విశాఖపట్నంలో వైఎస్సార్‌సీపీలో చేరిన మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డికి కండువా కప్పి ఆహ్వానిస్తున్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి (ఫైల్)
జనోత్సాహం రెట్టించింది.. పార్టీ క్యాడర్‌లో నయా జోష్ వచ్చింది. రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా మారిన వైఎస్సార్‌సీపీ అధినేత, శాసనసభ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్ర జిల్లాలో అనేక కీలక రాజకీయాలకు నాంది పలుకుతూ అశేష జనవాహిని నడుమ సాగింది. పాదయాత్ర తర్వాత జిల్లా రాజకీయ ముఖచిత్రం మారేలా ప్రముఖులు కొందరు పార్టీలో చేరడంతో సమీకరణాలు వేగంగా మారాయి. పార్టీ క్యాడర్‌కు వైఎస్ జగన్ పాదయాత్రతో కొండంత భరోసా లభించింది. ‘అండగా ఉంటా.. అధైర్యపడొద్దు.. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పేదల జీవితాల్లో వెలుగులు నింపుతాం’ అని ప్రతి ఒక్కరికీ భరోసా ఇస్తూ అందరితో మాట్లాడి సాధక బాధకాలను తెలుసుకున్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జిల్లాలో గత ఏడాది జనవరి 23 నుంచి ఫిబ్రవరి 15వ తేదీ వరకు పాదయాత్ర నిర్వహించారు.
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: జిల్లాలో గత ఏడాది జరిగిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజాసంకల్ప పాదయాత్ర అనేక నియోజకవర్గాల్లో రాజకీయ ముఖచిత్రానే మార్చేసింది. గ్రామస్థాయి నేతలు మొదలుకుని జిల్లాలో అధిక ప్రాధాన్యం ఉన్న రాజకీయ కుటుంబాలకు చెందిన వ్యక్తులు, రాజకీయ వారసులు వైఎస్సార్‌సీపీలో చేరారు. సార్వత్రిక ఎన్నికలు మరికొద్ది నెలల్లో జరగనున్న క్రమంలో జిల్లాలో పాదయాత్ర తర్వాత రెట్టించిన ఉత్సాహం కొనసాగిస్తూ నేతలు పనిచేస్తున్నారు. రాయలసీమలో ప్రారంభమైన పాదయాత్ర గత ఏడాది జనవరి 23న చిత్తూరు జిల్లాలో ముగించుకుని నెల్లూరు జిల్లాలోని సూళ్లూరుపేట నియోజకవర్గం పెళ్లకూరు మండలం పునబాక గ్రామంలోకి ప్రవేశించింది. ఈ క్రమంలో జిల్లా పార్టీ నాయకులు వైఎస్ జగన్‌కు ఘన స్వాగతం పలికారు. మంగళహారతులు ఇచ్చి గుమ్మడి కాయలతో దిష్టితీసి మరీ స్వాగతించి పాదయాత్ర ఆద్యంతం వెన్నంటి ఉండి కొనసాగారు. సూళ్లూరుపేట నియోజకవర్గంలో ప్రారంభమైన పాదయాత్ర వెంకటగిరి నియోజకవర్గానికి చేరింది. ఈ సందర్భంగా సైదాపు రం మండలంలో కీలక ఘట్టమైన వెయ్యి కిలోమీటర్ల మైలు రాయికి వేదికగా నిలిచింది. వెంకటగిరి నుంచి గూడూరు, అక్కడి నుంచి సర్వేపల్లి, అక్కడి నుంచి నెల్లూరు రూరల్, కోవూరు, ఆత్మకూరు, కావలి, ఉదయగిరి నియోజకవర్గాల్లో సాగింది. ప్రతి చోట ఆశేష జనప్రభంజనం కొనసాగింది. ఈ క్రమంలో జనవరి 23న ప్రారభమైన పాదయాత్ర ఫిబ్రవరి 15న ఉదయగిరి నియోజకవర్గం కొండాపురం మండలం నేకునాం పేటలో ముగిసి ప్రకాశం జిల్లాలోకి ప్రవేశించింది.
ప్రముఖుల చేరికతో పార్టీలో నూతనోత్తేజం
జిల్లాలో రాజకీయ ప్రముఖులు ప్రజాసంకల్ప యాత్రలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రధానంగా ప్రముఖ వ్యాపారవేత్త, సేవాకార్యక్రమాలు నిర్వహించే వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి జిల్లాలో ప్రజాసంకల్పయాత్రలో వైఎస్ జగన్‌ను కలిసి పార్టీలో చేరారు. అనంతరం జిల్లాలో జరిగిన పాదయాత్రలో పాల్గొన్నారు. తదనంతరం పార్టీ తరపున రాజ్యసభ సభ్యునిగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం జిల్లాలోనూ, ఢిల్లీలోనూ పార్టీ వాణి బలంగా వినిపిస్తూ ప్రత్యేక హోదా ఉద్యమం కొనసాగిస్తున్నారు. ఆర్థిక శాఖ మాజీ మంత్రి, జిల్లాలో రాజకీయ ప్రాధాన్యం ఉన్న ఆనం రామనారాయణరెడ్డి విశాఖలో పార్టీలో చేరారు. ఆయనతో పాటు దివంగత మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి కుమారుడు ఆనం రంగమయూర్‌రెడ్డి, జిల్లాలో పలు నియోజకవర్గాల్లో వివిధ పదవుల్లో ఉన్న ఆనం వర్గీయులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి క్రియాశీలకంగా రాజకీయాల్లో కొనసాగుతున్నారు. వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్తగా ఆనం రామనారాయణరెడ్డి పార్టీ నియమించిన క్రమంలో అటు వెంకటగిరిలో, ఇటు జిల్లాలో క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. అలాగే జిల్లాలో మరో రాజకీయ కుటుంబం నుంచి మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి కుమారుడు నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి కూడా విశాఖపట్నంలో పాదయాత్రలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి జిల్లాలో పార్టీ బలోపేతానికి కోసం పనిచేస్తున్నారు. ఈ క్రమంలో తిరుపతి, బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గాల ఇన్‌చార్జిగా ఆయన్ను పార్టీ నియమించింది. గూడూరు మాజీ మున్సిపల్ చైర్మన్ కోడూరు కల్పలతారెడ్డి, మీరారెడ్డి దంపతులు వైఎస్సార్‌సీపీలో చేరారు. అలాగే మిగిలిన నియోజకవర్గాల్లోనూ పెద్ద ఎత్తున చేరికలు కొనసాగాయి.
Comments
Please login to add a commentAdd a comment