పాపం
ఆడ బిడ్డకు జన్మనిచ్చిందని ఆలిని వేధిస్తున్నాడో భర్త..
మొదటి సంతానంగా మగబిడ్డను కని..
రెండో కాన్పులో ఆడ బిడ్డను ప్రసవించిందని
భార్య ముఖం చూడనన్నాడు మరో మగాడు
ఆడ బిడ్డల్ని కనడమే ఆ తల్లులు చేసిన ‘పాప’మైంది.
దిక్కు తోచని స్థితిలో చంటిబిడ్డలతో ఆ తల్లులు మంగళవారం మదనపల్లె పోలీసులను ఆశ్రయించారు.
ఆ దంపతులది అనోన్య కాపురం.. పెద్దల కుదిర్చిన పెళ్లితో సుఖంగా జీవనం సాగించారు. వారి మధ్య ఏ గొడవలూ లేకుండా దాంపత్య జీవితం సాగిస్తున్న వేళ ఆడబిడ్డల సంతానం చిచ్చురేపింది. ఆడబిడ్డలను కనడమే వారు చేసిన పాపం. రెండు వేర్వేరు చోట్ల వనితలకు అవమానం జరిగింది. వారి భర్తలే వేదింపులకు గురి చేశారు. తట్టుకో లేక మంగళవారం ఇద్దరు చంటి బిడ్డల తల్లులు మదనపల్లె షీటీం పోలీసులను ఆశ్రయించారు.
- ఆడబిడ్డల్ని కనడమే నేరమా..
- వేర్వేరు చోట్ల భార్యలను వేధించిన భర్తలు
- షీటీం పోలీసుల్ని ఆశ్రయించిన చంటిబిడ్డల తల్లులు
మదనపల్లె రూరల్: బి.కొత్తకోటకు చెందిన ఆర్‌టీసీ విరామ ఉద్యోగి ఎస్.అస్మత్ కుమారుడు జాఫర్‌కు, వాల్మీకిపురానికి చెందిన నగ్మా(20)కు రెండేళ్ల క్రితం పెళ్లి అయింది. ఏడాది పాటు సజావుగా సాగిన వీరి కాపురంలో ఆడబిడ్డ పుట్టడం సమస్యగా మారింది. ‘ఆ బిడ్డను తీసుకుని వెళ్లిపో.. నాకు కనపడవద్దు’ అంటే ఏడాదిగా భర్త ఆమెను వేధిస్తుండడంతో వారం రోజులక్రితం పుట్టింటికి చేరింది. అతనితో కాపురం చేయలేనమ్మా అంటూ తల్లిదండ్రుల ఎదుట కన్నీటి పర్యంతమైంది. కూతురు కంట తడిపెట్టడం చూడలేక ఆమె తల్లిదండ్రులు నగ్మాను తీసుకుని మంగళవారం మదనపల్లె టుటౌన్‌లోని షీటీం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మరో వివాహితదీ అదే పరిస్థితి. మదనపల్లె పట్టణంలోని చీకలగుట్టకు చెందిన ఆటోడ్రైవర్ రెడ్డిశేఖర్‌కు, నగిరిమడుగుకు చెందిన శైలజ(20)కు నాలుగేళ్ల క్రితం పెళ్లి అయింది. ఈ క్రమంలో వారికి ఇద్దరు పిల్లలు. మొదటి సంతానం మగబిడ్డకాగా రెండో సంతానంగా ఆడబిడ్డకు జన్మనిచ్చింది. బిడ్డ పుట్టినప్పటి నుంచి ఇంట్లో ఒకటే గొడవ. చివరకు భర్త ఇంటికి రాకపోవడం, పిల్లల బాగోగులు చూడకపోవడంతో పస్తులుండలేక నెల క్రితం శైలజ పుట్టింటికి వెళ్లింది. మదనపల్లె షీ టీం పోలీసులకు ఫిర్యాదు చేస్తే మీ కాపురం నిలబడుతుందని స్థానికులు చెప్పడంతో శైలజ మంగళవారం షీటీం పోలీసులను ఆశ్రయించింది. కో ఆర్డినేటర్ రామాదేవి కేసు దర్యాప్తు చేస్తున్నారు.