రేపు రాజధాని ప్రాంతంలో జగన్ పర్యటన | ys jagan s tour at capital area | Sakshi
Sakshi News home page

రేపు రాజధాని ప్రాంతంలో జగన్ పర్యటన

Published Mon, Mar 2 2015 2:33 AM | Last Updated on Wed, Apr 4 2018 9:25 PM

ys jagan s tour at capital area

మంగళగిరి (గుంటూరు) : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల మూడో తేదీన రాజధాని ప్రాంతంలో పర్యటించనున్నారు. ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురామ్, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, గుంటూరు జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్‌లు ఆయన పర్యటన వివరాలను ఆదివారం వెల్లడించారు. జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం తెల్లవారుజామున నాలుగు గంటలకు నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్‌లో విజయవాడ చేరుకుంటారు.

అక్కడి నుంచి బయలుదేరి రాజధాని ప్రాంతంలోని ఉండవల్లి చేరుకుని కొద్దిసేపు విశ్రాంతి తీసుకుంటారు. ఉదయం తొమ్మిది గంటల నుంచి రాజధాని ప్రాంతంలోని తాడేపల్లి, మంగళగిరి, తుళ్లూరు మండలాల్లోని పలు గ్రామాల్లో పర్యటిస్తారు. ఈ సందర్భంగా అక్కడ రైతులు, రైతు కూలీలతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకుంటారు. సాయంత్రం అక్కడ నుంచి బయలుదేరి గుంటూరు నగరానికి చేరుకుంటారు. పార్టీ నాయకులు, కార్యకర్తలతో మాట్లాడి అక్కడి నుంచి హైదరాబాద్ వెళతారని నేతలు వివరించారు.
 
రైతులకు భరోసా కల్పించేందుకే...
రైతులకు, రైతు కూలీలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని పార్టీ నేతలు తెలిపారు. దీనిలో భాగంగా రైతుల్లో భరోసా కల్పించి వారి సాదకబాధకాలు తెలుసుకోవటానికే తమ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి రాజధాని ప్రాంతంలో పర్యటిస్తున్నారని వారు వివరించారు.  రైతులు, రైతు కూలీలతో మాట్లాడి వారి సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకోనున్నట్లు చెప్పారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజధాని వ్యవహారంలో రైతులకు అండగా నిలిచిందని, ఇప్పటికే పలు దఫాలుగా తమ పార్టీ నేతలు, రైతు సంఘ నాయకులు, పార్టీ ప్రతినిధి బృందం, శాసనసభాపక్ష బృందం ఈ ప్రాంతంలో పర్యటించాయని చెప్పారు.

తద్వారా ఎప్పటికప్పుడు రాజధాని ప్రాంతంలోని ఇబ్బందులు, సమస్యలను పార్టీ నేతలు జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారని, ఆయన సంబంధిత అధికారులతో, పార్టీ నాయకులతో మాట్లాడి రైతులకు అండగా నిలిచారని వివరించారు. రాజధాని ప్రాంతంలో రైతులకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని, వారిలో ధైర్యం నింపేలా జగన్ పర్యటన సాగుతుందని తెలిపారు. ఈ ప్రాంతంలో రాజధాని నిర్మాణంపై తమ పార్టీకి ఎలాంటి అభ్యంతరం లేదని, ఆ విషయాన్ని అసెంబ్లీలోనే పార్టీ అధినేత జగన్ ప్రకటించారని చెప్పారు. అయితే రాజధాని నిర్మాణ క్రమంలో రైతులు, రైతుకూలీల ప్రయోజనాలకు విఘాతం కలిగించకుండా చూడాలని మొదటినుంచీ తాము డిమాండ్ చేస్తున్నామని వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement