అసెంబ్లీ సాక్షిగా బాబు పాలనను ఎండగట్టిన జగన్
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ శాసనసభ సాక్షిగా చంద్రబాబు నాయుడు గత పాలనను ప్రధాన ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ ఎండగట్టారు. ఆంధప్రదేశ్ లోటు బడ్జెట్‌కు పదేళ్ల చంద్రబాబు పాలనే కారణమని ఆయన గణాంకాలు ద్వారా నిరూపించారు. ప్రతి ఏడాది ఆర్థిక లోటుతో పదేళ్ల పాలనకు గాను రాష్ట్రంపై 21 వేల, 999 కోట్ల రూపాయల ఆదాయ లోటును వేశారని వైఎస్ జగన్ అన్నారు. ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా ప్రవేశపెట్టకుండా...ఉన్న సంక్షేమ పథకాలను ఎత్తివేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని ఆయన ఎద్దేవా చేశారు.
ప్రతి పేదవాడికి మంచి జరగాలనే ఉద్దేశ్యంతో దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి పాలన సాగిందని వైఎస్ జగన్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. అప్పట్లో 13 లక్షలున్న పింఛన్లను, వైఎస్ఆర్ తన హయాంలో 71 లక్షల వరకు తీసుకు వెళ్లారన్నారు. కేంద్ర గణాంకాల సంస్థ (సీఎస్‌వో) రేటు ప్రకారం చంద్రబాబు నాయుడు హయాం కన్నా వైఎస్ఆర్ పాలన మెరుగని తేల్చిందన్నారు. ఆంధ్రప్రదేశ్లో 2004-05లో రూ.25,321 ఉంటే ఇప్పుడు రూ.89,214 ఉందన్నారు. 2004 జీడీపీలో అప్పుల నిష్పత్తి 32.4 ఉంటే, వైఎస్ఆర్ పాలనలో ఇదే నిష్పత్తి 22.4కు తగ్గిందన్నారు.
చంద్రబాబు పాలన ముందు రూ.22వేల కోట్లు రెవెన్యూ సర్‌ప్లస్ ఉంటే...బాబు హయాంలో ఏటా రెవెన్యూ లోటు ఏర్పడిందని వైఎస్ జగన్ తెలిపారు. బాబు హయాంలో ఒక్క సంక్షేమ పథకం అమలు కాలేదని, మద్య నిషేధాన్ని ఎత్తేవేయటం, కేజీ రూ.2 బియ్యం రూ.5 చేశారన్నారు. కరెంటు బిల్లులు పెంచారన్నారు. ధరలు పెంచినా రెవెన్యూ లోటు బాబు హయాంలో పెరుగుతూనే ఉందన్నారు.
మానవాభివృద్ధి సూచిక ప్రకారం...చంద్రబాబు హయాంలో ఆంధ్రప్రదేశ్ స్థానం 9 నుంచి 10వ స్థానానికి పడిపోయిందని వైఎస్ జగన్ అన్నారు. అభివృద్ధి అంటే ముందుకు వెళ్లడమా... వెనక్కి పోవడమా అనేది బాబుకే తెలియాలన్నారు. అన్యాయంగా రాష్ట్రాన్ని విడగొట్టినవారికే టీడీపీ వంతపాడిందని జగన్ అన్నారు. జరిగిందేదో జరిగిందని.... ఇక అభివృద్ధిపై దృష్టి సారిద్దామని సూచించారు.