నేను ఉన్నాను... | YS Jagan Promise on Veligonda Project | Sakshi
Sakshi News home page

నేను ఉన్నాను...

Published Wed, Jun 5 2019 1:10 PM | Last Updated on Wed, Jun 5 2019 1:10 PM

YS Jagan Promise on Veligonda Project - Sakshi

వెలిగొండ ప్రాజెక్టు సొరంగం

సాక్షి ప్రతినిధి, ఒంగోలు :అధికారం వచ్చిన ఏడాదిలోపే వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేసి జిల్లాలో కరువును పారద్రోలుతానని జిల్లా వాసులకు హామీ ఇచ్చిన వైఎస్‌ జగన్‌ సీఎం అయిన వెంటనే ఆ హామీని నెరవేర్చేందుకు సిద్ధమయ్యారు. సోమవారం ఇరిగేషన్‌ అధికారులతో సమావేశమైన సీఎం జగన్‌ ఇచ్చిన హామీ మేరకు ప్రాజెక్టు పనులను సకాలంలో పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు వెలిగొండ అధికారులు ప్రాజెక్టు పనులు పూర్తి చేసి వచ్చే ఏడాది నాటికి నీటిని విడుదల చేసేందుకు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు. ఐదేళ్ల పాటు అధికారంలో ఉన్నా ఇచ్చిన హామీని నెరవేర్చక చంద్రబాబు జిల్లా వాసులను వంచిస్తే సీఎం అయిన మరుక్షణమే వైఎస్‌ జగన్‌ ఇచ్చిన మాటకు కట్టుబడి వెలిగొండను పూర్తి చేసేందుకు సిద్ధమయ్యారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణమే వైఎస్‌ జగన్‌ ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుకు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే పెన్షన్ల మొత్తాన్ని పెద్ద ఎత్తున పెంచగా ఆ వెంటనే ఆశ వర్కర్ల జీతాలను రూ.3వేల నుంచి రూ.10 వేలకు పెంచారు. ఇక డయాలసిస్‌ స్టేజీలో ఉన్న కిడ్నీ బాధితుల పెన్షన్లను రూ.3500 నుంచి రూ.10వేలకు పెంచారు. మొత్తంగా వరుసపెట్టి అన్ని హామీలను రోజుకొకటి చొప్పున నెరవేర్చుకుంటూ ముందుకు సాగుతున్నారు.

పశ్చిమలో కరువు దూరం..
ఇక ప్రకాశం జిల్లా వరప్రదాయని అయిన వెలిగొండ ప్రాజెక్టు పనులను వేగవంతం చేసి జిల్లాలో ప్రధానంగా పశ్చిమ ప్రాంతంలో కరువును పారద్రోలేందుకు సీఎం జగన్‌ సిద్ధమయ్యారు. ఎన్నికల సమయంలో వెలిగొండ ప్రాజెక్టును అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే పూర్తి చేసి నీరిస్తానని జగన్‌ జిల్లా వాసులకు హామీ ఇచ్చారు. ఎన్నికల్లో ఘన విజయం సాధించి సీఎం సీట్లో కూర్చున్న మరుక్షణమే జగన్‌ వెలిగొండ ప్రాజెక్టుపై దృష్టి పెట్టారు. ఇచ్చిన మాట మేర సోమవారం ఇరిగేషన్‌ అధికారులతో సమీక్ష నిర్వహించారు. వెలిగొండ తాజా పరిస్థితిని ఆరా తీశారు. ఇచ్చిన మాట మేరకు మరో ఏడాదిలో పనులు పూర్తి చేసి నీరివ్వాలంటే ఏం చేయాలన్నదానిపై అధికారులను సమగ్ర నివేదిక కోరారు. తక్షణమే పనులు వేగవంతం చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సీఎం జగన్‌ ఇరిగేషన్‌ అధికారులను ఆదేశించారు. దీంతో ఇరిగేషన్‌ సీఈ సుధాకర్‌ బాబు నేతృత్వంలో అదికారులు వెలిగొండ ఫేజ్‌–1 పనులను ఏడాదిలోపు పూర్తిచేసి వచ్చే సీజన్‌ నాటికి జిల్లాకు నీటిని విడుదల చేయాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

ఏడాదిలోపే ఫేజ్‌–1 పనులు..
వెలిగొండ ప్రాజెక్టులోని ఫేజ్‌–1 పరిధిలో ఇంకా 2.1 కిలోమీటరు టన్నెల్‌ తవ్వాల్సి ఉంది. ప్రస్తుతం రోజుకు సగటున 8 మీటర్ల చొప్పున టన్నెల్‌ తవ్వకం సాగుతోంది. టన్నెల్‌ తవ్వకం పనులు వేగవంతం చేయాలని, పనులు ఆగకుండా కొనసాగించేలా అన్ని చర్యలు తీసుకోవాలని ఇప్పటికే అధికారులు మెగా కన్‌స్ట్రక్షన్స్‌కు గట్టిగా చెప్పినట్లు తెలుస్తోంది. టన్నెల్‌– 1 పనుల కోసం రూ.250 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా. ఇక కొల్లం వాగు పరిధిలో రెండు హెడ్‌ రెగ్యులేటర్‌లు నిర్మించాల్సి ఉండగా ఫేజ్‌–1 పరిధిలో ఒక హెడ్‌ రెగ్యులేటర్‌ నిర్మాణం పూర్తి కావాల్సి ఉంది. దీని కోసం రూ.50 కోట్లు వెచ్చించాల్సి ఉంది. ఇప్పటికే హెడ్‌ రెగ్యులేటర్‌కు సంబంధించి 4 మీటర్ల మేర కాంక్రీటు పనులు జరిగాయి. శ్రీశైలం రిజర్వాయర్‌లోకి నీరు చేరక ముందే హెడ్‌ రెగ్యులేటర్‌ పనులు పూర్తి చేయాలని అధికారులు నిర్ణయించారు. ఇక వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభం నుంచి ఫీడర్‌ కెనాల్‌ 21 కిలోమీటర్‌ మేర లైనింగ్‌ చేయాల్సి ఉంది. ఇందు కోసం మరో రూ.130 కోట్లు అవసరం అవుతుందని అంచనా. ఇక ఆర్‌అండ్‌ ఆర్‌ పనులకు మరో రూ.400 కోట్లు అవసరం అవుతుంది. గొట్టిపడియపై డిస్ట్రిబ్యూటరీలు, తీగలేరు పై స్ట్రక్చర్స్‌ నిర్మించాల్సి ఉంది. ఇందుకోసం సుమారు రూ.1000 కోట్లు అవసరం అవుతుందని అంచనా. ఈ పనులను పూర్తి చేస్తే గిద్దలూరు నియోజకవర్గంలోని అర్థవీడు, కంభం, బేస్తవారిపేట మండలాల పరిధిలో 22వేల ఎకరాలు, మార్కాపురం నియోజకవర్గంలో మార్కాపురం, తర్లుపాడు మండలాల పరిధిలో 30,700 ఎకరాలు, యర్రగొండపాలెం నియోజకవర్గంలో పుల్లల చెరువు, పెద్దారవీడు, వైపాలెం, దోర్నాల, త్రిపురాంతకం మండలాల పరిధిలో 66,300 ఎకరాలు మొత్తం 1.19 లక్షల ఎకరాలు ఆయకట్టు సాగులోకి వస్తుంది. 300కు పైగా గ్రామాల పరిధిలోని ప్రజలకు తాగునీరు అందుతుంది. సీఎం జిల్లా వాసులకు హామీ ఇచ్చిన మేరకు ఫేజ్‌ –1 పనులను ఏడాది తిరక్కుండానే  పూర్తి చేసేందుకు అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. ఇందులో భాగంగా రెండుమూడు రోజుల్లో మరో మారు సీఎంను కలిసి పూర్తి స్థాయిలో చర్చించనున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే ఏడాది ఈ సమయానికి వెలిగొండ టన్నెల్‌–1 ద్వారా నీటిని విడుదల చేస్తామని ఇరిగేషన్‌ అధికారులు చెబుతున్నారు.   

బాబు హయాంలో అంతా అదిగో.. ఇదిగో..
ఐదేళ్ల పదవీ కాలంలో చంద్రబాబు సర్కారు వెలిగొండను గాలికొదిలింది. అంతకు ముందు దివంగత నేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో దాదాపు 70 శాతం పనులు పూర్తి కాగా బాబు హయాంలో పట్టుమని పదిశాతం పనులు కూడా ముందుకు సాగలేదు. పనులు చేయకపోయినా అదిగో నీరిస్తాం.. ఇదిగో నిరస్తామంటూ చంద్రబాబు సర్కారు ఐదేళ్ల పాటు జిల్లా వాసులను వంచనకు గురి చేసింది. ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు ముఖ్యమంత్రి పీఠం అధీష్టించిన వెనువెంటనే వెలిగొండ నిర్మాణ పనులను సకాలంలో పూర్తి చేయాలని సీఎం జగన్‌ నిర్ణయించడంపై జిల్లా వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వైఎస్‌ జగన్‌ మాట తప్పని.. మడమ తిప్పని వ్యక్తి అని కొనియాడుతున్నారు. వెలిగొండ పూర్తి అయితే ప్రకాశం జిల్లా అన్ని విధాలా అభివృద్ధి చెందుతుందని ఇక్కడి ప్రజలు పేర్కొంటున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement