
26, 27న గుంటూరులో జగన్ ‘రైతు దీక్ష’
పార్టీలకతీతంగా దీక్షకు తరలి రావాలని వైఎస్సార్ సీపీ నేతల పిలుపు
గుంటూరు వెస్ట్: గిట్టుబాటు ధర లభించక, రుణ మాఫీ కాక ఆత్మహత్యల బాట పడుతున్న రైతులకు అండగా నిలిచేందుకు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రెండు రోజుల పాటు గుంటూరులో రైతు దీక్ష చేయనున్నారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో ధరల స్థిరీకరణ పేరుతో రూ.5 వేల కోట్లు ఇస్తామని చెప్పి తుదకు ఒక్క పైసా కూడా ఇవ్వకుండా రైతులను మోసం చేసిన తీరుకు నిరసనగా వైఎస్ జగన్ ఈ దీక్ష చేపడుతున్నట్లు వైఎస్సార్‌సీపీ నేతలు వెల్లడించారు. రుణ మాఫీ పేరుతో కనీసం వడ్డీ కూడా మాఫీ చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం రైతులను దారుణంగా వంచించడాన్ని నిలదీసేందుకే వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత మరోమారు పోరుబాటకు సిద్ధమయ్యారని ఆ పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ పేర్కొన్నారు.
ఈ నెల 26, 27 తేదీల్లో గుంటూరులో వైఎస్ జగన్ రైతు దీక్ష చేపడుతున్నారని తెలిపారు. రైతులు పడుతున్న కష్టాలు, బాధలు, ఇబ్బందులను చూసి ఈ నిర్ణయం తీసుకున్నారన్నారు. గుంటూరు నగరంలోని అరండల్‌పేటలో బుధవారం పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన విలేకర్ల తో మాట్లాడారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించలేని దౌర్భాగ్యపు స్థితిలో ప్రభుత్వం ఉండడం సిగ్గుచేటన్నారు. తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు దొంగలెక్కలతో రైతులు, ప్రజలను మోసం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు వైఎస్సార్ సీపీ అండగా ఉంటుందని, ఎవరూ మనోధైర్యాన్ని కోల్పోవద్దని పేర్కొన్నారు. వైఎస్ జగన్ రైతు దీక్షకు పార్టీలకతీతంగా పెద్ద సంఖ్యలో రైతులు తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు.
ప్రభుత్వ చేతగానితనంతోనే ..
మిర్చిని అధికంగా పండించడం వల్లే రైతులు అధిక ధరకు అమ్ముకోలేకపోతున్నారని ప్రభుత్వం చెప్పడం పచ్చి అబద్ధమని వైఎస్సార్‌సీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎం.వి.ఎస్.నాగిరెడ్డి మండిపడ్డారు. గత ఏడాది 8 లక్షల హెక్టార్లలో మిర్చి పండితే ఈ ఏడాది కేవలం 6 లక్షల హెక్టార్లలోనే సాగయ్యిందన్నారు. జెమిని వైరస్, ఇతర కారణాల వల్ల దిగుబడి పడిపోయిందని చెప్పారు. గత ఏడాది పంటలన్నీ బాగానే పండినా మంచి ధరను రైతులు సాధించారన్నారు. ఈ సారి పంటలు సరిగ్గా పండకపోగా, కనీస ధర కూడా పొందలేకపోవడానికి ప్రభుత్వ చేతగానితనమే కారణమని దుయ్యబట్టారు. గత ఏడాది క్వింటా మామిడి రూ.14 వేలు ధర పలుకగా, ఈ ఏడాది కేవలం రూ.3 వేలకు పడిపోయిందన్నారు. పసుపు రూ.25 వేల నుంచి రూ.7 వేలకు పడిపోయిందన్నారు. ౖరైతు దీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని రైతు సంఘాలు తరలి రావాలని విజ్జప్తి చేశారు.
వలస కూలీలుగా రైతులు
పంటలకు గిట్టుబాటు ధర లేకపోవడం వల్ల రైతులు ఇతర రాష్ట్రాలకు కూలీలుగా వలస పోతున్నారని మాజీ మంత్రి పార్థసారథి ఆవేదన వ్యక్తం చేశారు.
రాయితీ రైతుకా...కొనుగోలుదారుడికా..?
మిర్చి రైతుకు క్వింటాకు రూ.1500 రాయితీ ఇస్తామని ప్రభుత్వం చెప్పినా, దానికి తగ్గ విధివిధానాలు వెల్లడించలేదని ఎమ్మెల్సీ, వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ధ్వజమెత్తారు. సబ్సిడీ.. రైతుకా లేక కొనుగోలుదారుడికా అనేది స్పష్టంగా లేదన్నారు. రైతును నిర్లక్ష్యం చేసిన ప్రభుత్వాల గతి ఏమయ్యిందో చరిత్ర చెబుతోందన్నారు. నీళ్లు లేకపోవడం వల్ల ప్రస్తుతం పశ్చిమ డెల్టా ప్రాంతం కూడా ఎండిపోయిందన్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు అంబటి రాంబాబు తదితరులు పాల్గొన్నారు.