోకి ప్రవేశించారని అధికారులు సీఎం జగన్‌కు తెలిపారు. స్థానిక అధికారుల సహాయంతో వారి వివరాలు కనుక్కొని పరీక్షలు చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని అధికారులు వివరించారు. ఐసోలేషన్‌ ప్రక్రియను మొదలుపెట్టామని, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారితో వైరస్‌ ముప్పు పొంచి ఉందని అధికారులు సీఎం జగన్‌కి తెలియజేశారు. వారిపై ప్రత్యేక దృష్టిపెడుతున్నామని అధికారులు సీఎం వైఎస్‌ జగన్‌కి చెప్పారు.

టెలి మెడిసిన్‌: 
టెలి మెడిసిన్‌పై ప్రత్యేక దృష్టి పెట్టామని ద్విచక్ర వాహనాల కొనుగోలుకు చర్యలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు. ఇప్పుడు దాదాపు 500 కాల్స్‌ మాత్రమే పెండింగులో ఉన్నాయని అధికారులు సీఎం జగన్‌కి చెప్పారు. రోగులు కాల్‌ చేసిన 24 గంటల్లోగా వారికి ఔషదాలు అందిస్తున్నామని అధికారులు అన్నారు. 

సరిహద్దుల్లో వైద్య పరీక్షలు:
సరిహద్దుల్లోని 11 చెక్‌ పోస్టుల వద్ద వైద్య పరీక్షల కోసం ఏర్పాట్లు చేశామని, వైద్యులు కూడా అక్కడ అందుబాటులో ఉన్నారని సీఎం వైఎస్‌‌ జగన్‌కు అధికారులు వివరించారు. సరిహద్దులు దాటి వచ్చే వారికి థర్మల్‌ స్క్రీనింగ్‌ ప్రాథమిక పరీక్షలు చేస్తున్నామని అధికారులు ముఖ్యమంత్రికి తెలియజేశారు.

ఆక్వాపై ఆరా తీసిన సీఎం వైఎస్‌ జగన్‌: 
ఆక్వా ఫీడ్‌ రేటు పెరగడంపై సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆరా తీశారు. రైతులను ఆదుకునేలా చర్యలు తీసుకోవాలని సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు.

విశాఖలో వెటర్నరీ సేవలు: 
విశాఖపట్నంలో గ్యాస్‌ లీక్‌ అయిన ప్రాంతాల్లో పశువులకు చికిత్స చేస్తున్నామని అధికారులు సీఎం జగన్‌కు తెలిపారు. 13 వెటర్నరీ బృందాలు పని చేస్తున్నాయని, పశువులకు సెలైన్‌లు ఎక్కించడంతో పాటు, అవసరమైన వైద్య సేవలందిస్తున్నామని అధికారులు సీఎం వైఎస్‌ జగన్‌ దృష్టికి తీసుకువచ్చారు. ఈ సమీక్షలో వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ కె. ఎస్‌. జవహర్‌రెడ్డి, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement