సీమ గడ్డ మీద పుట్టిన మీకు సిగ్గుందా? : కిరణ్, బాబులను ప్రశ్నించిన జగన్
చిత్తూరు: సీమ గడ్డ మీద పుట్టిన మీకు సిగ్గుందా? అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడులను ఉద్దేశించి ప్రశ్నించారు. మూడో విడత సమైక్య శంఖారావం యాత్ర ఆదివారం తంబళ్లపల్లె నియోజకవర్గంలో ప్రారంభమైంది. ఈ యాత్ర బి.కొత్తకోట చేరుకున్న తరువాత అక్కడ జరిగిన భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. సిఎం కిరణ్ ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ గీసిన గీత దాటడం లేదన్నారు. ఇదెక్కడి న్యాయమని ప్రశ్నించవలసిన చంద్రబాబు వారితో కుమ్మక్కై కూర్చున్నారని విమర్శించారు. చంద్రబాబూ మీ నోటి నుంచి సమైక్యమనే మాట ఎందుకు రాదు? అని ప్రశ్నించారు. కిరణ్ మీరెందుకు సమైక్య తీర్మానం చేయడం లేదు? అని అడిగారు. రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందని దేశం మొత్తం గుర్తించినా చంద్రబాబు, కిరణ్‌లకు కనిపించడం లేదన్నారు.
ఏఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని ప్రధానిని చేసేందుకే సోనియా రాష్ట్రాన్ని విభజన చేస్తోందన్నారు. సోనియా గుండెలదిరేలా సమైక్య నినాదం వినిపించాలని పిలుపు ఇచ్చారు. రాష్ట్రం ఒకటిగా ఉన్నప్పుడే నదీ జలాల సమస్యలు ఎక్కువుగా ఉన్నాయని, ఇక విడిపోతే రాష్ట్రం పరిస్థితి ఏమిటీ? అని జగన్ ప్రశ్నించారు. ఈ గడ్డ మీద పుట్టినందుకు సీమతో పాటు అన్ని ప్రాంతాల రైతుల సమస్యలు తీరుస్తానని, మరో నాలుగు నెలలు ఓపిక పట్టండని జగన్ చెప్పారు. హంద్రినీవా, గాలేరునగరి, కల్వకుర్తి, నెట్టెంపాడు ప్రాజెక్ట్‌లు సహా రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్ట్‌లకు నీరందిస్తామన్నారు.