'ప్రతిపక్షం అంటే ప్రతిదీ వ్యతిరేకించేది కాదు'
హైదరాబాద్ : గవర్నర్ నరసింహన్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై ప్రతిపక్ష నాయకుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం అసెంబ్లీలో ప్రసంగించారు. విజయవంతంగా తన పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు ఈ సందర్భంగా ఆయన అభినందనలు తెలిపారు. ఈసారి ఎన్నికలు ప్రత్యేక పరిస్థితుల్లో జరిగాయని సాధారణంగా అధికారపక్షం, ప్రతిపక్షం తలపడతాయని, అయితే ఈ ఎన్నికల్లో మాత్రం రెండు ప్రతిపక్షాలే ఎన్నికల్లో తలపడ్డాయన్నారు.
ప్రతిపక్షం అంటే ప్రతీదీ వ్యతిరేకించేదే కాదని, ఆ సాంప్రదాయం నుంచి తాము బయటకు వస్తున్నామని వైఎస్ జగన్ అన్నారు. మంచి పనికి తమ మద్దతు ఉంటుందన్నారు. అధికార పక్షానికి తమ సహాయ సహకారాలు పూర్తిగా ఉంటాయన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చాలని, అందుకు అన్నిరకాలుగా మా సహాయ సహకారాలు అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు.
దివంగత నేత, ప్రియతమ నాయకుడు వైఎస్ రాజశేఖరరెడ్డి ఎప్పుడూ ఒక మాట చెప్పేవారని 'క్వెస్ట్ విత్ డెస్టినీ' అని అనేవారని, జవహర్ లాల్ నెహ్రూ ప్రసంగం తనకు స్ఫూర్తినిచ్చిందని చెప్పేవారని వైఎస్ జగన్ గుర్తు చేశారు. సామాన్యుడు ఇబ్బందులు పడుతున్నంత వరకు మనం చేయాల్సిన పని ఇంకా పూర్తి కాలేదనే అర్థం చేసుకోవాలని నెహ్రూ అప్పట్లో చెప్పారన్నారు. అవకాశం ఉన్న, అవసరం ఉన్న ప్రతి పేదవాడికీ మంచి జరగాలని వైఎస్ చెప్పేవారని, ఆయన పాలనా కాలం అంతా శాచ్యురేషన్ పద్ధతిలో అర్హులైన ప్రతి ఒక్కరికీ మంచి చేశారన్నారు.
17 లక్షలున్న పింఛన్లను 71 లక్షలకు తీసుకెళ్లారని, అప్పటివరకు ఏడాదికి రెండున్నర లక్షల ఇళ్లు కూడా కట్టలేకపోయే పరిస్థితి నుంచి 10 లక్షల ఇళ్లు కట్టించారని వైఎస్ జగన్ తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ మంచి జరగాలని వైఎస్ రాజశేఖరరెడ్డి తాపత్రయడ్డారని, రేషన్ కార్డు దొరకని పరిస్థితి నుంచి దాదాపు కోటీ 20 లక్షలున్న కార్డులను రెండుకోట్ల 30 లక్షలకు తీసుకెళ్లారన్నారు. ఇప్పుడు అధికారపక్షం కూడా అదే స్ఫూర్తిని చూపిస్తుందని, పేదలకు మేలు చేస్తుందని, మేనిఫెస్టోలో హామీలను నెరవేరుస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతూ మరోసారి మీ అందరినీ అభినందిస్తున్నానని వైఎస్ జగన్ అన్నారు.
విభజన విషయంలో జరిగిన నష్టాన్ని, అన్యాయాన్ని గవర్నర్ తన ప్రసంగంలో ప్రస్తావించారని, కనీసం ఇప్పటికైనా ఆ నష్టాన్ని గుర్తించినందుకు సంతోషమన్నారు. రాష్ట్ర విభజన జరుగుతున్నప్పుడు తామంతా మొత్తుకున్నాం. లేఖ వెనక్కి తీసుకోవాలని ప్రాధేయపడ్డామన్నారు. అన్యాయం జరుగుతోందని తెలిసినా, ఆ బిల్లుకు ఓటేసి గెలిపించిన వైనాన్ని చూసి బాధ వేసిందన్నారు.
గవర్నర్ ప్రసంగంలో గత పదేళ్లలో రాష్ట్రం చాలా వెనకబడిపోయిందని చెప్పారు. సాధారణంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అంచనా వేయడానికి కొన్ని ప్రమాణాలుంటాయి. వీటన్నింటినీ చూసి, గడిచిన పదేళ్లలో నిజంగా చాలా అన్యాయమైన పరిస్థితిలోకి రాష్ట్రం వెళ్లిపోయిందా అని అంచనా వేయాలని వైఎస్ జగన్ అన్నారు.
వాస్తవానికి చంద్రబాబుకు ముందు పదేళ్లు, చంద్రబాబు పాలనా కాలం, ఆ తర్వాత పదేళ్లు.. ఈ మూడు దశాబ్దాలు ఒక్కసారి చూస్తే, 1984-94 వరకు ఆంధ్రరాష్ట్రం సగటు జాతీయ వార్షిక అభివృద్ధి రేటు 5.38 అయితే ఇక్కడ 5.83 శాతంగా ఉందన్నారు. 1994-2004 మధ్య దేశంలో 6.2 శాతం అయితే ఇక్కడ 5.72 శాతం ఉందని, 2001-14 మధ్య దేశ వార్షిక సగటు జీడీపీ 7.56 అయితే రాష్ట్ర సగటు జీడీపీ 8.23 ఉందన్నారు.. ఇవన్నీ చాలా కచ్చితమైన నివేదికలని, కాగ్, ఆర్బీఐ, సీఎస్ఓ రేటు ప్రకారం ఈ లెక్కలు చెప్పాయన్నారు.