ఉద్యోగాంధ్ర | YS Jagan Mohan Reddy set a new record with above 4 lakh new jobs | Sakshi
Sakshi News home page

ఉద్యోగాంధ్ర

Published Mon, Jul 22 2019 2:53 AM | Last Updated on Mon, Jul 22 2019 8:11 AM

YS Jagan Mohan Reddy set a new record with above 4 lakh new jobs - Sakshi

రాష్ట్ర చరిత్రలో నూతన శకానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శ్రీకారం చుట్టారు.. రాష్ట్రంలోని నిరుద్యోగుల ఆశలు నెరవేర్చేలా ఒకేసారి లక్షలాది ఉద్యోగ నియామకాలకు నాంది పలికారు.. ఈ పరిణామంతో ప్రజల లోగిళ్లకు ప్రభుత్వ పథకాలు చేరడానికి మార్గం సుగమం అవుతోంది.. ప్రభుత్వ వ్యవస్థ కూతవేటు దూరానికి తరలివస్తోంది.. సర్కారు విప్లవాత్మక నిర్ణయాలతో రాష్ట్రంలో సువర్ణయుగం ప్రారంభమైంది. 

సాక్షి, అమరావతి: రాష్ట్ర చరిత్రలోనే కాకుండా దేశంలోని ఏ రాష్ట్రంలోనూ ఎన్నడూ లేని రీతిలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  ఏకంగా 4.01 లక్షల కొత్త ఉద్యోగ నియామకాలు చేపట్టి రికార్డు సృష్టించారు. ప్రజలకు ప్రభుత్వ వ్యవస్థను మరింత దగ్గర చేయడంతో పాటు ప్రభుత్వ పథకాలను లబ్ధిదారుల ఇళ్లకే చేర్చే కార్యక్రమాలకు ఈ ఉద్యోగ నియామకాల ద్వారా శ్రీకారం చుడుతున్నారు. అదీ ఒకేసారి ఇన్ని లక్షల ఉద్యోగాలు నిరుద్యోగ యువతకు అందుతుండడం ఒక అపూర్వఘట్టం. చరిత్ర పుటల్లో చిరస్థాయిగా నిలిచిపోయే రికార్డు. ఈ ఉద్యోగ నియామకాలతో పరిపాలనా వ్యవస్థ రూపురేఖలే పూర్తిగా మారిపోనున్నాయి. స్థానిక పరిపాలనా వ్యవస్థ మరింత బలోపేతం కానుంది. ప్రజలకు ప్రభుత్వ యంత్రాంగం మరింత సన్నిహితం కావడమే కాకుండా ప్రభుత్వ పథకాలు ప్రజలకు నేరుగా వారి ఇళ్ల వద్దకే చేరనుండడం విశేషం.

ఈ ఉద్యోగాల్లో 1,33,494 శాశ్వత ఉద్యోగాలు కావడం గమనార్హం. గ్రామ, వార్డు సచివాలయాల్లో వివిధ సేవలందించేందుకు ఈ శాశ్వత ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. అక్టోబర్‌ 2వ తేదీ నుంచి గ్రామ సచివాలయాల సేవలు ప్రజలకు అందుబాటులోకి తేవడానికి వీలుగా ఈ ఉద్యోగ నియామకాలను యుద్ధ ప్రాతిపదికన ప్రభుత్వం చేపట్టింది. శాశ్వత ఉద్యోగాలతో పాటు గ్రామ, పట్టణ ప్రాంతాల్లో దాదాపు 50 ఇళ్లకు ఒక వలంటీర్‌ను నియమిస్తున్నారు. తద్వారా 2,67,506 మంది నిరుద్యోగ యువతకు స్థానికంగానే స్వచ్ఛంద సేవకునిగా ఉద్యోగ అవకాశం లభించనుంది. శాశ్వత ఉద్యోగాల్లో నియామకమయ్యే వారికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం వేతన, భత్యాలు అందనుండగా వలంటీర్లకు ప్రతినెలా రూ.5 వేల చొప్పున గౌరవ వేతనం చెల్లించనున్నారు. 

ప్రజలకు ఇక త్వరితగతిన సేవలు
దాదాపు దశాబ్దం కాలంగా ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు లేక ఉపాధి అవకాశాలూ కానరాక రాష్ట్రంలోని లక్షలాది నిరుద్యోగ యువత తీవ్ర నిరాశ, నిస్పృహల్లో కొట్టుమిట్టాడుతోంది. వీరిని ఆదుకొంటామని, వారికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేలా ఉద్యోగ నియామకాలు చేపడతామని ఎన్నికలకు ముందు నుంచే వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటిస్తూ వచ్చారు. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను తీసుకు వస్తామని, వాటి ద్వారా శాశ్వత ఉద్యోగాలను కల్పిస్తామని హామీ ఇచ్చారు. అదే విధంగా ప్రభుత్వ పథకాలను నేరుగా లబ్ధిదారుల ఇళ్లకే అందించేలా వలంటీర్లను నియమిస్తామన్నారు.

అధికారంలోకి వచ్చిన నెలన్నరలోనే వాటికి కార్యరూపం ఇవ్వడం విశేషం. గతంలో ఏ ప్రభుత్వ హయాంలో కూడా ఇంత పెద్ద ఎత్తున ఉద్యోగ నియామకాలు జరగలేదని, ఈ ప్రభుత్వం తమ జీవితాలకు వెలుగులు ప్రసాదించిందని నిరుద్యోగ యువత హర్షం వ్యక్తం చేస్తోంది. మరోపక్క క్షేత్ర స్థాయిలో కొన్ని దశాబ్దాలుగా ఉద్యోగ నియామకాలు లేక ప్రభుత్వ కార్యక్రమాల అమలు కుంటు పడుతోంది. ప్రస్తుతం ఈ ఉద్యోగ నియామకాలతో ప్రభుత్వ కార్యక్రమాల అమలు ఊపందుకోవడంతో పాటు పాలనా వ్యవహారాలు పరుగులు తీయడానికి, ప్రజలకు సమర్థవంతంగా సేవలందించడానికి దోహదపడుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. 

గ్రామాల్లో 99,144, పట్టణాల్లో 34,350 ఉద్యోగాలు
ప్రభుత్వం ఒకేసారి పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని నిరుద్యోగ యువతకు లక్షలాది ఉద్యోగాలు కల్పిస్తుండడంతో యువతలో ఒక్కసారిగా ఉత్సాహం పెల్లుబుకుతోంది. ఈ ఉద్యోగాల సాధన ద్వారా తమ జీవితాల్లో కొత్త వెలుగులు సంతరించుకుంటాయని భావిస్తున్నారు. ‘గత కొన్నేళ్లుగా ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్‌ల కోసం ఎదురు చూశాం. గత ప్రభుత్వ హయాంలో ఆశించిన నోటిఫికేషన్లు లేవు. వచ్చినా ఆ పోస్టులు పూర్తిగా భర్తీ చేయలేదు. ఇప్పుడు ఒక్కసారిగా లక్షల్లో ఉద్యోగాలు అందుబాటులోకి రావడం మాకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది’ అని విజయవాడలో శిక్షణ పొందుతున్న పలువురు నిరుద్యోగులు అభిప్రాయపడ్డారు. మొత్తం 1,33,494 శాశ్వత ఉద్యోగాల్లో 34,350 పట్టణ ప్రాంతాల్లోని సచివాలయాల ద్వారా అందుతుండగా.. మిగతా 99,144 పోస్టులు గ్రామ సచివాలయాల ద్వారా అందుబాటులోకి వస్తున్నాయి. ఇవి కాకుండా పట్టణాల్లో 74,185, గ్రామాల్లో 1,93,321 వలంటీర్ల పోస్టులు యువతకు వరంగా మారుతున్నాయి. 

పంచాయతీ వ్యవస్థ పరిపుష్టం
ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేస్తున్న గ్రామ సచివాలయాల ఉద్యోగాల వల్ల పంచాయతీ వ్యవస్థ మరింత పరిపుష్టం కానుంది. పంచాయతీలు, ఇతర స్థానిక సంస్థలకు కేంద్రం 1994లోనే అనేక అధికారాలు కల్పించినా.. నాటి తెలుగుదేశం ప్రభుత్వం ఆ అధికారాలను వాటికి దక్కకుండా తన గుప్పెట్లోనే పెట్టుకుంది. ఆ తర్వాత దివంగత వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పంచాయతీలకు అధికారాలు బదలాయించారు. అయితే తదనంతర ముఖ్యమంత్రులు వాటి ద్వారా ప్రజలకు సేవలందించేందుకు వీలుగా సిబ్బందిని నియమించలేదు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ ఉద్యోగ నియామకాలకు యుద్ధ ప్రాతిపదికన శ్రీకారం చుట్టారు. తద్వారా లక్షలాది మంది నిరుద్యోగ యువతకు మేలు చేకూర్చడంతో పాటు వైఎస్‌ జగన్‌ మానస పుత్రికలైన నవరత్నాల పథకాలను ప్రజలకు సమర్థవంతంగా అందించడంలో ఈ నూతన ఉద్యోగ వ్యవస్థ కీలక భూమిక పోషించనుంది. అదే సమయంలో పంచాయతీల స్వయం ప్రతిపత్తి దెబ్బతినకుండా గ్రామ సచివాలయంలో పనిచేసే ఉద్యోగులకు పంచాయతీ కార్యదర్శే కన్వీనర్‌గా వ్యవహరించేలా, వీరందరినీ పర్యవేక్షిస్తూ సెలవులు ఇచ్చే అధికారం సర్పంచులకే ఉండేలా వ్యవస్థను తీర్చిదిద్దారు. ప్రభుత్వం నియమించే గ్రామ వలంటీర్లు ఈ సచివాలయ పరిధిలోకి వస్తారు.

కూతవేటు దూరంలో ప్రభుత్వ యంత్రాంగం
గ్రామ, పట్టణ వార్డు సచివాలయాల్లో లక్షలాది ఉద్యోగుల నియామకం, అంతకు రెట్టింపు సంఖ్యలో వలంటీర్ల ఏర్పాటుతో రాష్ట్రంలోని ప్రజానీకానికి ప్రభుత్వ యంత్రాంగ సేవలు కూతవేటులో అందుబాటులోకి రానున్నాయి. ఈ ఉద్యోగ నియామకాలను ప్రభుత్వం అత్యంత పారదర్శక విధానంతో భర్తీ చేయడానికి చర్యలు చేపట్టింది. ఇప్పటికే వలంటీర్ల ఇంటర్వ్యూలు ప్రారంభమయ్యాయి. శాశ్వత ఉద్యోగాలకు కావలసిన అర్హతలను, ఇతర నైపుణ్యాలను నిర్దేశిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. పట్టభద్రులు, ఇంజనీర్లు, పాలిటెక్నిక్‌ డిప్లొమో పూర్తి చేసిన వారు, డిగ్రీలో సోషల్‌ వర్క్, నర్సింగ్‌లో ఫార్మా డీ చేసిన అభ్యర్థులు వీటికి అర్హులు. రాత పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

ఉద్యోగాల కల్పనలో మొన్నటి దాకా బిహారే నయం
బాబు వస్తేనే జాబు వస్తుందంటూ 2014 ఎన్నికల ముందు ఊరూ వాడా ఊదర గొట్టిన చంద్రబాబు.. సీఎం పదవి చేపట్టిన తర్వాత కొత్తగా జాబులు ఇవ్వకపోగా ఉన్న ఉద్యోగాలను సైతం పీకేశారు. బాబు ఐదేళ్ల పదవీ కాలంలో ఖాళీగా ఉన్న రెండున్నర లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయకపోగా, ఖాళీగా ఉన్న నాలుగవ తరగతి పోస్టులను ఏకంగా రద్దు చేశారు. దీంతో గత ఐదేళ్లలో నిరుద్యోగ సమస్య పెరిగిపోయింది. ఉద్యోగాల కల్పనలో బిహార్‌ రాష్ట్రం కన్నా ఆంధ్రప్రదేశ్‌ అధ్వాన్నంగా తయారైందని 2017–18 లేబర్‌ ఫోర్స్‌ సర్వే వెల్లడించింది. రాష్ట్రంలో పట్టణాల కన్నా గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగ సమస్య అత్యధికంగా ఉందని ఈ సర్వే స్పష్టం చేసింది. పట్టణ ప్రాంతాల్లో 13.4 శాతం, గ్రామీణ ప్రాంతాల్లో 22.8 శాతం నిరుద్యోగ సమస్య పట్టి పీడిస్తోందని సర్వే వెల్లడించింది. పట్టణ ప్రాంతాల్లో పురుషుల కన్నా మహిళా నిరుద్యోగుల సంఖ్య భారీగా ఉన్నట్లు స్పష్టం చేసింది. పట్టణ ప్రాంతాల్లో 27 శాతం మహిళల్లో నిరుద్యోగం ఉండగా. పురుషుల్లో 20.4 శాతం నిరుద్యోగులున్నారని సర్వే గణాంకాలు వెల్లడించాయి.

రాష్ట్రంలో పట్టభద్రుల్లో అత్యధికంగా 23.6 శాతం మంది నిరుద్యోగులుగా ఉన్నారని, డిప్లమా/ సర్టిఫికెట్‌ హోల్డర్లలో 17.6 శాతం నిరుద్యోగులుగా ఉన్నారని సర్వే పేర్కొంది. సెకండరీ, ఉన్నత విద్యలో బిహార్‌ కన్నా అత్యధికంగా ఆంధ్రప్రదేశ్‌లోనే నిరుద్యోగులున్నారని, దేశ సగటు కన్నా రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య అధికంగా ఉందని స్పష్టం చేసింది. దీంతో పాటు జాతీయ కుటుంబ సర్వే – 4 ప్రకారం చూసినా రాష్ట్రంలో ఉద్యోగాలు లేని వారి సంఖ్య బాగా పెరిగింది. రాష్ట్రంలో 2005–06లో 15 – 49 ఏళ్ల మధ్య వయస్సు వారిలో ఉద్యోగాలు లేని పురుషులు 0.8 శాతం ఉండగా 2015–16 లో ఇది 3.9 శాతానికి పెరిగినట్లు జాతీయ కుటుంబ సర్వే స్పష్టం చేసింది. ఇదే వయస్సు గల వారిలో ఉద్యోగాలు చేస్తున్న పురుషులు 2005–06లో 87.5 శాతం ఉండగా 2015–16 నాటికి 79.6 శాతానికి తగ్గిపోయినట్లు ఆ సర్వే స్పష్టం చేసింది. ఇదే వయస్సు గల వారిలో ఉద్యోగాలు చేస్తున్న మహిళలు 2005–06లో 50 శాతం ఉండగా, 2015–16 నాటికి 33 శాతానికి పడిపోయిందని సర్వే వెల్లడించింది. 

ఇదో సువర్ణావకాశం
మన ముఖ్యమంత్రి ప్రవేశ పెట్టిన గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో 1.33 లక్షల మందికి ఉపాధి దొరకడం మంచి పరిణామం. దీంతో పాటు ఈ ఉద్యోగులు తమ గ్రామ ప్రజలకు అంకిత భావంతో సేవలు అందిస్తా్తరు. దీనివల్ల సమర్థవంతమైన పరిపాలన ప్రజలకు అందుతుంది. తమ ప్రాంత ప్రజలకే సేవలందిస్తున్నామనే భావన వల్ల అవినీతికి అవకాశం ఉండదు. ఇదే సమయంలో ఇప్పటికే పంచాయతీలలో సేవలు అందిస్తున్న వారికి ఉద్యోగ భరోసా కల్పిస్తే గ్రామ పరిపాలనలో అసంతృప్తికి అవకాశం ఉండదు. మొత్తం మీద గ్రామ సచివాలయ వ్యవస్థ వల్ల ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుంది. రాషŠట్ర చరిత్రలోనే గతంలో ఎన్నడూ లేనంతగా నిరుద్యోగులకు ఇదో సువర్ణావకాశం.    
    – టీఎంబీ బుచ్చిరాజు, చైర్మన్‌. ఆర్‌ విక్టర్, కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఆంధ్ర ప్రదేశ్‌ పంచాయతీరాజ్‌ సర్వీసెస్‌ అసోసియేషన్‌

నిరుద్యోగుల్లో హర్షాతిరేకాలు
ఉద్యోగాల భర్తీకి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి శరవేగంగా తీసుకుంటున్న చర్యలు నిరుద్యోగుల్లో ఆనందం కలిగిస్తున్నాయి. 4 లక్షలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేయడం రాష్ట్ర చర్రితలో సువర్ణాక్షరాల్లో లిఖించదగ్గ రికార్డు. ఇది నిరుద్యోగులకు ఉపాధి కల్పన పట్ల జగన్‌ మోహన్‌రెడ్డికి ఉన్న నిబద్ధతకు నిదర్శనం. గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్య స్థాపనకు జగన్‌ సర్కారు బాటలు వేస్తోందని చెప్పవచ్చు. ప్రతి 50 ఇళ్లకు ఒక వలంటీర్‌ను నియమించి ప్రభుత్వ పథకాలను లబ్ధిదారుల ఇళ్లకే చేర్చడం విప్లవాత్మక చర్య.
– వెంకట్రామిరెడ్డి, ప్రభుత్వ ఉద్యోగుల, పెన్షనర్ల సమాఖ్య అధ్యక్షుడు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement