
న్యాయం జరిగే వరకూ పోరాటం
అరసవల్లి: వరద బాధితులకు న్యాయం జరిగే వరకూ వారికి అండగా ఉంటానని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారు. నాగావళి వరద కారణంగా ముంపునకు గురైన శ్రీకాకుళంలోని తురాయిచెట్టు వీధిలో మంగళవారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎవరూ అధైర్య పడవద్దని..అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. కె.అమ్మన్న అనే మహిళ మాట్లాడుతూ వరద వచ్చినప్పుడే పాలకులు, అధికారులు వచ్చి తమను ఖాళీ చేయిస్తారని..ఆ తరువాత పట్టించుకోవడం లేదని జగన్‌కు ఫిర్యాదు చేసింది.
దీనికి ఆయన స్పందిస్తూ దిగులు పడవద్దని, అందరికీ న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తానని ఓదార్చారు. డి.దిలక్ష్మి అనే మహిళ మాట్లడుతూ బియ్యం గింజలు ఇచ్చి ఈ ప్రభుత్వం చేతులు దులుపుకుంటుందన్నారు. దీనికి జగన్ స్పందిస్తూ ఈ ప్రభుత్వం మాటలతోనే మాయచేస్తోందన్నారు. అంతాకలిసి ప్రభుత్వాన్ని నిలదీసి మరింత వరద సాయూని తెప్పుంచుకుందమన్నారు. కాగా ఉదయం నుంచే జగన్ రాక కోసం జనం ఎదురు చూశారు. కాలనీలోని ప్రతీ కుటుంబాన్ని జగన్ పరామర్శించారు. అనంతరం మూడు గంటల సమయంలో పక్కనే వరద ముంపునకు గురైన మరో రెండు ప్రాంతాలైన మహిళామండలి వీధి, వైష్ణపువీధుల్లో పర్యటించి ప్రతీ ఇంటి వారిని ఆప్యాయంగా పలకరించారు.