బి.కొత్తకోట, న్యూస్‌లైన్: సీఎం నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి సొంత జిల్లాలో వికలాంగులకు ఫిజియోథెరపీ (మర్దన), ఇతర చికిత్సలు నామమాత్రంగా మిగిలిపోతున్నాయి. గతేడాది అందించిన సేవలు ఈ ఏడాది లేకపోవడంపై వికలాంగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం నిధుల్లో కోతలు విధించడం వల్ల ఈ చర్యలు తీసుకోక తప్పడం లేదని జిల్లా అధికారులు చెబుతున్నారు. జిల్లా పరిధిలోని 66 మండలాల్లో రాజీవ్ విద్యామిషన్ ఆధ్వర్యంలో 2011 సెప్టెంబర్ నుంచి ఫిజియోథెరపీ చికిత్సా విధానాన్ని అమలులోకి తెచ్చారు. మండల వనరుల కేంద్రాల్లో (ఎమ్మార్సీ) వీటిని ఏర్పాటుచేశారు. కాళ్లు, చేతులు వంకరపోవడం, నడవలేని స్థితిలో ఉన్న వికలాంగ పిల్లలు వైకల్య శాతాన్ని బట్టి చికిత్స పొందేవారు. ఇవి కొంతమేర సత్ఫలితాలను ఇచ్చాయి. చికిత్స పొందిన వికలాంగునికి రవాణా భత్యం కింద రూ.100 చెల్లించేవారు. ప్రతి సోమవారమూ చికిత్స అందించేవారు.
మండలానికి 20 నుంచి 30 మంది వికలాంగులు వచ్చేవా రు. జిల్లా వ్యాప్తంగా వారానికి 1,110 మంది చొప్పున నెలకు 4,440 మంది వికలాంగ పిల్లలు చికిత్స పొందేవారు. ఇలా 2011 సెప్టెంబర్ నుంచి 2013 ఏప్రిల్ దాకా 20 నెలల కాలంలో 88,800 మంది చికిత్స పొందారు. తద్వారా వికలాంగులకు రూ.90 లక్షల వరకు చెల్లించారు. నిధులు లేవన్న కారణంగా మే నుంచి సేవలను కుదించారు. శిబిరాలను నెలలో రెండు రోజులకే పరిమితం చేశారు. రవాణాభత్యం రూ.100 పూర్తిగా నిలిపివేశారు. చికిత్స కావాలంటే వికలాంగులే ఖర్చులు భరించుకోవాలని అధికారులు ఖరాఖండీగా చెప్పేశారు. ఈ నేపథ్యంలో చికిత్స కోసం వచ్చే వికలాంగుల సంఖ్య వారానికి 600కు పడిపోయింది. మిగిలిన 500 మంది దూరమయ్యారు.
2012-13లో దీనికోసం రూ.2.4 కోట్లు కేటాయించగా రూ.1.7 కోట్లు ఖర్చు చేశారు. 2013-14 సంవత్సరానికి రూ.1.02 కోట్లను మాత్రమే కేటాయించారు. జిల్లాలో మొత్తం12,792మంది వికలాలగులు వివిధ సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. 1,772మంది నరాల బలహీనత, 1,452మంది వినికిడి లోపం, 1,035మందికి పాక్షిక దృష్టి లోపం, 3,444మంది బుద్ధిమాంద్యం, 1,653మంది అంగవైకల్యం, 785మందికి మాటలు రాకపోవడం, 181 మందికి పూర్తి దృష్టి లోపం, 59మంది ఆర్డిజం, 276 మంది నేర్చుకోలేని లోపంతో బాధపడుతున్నారు. ప్రతివారమూ చికిత్సకు వచ్చే 1,110 మందిలో సగం మంది చికిత్సకు దూరంగా ఉన్నారు. రవాణా భత్యం రూ.100 ఇచ్చేటప్పుడు పేదలకు బస్సు చార్జీలు, మధ్యాహ్న భోజనానికి డబ్బు సరిపోయేది. ఇవ్వకపోవడంతో చికిత్సకు ఆసక్తి చూపడంలేదు.