ఐదు నిమిషాలు కేటాయిస్తే ఏమైనా నష్టమా?
హైదరాబాద్ : డ్వాక్రా రుణాలపై తామిచ్చిన వాయిదా తీర్మానంపై చర్చించేందుకు ఐదు నిమిషాలు కేటాయిస్తే ఏమైనా నష్టం జరుగుతుందా అని విపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రశ్నించారు. అయిదు నిమిషాలు సమయం ఇచ్చేందుకు కూడా సిద్ధంగా లేరంటే ఇది కౌరవ సభ అని చెప్పడానికి వేరే కారణాలు కనిపించడం లేదన్నారు. కాగా డ్వాక్రా రుణాలపై తామిచ్చిన వాయిదా తీర్మానంపై చర్చ జరగాలని వైఎస్‌ఆర్‌సీపీ సభ్యులు మంగళవారం అసెంబ్లీలో డిమాండ్ చేశారు.
తిరస్కరించిన తీర్మానంపై చర్చకు అవకాశముండదని స్పీకర్ కోడెల శివప్రసాదరావు అన్నారు. ఈ క్రమంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ డ్వాక్రా రుణాలకు సంబంధించిన వివరాలు సభ ముందుంచారు. రాష్ట్రవ్యాప్తంగా రూ.14,204 కోట్ల డ్వాక్రా రుణాలు ఉన్నాయని వైఎస్ జగన్ చెబుతుండగా మరోవైపు అధికార పార్టీ సభ్యులు ఆయన ప్రసంగాన్ని అడ్డుకున్నారు.
చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యేనాటికి రూ.14,204 కోట్ల డ్వాక్రా రుణాలు ఉన్నాయని, ఇప్పటివరకు రూ.1000 కోట్ల డ్వాక్రా రుణామలు మాత్రమే రెన్యువల్ అయ్యాయన్నారు. ముఖ్యమైన అంశంపై చర్చించడానికి 5 నిమిషాల సమయం కూడా ఇవ్వరా అని వైఎస్ జగన్ ఈ సందర్భంగా ప్రశ్నించారు. ఈ ఏడాది బ్యాంకులు రూ.2 వేల కొత్త రుణాలు మహిళలకు ఇచ్చాయన్నారు. జగన్ వివరాల్లోకి వెళ్తున్నారంటూ స్పీకర్ మైక్ కట్ చేశారు. దీంతో వైఎస్‌ఆర్‌సీపీ సభ్యులు పొడియంలోకి వచ్చి స్పీకర్‌తో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో స్పీకర్ సభను పది నిమిషాలు వాయిదా వేశారు.