వెలిగొండ వేగం పెరగాలి | YS Jagan Mohan Reddy Visits Veligonda Project | Sakshi
Sakshi News home page

వెలిగొండ వేగం పెరగాలి

Published Fri, Feb 21 2020 3:43 AM | Last Updated on Fri, Feb 21 2020 11:31 AM

YS Jagan Mohan Reddy Visits Veligonda Project - Sakshi

గురువారం ప్రకాశం జిల్లాలోని వెలిగొండ ప్రాజెక్ట్‌ టన్నెల్‌–1లో పనులను పరిశీలిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌. చిత్రంలో మంత్రులు బాలినేని, ఆదిమూలపు సురేష్‌ తదితరులు

ఐదేళ్ల టీడీపీ సర్కార్‌ హయాంలో 600 మీటర్ల మేర టన్నెల్‌–1 పనులు చేస్తే.. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఎనిమిది నెలల్లోనే 1.4 కిలోమీటర్ల మేర పనులు పూర్తయ్యాయన్నమాట.
– సీఎం వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి/ఒంగోలు: వెలిగొండ ప్రాజెక్టు మొదటి దశ పనులను జూలై నాటికి పూర్తి చేసి, ఆగస్టులో ఆయకట్టుకు నీళ్లందించాలని జల వనరుల శాఖ అధికారులకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దిశా నిర్దేశం చేశారు. అవసరమైతే పనులు చేయలేని పరిస్థితిలో ఉన్న పాత కాంట్రాక్టు సంస్థలను తొలగించి, వాటికి రివర్స్‌ టెండరింగ్‌ నిర్వహించాలని ఆదేశించారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులను ‘ప్రాధాన్యత క్రమం’లో శరవేగంగా పూర్తి చేయడానికి రూపొందించిన ప్రణాళిక అమలు తీరును క్షేత్ర స్థాయిలో పరిశీలించి, పనులకు అడ్డంకిగా మారిన సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించి అధికారులకు మార్గనిర్దేశం చేసే క్రమంలో గురువారం ఆయన వెలిగొండ ప్రాజెక్టు నుంచి ‘ప్రాజెక్టుల బాట’కు శ్రీకారం చుట్టారు.

తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి గురువారం ఉదయం హెలికాఫ్టర్‌లో బయలుదేరి 10.55 గంటలకు వెలిగొండ ప్రాజెక్టు వద్దకు చేరుకున్నారు. వెలిగొండ ప్రాజెక్టు (సొరంగం)–2 వద్ద పనులకు సంబంధించి ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను సందర్శించారు. అనంతరం ట్రాలీలో వెలిగొండ ప్రాజెక్టు టన్నెల్‌–1లోకి ప్రవేశించి, టీబీఎం(టన్నెల్‌ బోరింగ్‌ మెషీన్‌) ద్వారా సొరంగం తవ్వకం పనులను పరిశీలించారు. ఆ తర్వాత మంత్రులు అనిల్‌కుమార్‌ యాదవ్, బాలినేని శ్రీనివాసరెడ్డి, పినిపే విశ్వరూప్, ఆదిమూలపు సురేష్, ప్రకాశం జిల్లా కలెక్టర్‌ పోలా భాస్కర్, ప్రజాప్రతినిధులతో కలిసి వెలిగొండ ప్రాజెక్టు అధికారులు, కాంట్రాక్టు సంస్థల ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు వెలిగొండ ప్రాజెక్టు టన్నెల్‌ నమూనా చూపుతున్న మేఘా ఇంజనీరింగ్‌ సంస్థ ఎండీ పీవీ కృష్ణారెడ్డి

ఐదేళ్లలో 600 మీటర్లు.. ఎనిమిది నెలల్లో 1.4 కి.మీల సొరంగం తవ్వకం  
‘ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్‌ జిల్లాల్లోని మెట్ట ప్రాంతాల్లో 4.47 లక్షల ఎకరాలను సస్యశ్యామలం చేయడానికి, 15.25 లక్షల మంది దాహార్తి తీర్చాలన్న లక్ష్యంతో దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి 2005లో వెలిగొండ ప్రాజెక్టును చేపట్టారు. 2009 వరకూ పనులు శరవేగంగా జరిగాయి. ఆ తర్వాత పనులు పడకేశాయి. ఈ పరిస్థితిలో ఈ ప్రాజెక్టు తొలి దశను జూలై నాటికి పూర్తి చేసి, ఆగస్టులో ఆయకట్టుకు నీళ్లందించాలని నిర్ణయించాం. గడువులోగా పనులు చేయడానికి చర్యలు తీసుకోవాలి’ అని సీఎం వైఎస్‌ జగన్‌ అన్నారు. గత ఐదేళ్లుగా పనులు ఎందుకు ముందు సాగలేదని అధికారులను ప్రశ్నించారు. 2014 నుంచి 19 మధ్య కాలంలో టన్నెల్‌–1 పనులు 15.2 కిలోమీటర్ల నుంచి 15.8 కిలోమీటర్ల వరకు అంటే 600 మీటర్ల మేర మాత్రమే చేయగలిగామని అధికారులు వివరించారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎనిమిది నెలల్లో టన్నెల్‌–1 పనులను 15.8 కిలోమీటర్ల నుంచి 17.2 కిలోమీటర్ల వరకు అంటే 1.4 కిలోమీటర్ల మేర పనులు పూర్తి చేశామని వివరించారు. దీనిపై సీఎం స్పందిస్తూ.. టన్నెల్‌–1ను ఎట్టిపరిస్థితుల్లో జూలై నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. కాంట్రాక్టు సంస్థ ప్రతినిధి స్పందిస్తూ.. నెలకు 200 మీటర్ల చొప్పున టన్నెల్‌ను తవ్వుతున్నామని, జూన్‌–జూలై నాటికి పనులు పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.

వెలింగొండ సొరంగ మార్గంలో లోకో ట్రైన్‌లో ప్రయాణిస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

ఐదేళ్లలో టన్నెల్‌–2 పనులు 410 మీటర్లే 
శ్రీశైలం రిజర్వాయర్‌ నుంచి కొల్లంవాగు మీదుగా వెలిగొండ టన్నెల్‌ ద్వారా నీటిని విడుదల చేయడానికి సాగుతున్న హెడ్‌ రెగ్యులేటర్‌ నిర్మాణ పనుల గురించి సీఎం వైఎస్‌ జగన్‌ ఆరా తీశారు. హెడ్‌ రెగ్యులేటర్‌ పనులను పాత కాంట్రాక్టర్‌ సక్రమంగా చేయక పోవడంతో వాటిని మరొక కాంట్రాక్టర్‌కు అప్పగించామని అధికారులు వివరించారు. శ్రీశైలం జలాశయంలోనీటి మట్టం 850 అడుగులకు తగ్గగానే హెడ్‌ రెగ్యులేటర్‌ పనులు ప్రారంభించి జూలై నాటికి పూర్తి చేస్తామన్నారు. వెలిగొండ ప్రాజెక్టు టన్నెల్‌–2 పనులపై సీఎం వైఎస్‌ జగన్‌ ఆరా తీశారు. 2014 నుంచి 2019 మధ్య కాలంలో 10.75 కిలోమీటర్ల నుంచి 11.16 కిలోమీటర్ల (410 మీటర్లు) వరకు మాత్రమే చేశారని అధికారులు వివరించారు. టన్నెల్‌–2ను రెండు వైపుల నుంచి తవ్వడం ద్వారా శరవేగంగా పూర్తి చేయాలని సీఎం చేసిన సూచనలకు కాంట్రాక్టు సంస్థ ప్రతినిధులు అంగీకరించారు.

వెలిగొండ ప్రాజెక్టు పనులపై అధికారులు, ప్రజాప్రతినిధులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

నిధుల కొరత రానివ్వం.. పనులు వేగంగా చేయండి 
వెలిగొండ ప్రాజెక్టు పనులకు అవసరమైన 2,884.13 ఎకరాల భూమిని మార్చి 31లోగా సేకరించాలని సీఎం వైఎస్‌ జగన్‌ అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టులో అంతర్భాగమైన నల్లమలసాగర్‌లో 11 గ్రామాలు ముంపునకు గురవుతాయని.. ఆ గ్రామాల పరిధిలోని 4,617 కుటుంబాల ప్రజలకు పునరావాసం కల్పించాల్సి ఉందని అధికారులు వివరించారు. భూసేకరణ చట్టం–2013 ప్రకారం సహాయ, పునరావాస ప్యాకేజీ కింద పరిహారం అందించాలని నిర్వాసితులు కోరుతున్నారని నివేదించారు. దీనిపై సీఎం సానుకూలంగా స్పందిస్తూ.. అందుకు అవసరమైన రూ.1,860 కోట్ల నిధులు విడుదల చేస్తామని చెప్పారు. గడువులోగా పనులు పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాలన్నారు.

పాత కాంట్రాక్టు సంస్థలు పనులు చేయలేని పరిస్థితి ఉన్నప్పుడు.. అవసరమైతే ఆ పనులకు రివర్స్‌ టెండరింగ్‌ నిర్వహించి వేరే కాంట్రాక్టు సంస్థలకు పనులు అప్పగించాలని సూచించారు. పుల్లలచెరువు మండలంలో టీ–5 బ్లాక్‌ వద్ద అదనంగా కాలువ తవ్వకం ద్వారా 11,500 ఎకరాలకు సాగు, తాగు నీరు అందించే పనులు చేపట్టడానికి అదనంగా రూ.70 కోట్లు అవుతాయని, వాటిని మంజూరు చేయాలని మంత్రి ఆదిమూలపు సురేష్‌ చేసిన విజ్ఞప్తిపై సీఎం వైఎస్‌ జగన్‌ సానుకూలంగా స్పందించారు. వెలిగొండ ప్రాజెక్టు ఈస్ట్రన్‌ కెనాల్‌ ద్వారా రాళ్లపాడు రిజర్వాయర్‌కు నీటిని విడుదల చేయాలన్న ఎమ్మెల్యే మహీధర్‌రెడ్డి ప్రతిపాదనపై కూడా సానుకూలంగా స్పందించారు. ఆ పనులు చేపట్టడానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి, ఎమ్మెల్యేలు సుధాకర్‌బాబు, వేణుగోపాల్, నాగార్జునరెడ్డి, అన్నా రాంబాబు, జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌ తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement