B.kottakota
-
సర్పంచులుగా ఉన్నా వీడని వృత్తులు.. సాదాసీదాగా జనంతో మమేకం
బి.కొత్తకోట(అన్నమయ్య జిల్లా): సాధారణంగా చిన్న పదవికే డాబు, దర్పం ప్రదర్శించేవాళ్లను చూస్తుంటాం. ఆ పదవితో చేస్తున్న వృత్తిని వదిలేసి పూర్తిస్థాయి రాజకీయ నాయకుని అవతారం ఎత్తేస్తారు. అయితే గ్రామానికి ప్రథమపౌరులై ఉండి, మన దేశంలో ప్రధానికైనా లేని చెక్‌పవర్ కలిగిన సర్పంచులు సాదాసీదాగా, చేస్తున్న వృత్తికే అంకితమై ఆదర్శంగా నిలుస్తున్నారు. తాము సర్పంచులం, మనకొక హోదా, గుర్తింపు, సమాజంలో, అధికారుల వద్ద ప్రత్యేక గుర్తింపు, గౌరవం ఉందన్న అహం కొందరిలో మచ్చుకైనా కనిపించడం లేదు. సర్పంచులు కాక ముందు ఏ వృత్తిలో ఉండి జీవనం సాగించేవాళ్లో ఇప్పుడూ వాటినే కొనసాగిస్తూ పంచాయతీ ప్రజల్లో మన్ననలు పొందుతున్నారు. సర్పంచు అయ్యాక మనోడు మారలేదు అనుకునేలా అందరితో కలిసిపోతూ మమేకమవుతున్నారు. అలాంటి సర్పంచుల్లో కొందరి గురించి... మోటర్ మెకానిక్‌గానే... అన్నమయ్య జిల్లా బి.కొత్తకోట మండలం గుట్టపాళెంకు చెందిన సి.జయరామిరెడ్డి వైఎస్సార్సీపీ మద్దతుతో నాయనబావి సర్పంచుగా పోటీ చేసి అధిక మెజార్టితో గెలుపొందారు. అప్పటివరకు వ్యవసాయ మోటార్లకు రిపేర్లు చేసే మెకానిక్‌గా గ్రామస్తులకు పరిచయం. సర్పంచు పదవితో రాజకీయాల్లో బీజీ అయిపోతాడని గ్రామస్తులు భావించారు. డిగ్రీ ఫైయిల్ అయిన జయరామిరెడ్డి భిన్నంగా ఉన్నాడు. సర్పంచు పదవి ఇప్పుడొచ్చింది, నాకు జీవితాన్నిచ్చిన వృత్తిని వదిలేదిలేదని నిక్కచ్చిగా చెప్పేశాడు. సర్పంచుగా అధికారుల సమావేశాలకు హజరువుతూ, ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూనే మోటార్ల రిపేరు పనిని కొనసాగిస్తున్నాడు. వ్యవసాయ పనుల్లో నిమగ్నం పెద్దమండ్యం మండలం కోటకాడపల్లె సర్పంచు కే.భూదేవి చదివింది ఐదో తరగతి. ఎస్సీ రిజర్వేషన్ కోటాలో ఆమె సర్పంచు అయింది. భర్త పెద్దరెడ్డెప్పకి ఒకటిన్నర ఎకరా పొలం, అందులో బోరు ఉంది. మొదటినుంచి మహిళా రైతుగా వ్యవసాయం చేస్తోంది. కోటకాడపల్లె సర్పంచు పదవికి పోటీచేసి గెలుపొందినా ఆమె రైతు జీవితాన్ని వీడలేదు. సర్పంచుగా తన బాధ్యతలను నిర్వర్తిస్తూనే రోజూ వ్యవసాయ పనుల్లో నిమగ్నమవుతారు. తాను గ్రామానికి ప్రథమ పౌరురాలిని అన్న దర్పం చూపకుండా టమాట, వేరుశెనగ పంటల సాగు పనులు చేస్తున్నారు. మహిళా సర్పంచు అయినప్పటికి మహిళా రైతు జీవితాన్ని వీడలేదు. పదవిలో రాణిస్తూ.. వృత్తిలో కొనసాగుతూ.. తంబళ్లపల్లె మండలం గుండ్లపల్లె సర్పంచుగా పదో తరగతి చదివిన ఓ సాధారణ బోర్ మెకానిక్ ఎస్.మౌలాలి ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. పైసా ఖర్చు లేకుండా ఏకగ్రీవమంటే ఆ సర్పంచు డాబు చూపాల్సిందే. అయితే ఈయన సర్పంచుగా కంటే బోర్ మెకానిక్‌గానే గుర్తింపు కోరుకొంటున్నాడు. పాపిరెడ్డిగారిపల్లెకు చెందిన ఈయన ఈ ప్రాంతంలో బోర్లలో మోటార్లను వెలికితీయడం, కాలిపోయిన మోటార్లకు వైండింగ్ పనులు చేస్తున్నారు. సర్పంచుగా విధులు నిర్వర్తిస్తూనే మెకానిక్ పని చేస్తున్నాడు. తన వృత్తికి సర్పంచు పదవి అడ్డంకికాదని, అందరూ తనను మెకానిక్‌గానే అభిమానిస్తారని అంటున్నాడు మౌలాలి. సమస్యలు పరిష్కరిస్తూ.. దుకాణం నడుపుతూ.. బి.కొత్తకోట మండలం కనికలతోపుకు చెందిన ఆర్.రుక్మిణి ఇంటర్ ఫెయిల్. తుమ్మణంగుట్ట సర్పంచు పదవి జనరల్ మహిళ కావడంతో ఎన్నికల్లో పోటీచేసి గెలుపొందారు. భర్త అమరనాథరెడ్డితో కలిసి చిల్లర దుకాణం, చికెన్ సెంటర్ నడుపుతూ వస్తున్నారు. సర్పంచుగా గెలుపొందినా వృతిని వీడలేదు. సర్పంచుగా సమావేశాలకు హజరవుతూ, పల్లెల్లో పర్యటిస్తూ, సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నారు. అయినప్పటికి సాధారణ గృహిణిలా, దుకాణంలో పనులు చేసుకుంటూ కనిపిస్తారు. (క్లిక్: ఆ నిబంధనతో పేద విద్యార్థులకు ఉచితంగా కార్పొరేట్ విద్య..) -
పాపం
ఆడ బిడ్డకు జన్మనిచ్చిందని ఆలిని వేధిస్తున్నాడో భర్త.. మొదటి సంతానంగా మగబిడ్డను కని.. రెండో కాన్పులో ఆడ బిడ్డను ప్రసవించిందని భార్య ముఖం చూడనన్నాడు మరో మగాడు ఆడ బిడ్డల్ని కనడమే ఆ తల్లులు చేసిన ‘పాప’మైంది. దిక్కు తోచని స్థితిలో చంటిబిడ్డలతో ఆ తల్లులు మంగళవారం మదనపల్లె పోలీసులను ఆశ్రయించారు. ఆ దంపతులది అనోన్య కాపురం.. పెద్దల కుదిర్చిన పెళ్లితో సుఖంగా జీవనం సాగించారు. వారి మధ్య ఏ గొడవలూ లేకుండా దాంపత్య జీవితం సాగిస్తున్న వేళ ఆడబిడ్డల సంతానం చిచ్చురేపింది. ఆడబిడ్డలను కనడమే వారు చేసిన పాపం. రెండు వేర్వేరు చోట్ల వనితలకు అవమానం జరిగింది. వారి భర్తలే వేదింపులకు గురి చేశారు. తట్టుకో లేక మంగళవారం ఇద్దరు చంటి బిడ్డల తల్లులు మదనపల్లె షీటీం పోలీసులను ఆశ్రయించారు. - ఆడబిడ్డల్ని కనడమే నేరమా.. - వేర్వేరు చోట్ల భార్యలను వేధించిన భర్తలు - షీటీం పోలీసుల్ని ఆశ్రయించిన చంటిబిడ్డల తల్లులు మదనపల్లె రూరల్: బి.కొత్తకోటకు చెందిన ఆర్టీసీ విరామ ఉద్యోగి ఎస్.అస్మత్ కుమారుడు జాఫర్‌కు, వాల్మీకిపురానికి చెందిన నగ్మా(20)కు రెండేళ్ల క్రితం పెళ్లి అయింది. ఏడాది పాటు సజావుగా సాగిన వీరి కాపురంలో ఆడబిడ్డ పుట్టడం సమస్యగా మారింది. ‘ఆ బిడ్డను తీసుకుని వెళ్లిపో.. నాకు కనపడవద్దు’ అంటే ఏడాదిగా భర్త ఆమెను వేధిస్తుండడంతో వారం రోజులక్రితం పుట్టింటికి చేరింది. అతనితో కాపురం చేయలేనమ్మా అంటూ తల్లిదండ్రుల ఎదుట కన్నీటి పర్యంతమైంది. కూతురు కంట తడిపెట్టడం చూడలేక ఆమె తల్లిదండ్రులు నగ్మాను తీసుకుని మంగళవారం మదనపల్లె టుటౌన్‌లోని షీటీం పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరో వివాహితదీ అదే పరిస్థితి. మదనపల్లె పట్టణంలోని చీకలగుట్టకు చెందిన ఆటోడ్రైవర్ రెడ్డిశేఖర్‌కు, నగిరిమడుగుకు చెందిన శైలజ(20)కు నాలుగేళ్ల క్రితం పెళ్లి అయింది. ఈ క్రమంలో వారికి ఇద్దరు పిల్లలు. మొదటి సంతానం మగబిడ్డకాగా రెండో సంతానంగా ఆడబిడ్డకు జన్మనిచ్చింది. బిడ్డ పుట్టినప్పటి నుంచి ఇంట్లో ఒకటే గొడవ. చివరకు భర్త ఇంటికి రాకపోవడం, పిల్లల బాగోగులు చూడకపోవడంతో పస్తులుండలేక నెల క్రితం శైలజ పుట్టింటికి వెళ్లింది. మదనపల్లె షీ టీం పోలీసులకు ఫిర్యాదు చేస్తే మీ కాపురం నిలబడుతుందని స్థానికులు చెప్పడంతో శైలజ మంగళవారం షీటీం పోలీసులను ఆశ్రయించింది. కో ఆర్డినేటర్ రామాదేవి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
వీఆర్ఏ పోస్టులకు అభ్యర్థుల కరువు
ఒక్క అభ్యర్థీ దరఖాస్తు చేసుకోలేదు. మాజీ సైనికుల కేటగిరిలో భర్తీ చేయాల్సిన 5 పోస్టులకూ అదే పరిస్థితి. బీసీ-సీ జనరల్ కేటగిరికి కేటాయించిన 3 పోస్టులు, బీసీ-ఏ, ఎస్టీ మహిళలకు కేటాయించిన ఒక్కో పోస్టుకూ దరఖాస్తులు అందలేదు. ఈ పోస్టుల భర్తీకి జిల్లా రెవెన్యూ యంత్రాంగం నివేదికను రూపొందించి సీసీఎల్ఏకు పంపాల్సి ఉంది. దరఖాస్తులందని గ్రామాలివే! అంధ మహిళల విభాగంలో...: బి.కొత్తకోట మండలం గొల్లపల్లె, బీఎన్.కండ్రిగ మండలం నెలవాయి, చంద్రగిరి మండలం కల్రోడ్పల్లె, చిన్నగొట్టిగల్లు మండలం ఎగువూరు, చిత్తూరు మండలంలోని మురకంబట్టు, చౌడేపల్లె మండలం పెద్దయల్లకుంట్ల, గంగాధరనెల్లూరు మండలం గొల్లపల్లె గ్రామాల నుంచి దరఖాస్తులు రాలేదు. కుప్పం మండలం కృష్ణదాసానపల్లె, నిమ్మనపల్లె మండలం వెంగంవారిపల్లె, పాకాల మండలం గోర్పాడు, పెనుమూరు మండలం నంజర్లపల్లె, పూతలపట్టు మండలం పూతలపట్టు గ్రామం, రామచంద్రాపురం మండలం చిట్టత్తూరు కాలేపల్లె, శాంతిపురం మండలం మోరసానిపల్లె, సత్యవేడు మండలం కన్నావరం, వడమాలపేట మండలం శ్రీబొమ్మరాజుపురం, వాల్మీకిపురం మండలం టిసాకిరేవుపల్లె నుంచి దరఖాస్తులు అందలేదు. మాజీ సైనికుల విభాగంలో...: చంద్రగిరి మండలం నరసింగాపురం, గుర్రంకొండ మండలం సరిమడుగు, ములకలచెరువు మండలం నాయనిచెరువు, తంబళ్లపల్లె మండలం ఎద్దులవారిపల్లె , వాల్మీకిపురం మండలం విఠలం గ్రామాల్లో మాజీ సైనికులు ఎవ్వరూ వీఆర్ఏ పోస్టులకు దరఖాస్తు చేసుకోలేదు. బీసీ-సీ కేటగిరిలో...: క్రిస్టియన్లుగా మారిన ఎస్సీ సామాజిక వర్గానికి కేటాయించిన వీఆర్ఏ పోస్టులకు సంబంధించి గుర్రంకొండ మండలం తరిగొండరాచపల్లె, ములకలచెరువు మండలం పెద్దపాళెం, తంబళ్లపల్లె మండలం ఎద్దులవారిపల్లె నుంచి ఒక్కరూ దరఖాస్తు చేసుకోలేదు. వరదయ్యపాళెం మండలం మరదవాడ గ్రామాన్ని బీసీ-సీకి చెందిన మహిళకు కేటాయించారు. వి.కోట మండలం బోడిగుట్టపల్లెను ఎస్టీ మహిళకు కేటాయించగా ఆయా గ్రామాల నుంచి ఒక్క దరఖాస్తూ అందలేదు. గ్రామాన్ని యూనిట్‌గా తీసుకోవడం వల్లే! వీఆర్ఏ పోస్టుల భర్తీకి సంబంధించిన నిబంధనల వల్లే జిల్లాలో అభ్యర్థులు కరువయ్యారని పరిశీలకులు భావిస్తున్నారు. రోస్టర్ విధానం ప్రకారం ఆయా కేటగిరీలకు చెందిన అభ్యర్థులు దొరకని పరిస్థితి నెలకొంటోంది. వీఆర్వో పోస్టుల మాదిరిగానే వీఆర్ఏ పోస్టుల భర్తీకి జిల్లాను యూనిట్‌గా తీసుకుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని నిరుద్యోగులు అంటున్నారు. -
సీమ గడ్డ మీద పుట్టిన మీకు సిగ్గుందా? : కిరణ్, బాబులను ప్రశ్నించిన జగన్
చిత్తూరు: సీమ గడ్డ మీద పుట్టిన మీకు సిగ్గుందా? అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడులను ఉద్దేశించి ప్రశ్నించారు. మూడో విడత సమైక్య శంఖారావం యాత్ర ఆదివారం తంబళ్లపల్లె నియోజకవర్గంలో ప్రారంభమైంది. ఈ యాత్ర బి.కొత్తకోట చేరుకున్న తరువాత అక్కడ జరిగిన భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. సిఎం కిరణ్ ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ గీసిన గీత దాటడం లేదన్నారు. ఇదెక్కడి న్యాయమని ప్రశ్నించవలసిన చంద్రబాబు వారితో కుమ్మక్కై కూర్చున్నారని విమర్శించారు. చంద్రబాబూ మీ నోటి నుంచి సమైక్యమనే మాట ఎందుకు రాదు? అని ప్రశ్నించారు. కిరణ్ మీరెందుకు సమైక్య తీర్మానం చేయడం లేదు? అని అడిగారు. రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందని దేశం మొత్తం గుర్తించినా చంద్రబాబు, కిరణ్‌లకు కనిపించడం లేదన్నారు. ఏఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని ప్రధానిని చేసేందుకే సోనియా రాష్ట్రాన్ని విభజన చేస్తోందన్నారు. సోనియా గుండెలదిరేలా సమైక్య నినాదం వినిపించాలని పిలుపు ఇచ్చారు. రాష్ట్రం ఒకటిగా ఉన్నప్పుడే నదీ జలాల సమస్యలు ఎక్కువుగా ఉన్నాయని, ఇక విడిపోతే రాష్ట్రం పరిస్థితి ఏమిటీ? అని జగన్ ప్రశ్నించారు. ఈ గడ్డ మీద పుట్టినందుకు సీమతో పాటు అన్ని ప్రాంతాల రైతుల సమస్యలు తీరుస్తానని, మరో నాలుగు నెలలు ఓపిక పట్టండని జగన్ చెప్పారు. హంద్రినీవా, గాలేరునగరి, కల్వకుర్తి, నెట్టెంపాడు ప్రాజెక్ట్‌లు సహా రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్ట్‌లకు నీరందిస్తామన్నారు. -
నిధులకువైకల్యం
బి.కొత్తకోట, న్యూస్‌లైన్: సీఎం నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి సొంత జిల్లాలో వికలాంగులకు ఫిజియోథెరపీ (మర్దన), ఇతర చికిత్సలు నామమాత్రంగా మిగిలిపోతున్నాయి. గతేడాది అందించిన సేవలు ఈ ఏడాది లేకపోవడంపై వికలాంగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం నిధుల్లో కోతలు విధించడం వల్ల ఈ చర్యలు తీసుకోక తప్పడం లేదని జిల్లా అధికారులు చెబుతున్నారు. జిల్లా పరిధిలోని 66 మండలాల్లో రాజీవ్ విద్యామిషన్ ఆధ్వర్యంలో 2011 సెప్టెంబర్ నుంచి ఫిజియోథెరపీ చికిత్సా విధానాన్ని అమలులోకి తెచ్చారు. మండల వనరుల కేంద్రాల్లో (ఎమ్మార్సీ) వీటిని ఏర్పాటుచేశారు. కాళ్లు, చేతులు వంకరపోవడం, నడవలేని స్థితిలో ఉన్న వికలాంగ పిల్లలు వైకల్య శాతాన్ని బట్టి చికిత్స పొందేవారు. ఇవి కొంతమేర సత్ఫలితాలను ఇచ్చాయి. చికిత్స పొందిన వికలాంగునికి రవాణా భత్యం కింద రూ.100 చెల్లించేవారు. ప్రతి సోమవారమూ చికిత్స అందించేవారు. మండలానికి 20 నుంచి 30 మంది వికలాంగులు వచ్చేవా రు. జిల్లా వ్యాప్తంగా వారానికి 1,110 మంది చొప్పున నెలకు 4,440 మంది వికలాంగ పిల్లలు చికిత్స పొందేవారు. ఇలా 2011 సెప్టెంబర్ నుంచి 2013 ఏప్రిల్ దాకా 20 నెలల కాలంలో 88,800 మంది చికిత్స పొందారు. తద్వారా వికలాంగులకు రూ.90 లక్షల వరకు చెల్లించారు. నిధులు లేవన్న కారణంగా మే నుంచి సేవలను కుదించారు. శిబిరాలను నెలలో రెండు రోజులకే పరిమితం చేశారు. రవాణాభత్యం రూ.100 పూర్తిగా నిలిపివేశారు. చికిత్స కావాలంటే వికలాంగులే ఖర్చులు భరించుకోవాలని అధికారులు ఖరాఖండీగా చెప్పేశారు. ఈ నేపథ్యంలో చికిత్స కోసం వచ్చే వికలాంగుల సంఖ్య వారానికి 600కు పడిపోయింది. మిగిలిన 500 మంది దూరమయ్యారు. 2012-13లో దీనికోసం రూ.2.4 కోట్లు కేటాయించగా రూ.1.7 కోట్లు ఖర్చు చేశారు. 2013-14 సంవత్సరానికి రూ.1.02 కోట్లను మాత్రమే కేటాయించారు. జిల్లాలో మొత్తం12,792మంది వికలాలగులు వివిధ సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. 1,772మంది నరాల బలహీనత, 1,452మంది వినికిడి లోపం, 1,035మందికి పాక్షిక దృష్టి లోపం, 3,444మంది బుద్ధిమాంద్యం, 1,653మంది అంగవైకల్యం, 785మందికి మాటలు రాకపోవడం, 181 మందికి పూర్తి దృష్టి లోపం, 59మంది ఆర్డిజం, 276 మంది నేర్చుకోలేని లోపంతో బాధపడుతున్నారు. ప్రతివారమూ చికిత్సకు వచ్చే 1,110 మందిలో సగం మంది చికిత్సకు దూరంగా ఉన్నారు. రవాణా భత్యం రూ.100 ఇచ్చేటప్పుడు పేదలకు బస్సు చార్జీలు, మధ్యాహ్న భోజనానికి డబ్బు సరిపోయేది. ఇవ్వకపోవడంతో చికిత్సకు ఆసక్తి చూపడంలేదు. -
హంద్రీ-నీవా నత్తనడక
బి.కొత్తకోట, న్యూస్‌లైన్: చిత్తూరు, అనంతపురం జిల్లాలో సాగుతున్న హంద్రీ-నీవా ప్రాజెక్టు పనులు మూడు నెలలుగా మందగించాయి. డిసెంబర్ నాటికి పనులు పూర్తి కావాల్సి ఉన్నా, అన్నీ అసంపూర్తిగానే ఉన్నారుు. ప్రధానంగా మదనపల్లె మండలంలోని చిప్పిలి, గుంటివారిపల్లె సమ్మర్ స్టోరేజీ ట్యాంకుల నిర్మాణ పనులు స్తం భించాయి. ఆరు నెలలుగా పనుల జాడే లేదు. 59వ ప్యాకేజీ పరిధిలోకి వచ్చే ఈ పనులు మదనపల్లె పట్టణానికి మంచినీటిని అందించేందుకు ఉద్దేశించింది. నీటికోసం ప్రజలు అల్లాడుతున్నా పనులు పూర్తికాక పోవడంతో ఏజెన్సీకి ఇప్పటివరకు 29 నోటీసులను ఇ చ్చారు. పనులుచేయాలంటూ ఒత్తిడిచేస్తున్నా ఫలితం కనిపించడం లేదు. అలాగే కేవీపల్లె మండలంలో 23వ ప్యాకేజీలో జరుగుతున్న అడవిపల్లె రిజర్వాయర్ పనులు 86శాతం మాత్రమే పూర్తయ్యూరుు. 20వ ప్యాకేజీలోని పెద్దమండ్యం మండలంలోని ప్రధాన కాలువ, 29వప్యాకేజీలో జరుగుతున్న నీవా బ్రాంచ్ కెనాల్ పనులపైనా, అనంతపురం జిల్లాలో 6,9,10, 11,15 ప్యాకేజీల్లోని పనులు ముందుకు సాగడం లేదు. ఇక్కడ కన గానపల్లె, బుక్కపట్నం, కొత్తచెరువు, ముదిగుబ్బ, త లుపుల మండలాల్లో జరగాల్సిన పనుల్లో జాప్యం చో టుచేసుకుంది. దీనిపై ప్రాజెక్ట్ అధికారులు తీవ్రంగా స్పందించారు. ప్యాకేజీ(కాంట్రాక్ట్‌లు)లు పొందిన ఏజెన్సీలు పనులు వేగవంతం చేయాలని లేదంటే కాంట్రాక్టులు రద్దు చేస్తామని అధికారులు హెచ్చరించారు. వెంటనే పనులు పూర్తిచేయండి, లేదంటే చర్యలు తప్పవని స్పష్టం చేశారు. దీనిపై ప్రాజెక్టుకు చెందిన ఓ అధికారి మంగళవారం ‘న్యూస్‌లైన్’తో మాట్లాడుతూ మూ డునెలలుగా కొన్ని ప్యాకేజీల్లో పనులు ముందుకు సాగడంలేదని గుర్తించామన్నారు. దీనిపై పలుమార్లు ఏజెన్సీలకు చెప్పినా ఫలితం లేకపోవడంతో నోటీసులు జారీ అయినట్టు చెప్పారు. పనులు వేగవంతం అయ్యేందుకు కృషిచేస్తున్నామని చెప్పారు. కాంట్రాక్టర్లు ఇప్పటికైనా స్పందించాలని సూచించారు.