ప్రజా సంకల్పయాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: పాదయాత్ర ద్వారా తమ మధ్యకొచ్చిన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి జనం తమ సమస్యలను చెప్పుకుంటున్నారు. ప్రభుత్వం చేస్తున్న మోసాలను వివరిస్తూ బోరుమంటున్నారు. ఉండడానికి ఇల్లు లేదు, బతకడానికి పింఛన్ రాదు.. ఏం చేయాలయ్యా, ఎలా బతకాలయ్యా? అంటూ కన్నీటి పర్యంతమవుతున్నారు. బడుగులు, మహిళలు, యువత, కార్మికులు, రైతాంగం... ఇలా అన్ని వర్గాల ప్రజలు తమ ఆవేదనను జగన్‌తో పంచుకుంటున్నారు. కష్టాలను ఎకరవు పెడుతున్నారు. వినతిపత్రాలు సమర్పిస్తున్నారు. వారు చెప్పేది జగన్ ఓపిగ్గా వింటున్నారు. ఆందోళన వద్దంటూ ఊరడిస్తున్నారు. కొన్నాళ్లు ఓపిక పడితే మంచి రోజులు వస్తాయంటూ బతుకులపై భరోసా కల్పిస్తున్నారు. నేనున్నా... అంటూ బాధితుల్లో ధైర్యం నూరిపోస్తున్నారు. పల్లె సీమలు జగన్‌తో కలిసి అడుగులో అడుగు వేస్తున్నాయి.
బాబు మోసాలపై రగిలిపోతున్న జనం
అలవికాని హామీలిచ్చి చంద్రబాబు మోసం చేశారని పేదలు రగిలిపోతున్నారు. కుడి ఎడమల దగా, దగా అంటూ ఘోషిస్తున్నారు. రైతన్నలకు రుణమాఫీ మాయ, ఫీజు రీయింబర్స్‌మెంట్ మాయ, ప్రత్యేక హోదా మాయ, రాజధాని మాయ... పోలవరం మాయ... పొదుపు సంఘాలకు రుణమాఫీ మాయ... ఇలా ఏది చూసినా మోసం, దగాలతో సాగుతున్న చంద్రబాబు పాలనపై పేదలు సమర శంఖం పూరిస్తున్నారు. జన్మభూమి కమిటీల అరాచకాలపై దుమ్మెత్తి పోస్తున్నారు. అన్ని వర్గాల వారూ.. మీరే ఆదుకోవాలయ్యా అంటూ జగన్‌ను అర్థిస్తున్నారు. గనిలో, పనిలో, పొలంలో, కార్ఖానాల్లో, కర్మాగారాల్లో... ఇలా పని ప్రదేశాల నుంచి పరిగెత్తుకు వచ్చి తమ గోడు చెప్పుకుంటున్నారు. దారి పొడవునా వినతులు వెల్లువెత్తుతున్నాయి.
కిరికిరి కమిటీల పీడ విరగడ చేయండి
పల్లె కన్నీరు పెడుతుందో... కనిపించని కుట్రల... అని ఓ కవి అంటే చంద్రబాబు పాలనలో కనిపిస్తున్న కుట్రలతోనే పల్లెలు కంటనీరు పెడుతున్నాయి. చంద్రబాబు అధికారంలోకి వచ్చీ రాగానే నియమించిన జన్మభూమి గ్రామ కమిటీలు అరాచకాలకు, అవినీతికి ఆలవాలంగా మారాయి. మాయకు మారుపేరుగా నిలిచాయి. పసుపు చొక్కాలతో నిండిన ఈ కమిటీలు ఆడిందే ఆట, పాడిందే పాటగా తయారైంది. వీటి సిఫార్సు లేనిదే ఊళ్లల్లో పచ్చి మంచినీళ్లు పుట్టని పరిస్థితి దాపురించింది. పెన్షన్ కావాలన్నా, ఊళ్లకు రోడ్లు కావాలన్నా, రేషన్ దొరకాలన్నా, ఇంటి జాగా మంజూరు కావాలన్నా, ఉపాధి హామీ కార్డు పుట్టాలన్నా... ఇలా ఒకటేమిటి ప్రభుత్వం ప్రకటించిన ఏ సంక్షేమానికైనా ఈ కిరికిరి కమిటీల మాటే వేదవాక్కు. సమాంతర ప్రభుత్వంగా మారిన ఈ దిక్కుమాలిన కమిటీల చేత చిక్కి బడుగులు, ప్రత్యర్థి పార్టీల కార్యకర్తలు పడుతున్న పాట్లు అన్నీ ఇన్ని కాదు. అధికార యంత్రాంగం వీరికే వంత పాడుతోంది. జన్మభూమి కమిటీల అనుమతి లేనిదే ఏ ఒక్క పనీ జరగడం లేదు. చివరకు అరకొరగా అమలవుతున్న రుణమాఫీలోనూ ఈ కమిటీలు చేతి వాటం చూపుతున్నాయి. ప్రాథమిక సహకార బ్యాంకులకు జమ చేసే మొత్తంలోనూ ఈ కమిటీలు ఒక్కో లబ్ధిదారుని నుంచి ఐదారు వేలు నొక్కేస్తున్నాయి. ఈ పీడ విరగడయ్యే మార్గం చూపమని పల్లెలు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని అడుగడుగునా అభ్యర్థిస్తున్నాయి.
జగన్‌ను కలవనున్న రైతులు
జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా శనివారం అన్నదాతలు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి తమ సమస్యలను విన్నవించాలని నిర్ణయించారు. చంద్రబాబు నాలుగేళ్ల పాలనలో తాము పడుతున్న ఇక్కట్ల గురించి, రుణమాఫీ విషయంలో తామెలా మోసపోయిందీ రైతులు వివరించనున్నారు. మాజీ ప్రధానమంత్రి చరణ్ సింగ్ జయంతిని రైతు దినోత్సవంగా పాటిస్తున్నారు. రైతే దేశానికి వెన్నుముక అని కల్లబొల్లి కబుర్లు చెబుతూనే చంద్రబాబు తమ వెన్ను ఎలా విరుస్తున్నారో రైతులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి వివరించనున్నారు.
కదిరిలో నేడు భారీ బహిరంగ సభ
ప్రజా సంకల్ప యాత్ర శనివారం అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గంలో సాగనుంది. ఈ సందర్భంగా కదిరి ఇందిర సర్కిల్‌లో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గుర్తుపై గెలిచి ఆ తర్వాత అధికార పార్టీ ప్రలోభాలకు అమ్ముడు పోయిన వ్యక్తుల్లో కదిరి ఎమ్మెల్యే ఒకరు.
Comments
Please login to add a commentAdd a comment