చంద్రబాబుకు చాలెంజ్ | ys jagan savals chandra babu naidu | Sakshi
Sakshi News home page

చంద్రబాబుకు చాలెంజ్

Published Wed, Jan 1 2014 1:19 AM | Last Updated on Sat, Jul 28 2018 6:43 PM

ys jagan savals chandra babu naidu

ప్రజల్లోకి వెళ్లి నీ పాలన మళ్లీ తెస్తానని చెప్పగలవా?  
టీడీపీ అధినేతకు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సవాల్
 నువ్వు రూపాయి ఇస్తానన్నా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు
 ఎందుకంటే తొమ్మిదేళ్ల పాలనలో నువ్వు ప్రజలకు  పది పైసల మేలు కూడా చేయలేదు
  అదే జగన్ రూ.50 ఇస్తానన్నా ప్రజలు నమ్ముతారు..  గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకపోగా
  ఎన్టీఆర్ హామీలనూ తుంగలో తొక్కిన ఘనత బాబుదే
  ఇప్పుడు అదే చంద్రబాబు అన్నీ ఉచితమంటూ సునాయాసంగా హామీలిస్తున్నారు
  రాష్ట్రంలో ప్రతి గొంతూ ‘జై సమైక్యాంధ్ర’ అని నినదిస్తోంది..  అయినా బాబుకు, కిరణ్‌కుమార్‌రెడ్డికి అర్థం కావటం లేదు
  దమ్ము, ధైర్యం ఉంటే రండి ఎన్నికలకు పోదాం..
 


 ‘సమైక్యశంఖారావం’ నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: ‘‘టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల కోసం ప్రజలను తప్పుదోవ పట్టించే మాటలు మాట్లాడుతున్నారు. రకరకాల ఎన్నికల హామీలు ఇస్తున్నారు. ఇదే చంద్రబాబును చాలెంజ్ చేస్తున్నాను. ప్రజల్లోకి వెళ్లి నీ తొమ్మిదేళ్ల పాలన తిరిగి తెస్తానని ప్రజలకు చెప్పగలవా?’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైఎస్ జగ న్‌మోహన్‌రెడ్డి సవాల్ విసిరారు. నాడు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయకపోగా.. ఎన్టీఆర్ పథకాలను కూడా తుంగలో తొక్కిన ఘనత చంద్రబాబుదేనని విమర్శించారు.
 
 2014లో తాను అధికారంలోకి వచ్చిన తరువాత దివంగత నేత, ప్రియతమ నాయకుడు వైఎస్సార్ సువర్ణ యుగాన్ని మళ్లీ తీసుకొని వస్తానని జగన్‌మోహన్‌రెడ్డి ప్రజలకు హామీ ఇచ్చారు. ఆ సువర్ణయుగం 30 ఏళ్ల పాటు కొనసాగుతుందని, ఆ రాజన్న రాజ్యంలో ప్రతి పేదవాని గుండె చప్పుడు వింటానని, ప్రతి పేదవాని మనసు ఎరుగుతానని భరోసా ఇచ్చారు. ‘‘నేను చనిపోయిన తరువాత కూడా ప్రతిపేదవాడి ఇంట్లో నాన్నగారి ఫొటో పక్కన నా ఫొటో కూడా పెట్టుకునేంతలా పేదవాడి కోసం కృషి చేస్తాను’’ అని ఉద్వేగంగా వ్యాఖ్యానించారు. ఓట్ల కోసం, సీట్ల కోసం రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించటాన్ని నిరసిస్తూ జగన్ కుప్పం నుంచి శ్రీకాకుళం దాకా తలపెట్టిన ‘సమైక్య శంఖారావం’ యాత్ర మలిదశ నాలుగో రోజు మంగళవారం చిత్తూరు జిల్లా మదనపల్లె నియోజకవర్గంలో కొనసాగింది. మదనపల్లె నియోజకవర్గ కేంద్రంలో జరిగిన బహిరంగ సభలకు ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చారు. వారిని ఉద్దేశించి జగన్ ప్రసంగించారు. సమైక్య నినాదాల మధ్య సాగిన జగన్ ప్రసంగ సారాంశం ఆయన మాటల్లోనే..
 
 ఆ మాట.. జై సమైక్యాంధ్ర..
 
 ఇవాళ ప్రతి గొంతు ఒకే ఒక మాట మాట్లాడుతోంది. ప్రతి మనసు ఒకే ఒక ఆలోచనతో ఉద్యమ బాట పట్టింది. ఆ ఒకే ఒక్క మాట ఏమిటీ అని అంటే.. ‘జై సమైక్యాంధ్ర’. అయినా కూడా మన ఖర్మ ఏమిటంటే ఈ గడ్డ మీద పుట్టిన చంద్రబాబుకు, కిరణ్‌కుమార్‌రెడ్డికి మాత్రం అర్థం కావట్లేదు. సోనియాగాంధీకి మన భాష రాదు, మన దేశం గురించి కూడా సరిగా తెలియదు కాబట్టి ఆవిడ గురించి నేను చెప్పవలసిన అవసరం లేదు. సోనియాగాంధీ తన కొడుకును ప్రధానమంత్రి సీట్లో కూర్చోబెట్టుకోవడం కోసం ఇవాళ మన పిల్లల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు. ఒక్కొక్కసారి నాకు అనిపిస్తుంది.. తెలియని వారికి ఏదైనా చెప్పొచ్చని. కానీ కళ్లుండి కూడా కబోదుల్లా నాటకం ఆడుతున్న వీళ్లకు ఎలా చెప్పాలి? చంద్రబాబూ నీకు, కిరణ్‌కుమార్‌రెడ్డికి, సోనియాగాంధీకి.. మీకు దమ్ము, ధైర్యం ఉంటే రండి ఎన్నికలకు పోదాం. సమైక్య నినాదంతో నేను యావత్తు రాష్ట్రం తిరుగుతాను.. 30 ఎంపీ స్థానాలు గెలుచుకొని వస్తాను. గెలుచుకోవడమే కాదు ఎవరైతే రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుతారో వారినే ప్రధానమంత్రి కుర్చీలో కూర్చోబెడతాం. ప్రజల్లోకి రావడానికి మీకు దమ్ము, ధైర్యం ఉందా? ఇలా బస్సులో మీరు ఈ పక్కనుంచి వెళ్తే మీ మీద కోడి గుడ్ల దగ్గర నుంచి టమాటాల వరకు అన్నీ పడతాయనే సంగతి మీకు మాత్రం తెలియదా?  
 
 చంద్రబాబు సభలకు జనం రాకున్నా.. వచ్చినట్లు..
 
 ఆ దివంగత నేత వైఎస్సార్ బతికి ఉన్నప్పుడు ఒక సువర్ణయుగాన్ని చూపించారు. ఆ సువర్ణయుగంలో ఎవ్వరు కూడా విడిపోదాం అని అడగని పరిస్థితుల్లో వైఎస్సార్ రాష్ట్రాన్ని నడిపించారు. ఆయన చనిపోయిన తరువాత రాష్ట్రంలో రాజకీయ వ్యవస్థ ఎలా తయారైపోయిందంటే.. నిజాయితీ కరువైంది. ఎంతలా కరువై పోయిందంటే సమైక్యంగా ఉండాలని రాష్ర్టమంతటా ఉద్యమ బాట పడుతుంటే చంద్రబాబు మొన్న తిరుపతికి వచ్చి ఉద్యమాన్ని తప్పుదోవ పట్టించేలా మాట్లాడిన మాటలు వింటే ఆయన ఒక నాయకుడా? అని పిస్తోంది. ఇవాళ ‘ఈనాడు’ దినపత్రికలో చంద్రబాబు నాయుడుకు సంబంధించి ఒంగోలులో జరిగిన ఒక మీటింగ్ ఫొటో వేశారు. ఆశ్చర్యం ఏమిటంటే ఆ ఫొటోలో వేసిన దాని ప్రకారం కనీసం మదనపల్లిలో ఈ రోజు ఇక్కడ ఉన్న జనాభా కూడా అక్కడ ఉన్నట్టు కనిపించలేదు. 10 వేల మంది జనాభా కూడా లేకపోయినా కుర్చీలు వేశారు.. కుర్చీలు వేసి జనాలు ఎక్కువగా ఉన్నట్టు చూపించుకునే కుయుక్తులు పన్నుతున్నారు.
 
 నాడు హామీలిచ్చి.. ఏం చేశావ్ బాబూ?
 
 చంద్రబాబు ప్రజల్ని తప్పుదోవ పట్టించేందుకు రకరకాల హామీలు ఇస్తూ పోతున్నారు. తొమ్మిది సంవత్సరాలు పరిపాలన చేసినప్పుడు 8 సార్లు కరెంటు చార్జీలు పెంచిన చంద్రబాబు.. ఇవాళ కరెంటు చార్జీలు తగ్గిస్తారట. మీ మామ ఎన్టీఆర్ గారు రూ.2కే కిలో బియ్యం ఇస్తే దాన్ని రూ 5.25 చేసింది నువ్వు కాదా? మద్యపానాన్ని నిషేధిస్తామని ఎన్నికలకు వెళ్లి.. ఎన్నికలయ్యాక మాట మార్చలేదా? గ్రామగ్రామాన బెల్టు షాపులు పెట్టించలేదా? ఇదీ చంద్రబాబు విశ్వసనీయత. ఆ వేళ రైతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటుంటే.. ఉచిత కరెంటు ఇవ్వాలని ప్రతిపక్షాలు అడిగితే.. ఉచిత కరెంటు ఇస్తే ఈ తీగలు మీద బట్టలు ఆరేసుకోవాల్సి వస్తుందని చంద్రబాబు వెటకారం చేశారు. ఇప్పుడు ఇదే చంద్రబాబు అన్నీ ఉచితంగా ఇస్తామని చాలా సునాయాసంగా చెప్తున్నారు.
 
 అదీ సువర్ణయుగం అంటే..
 
 ఇదేచంద్రబాబు అవ్వాతాతల పెన్షన్ గురించి మాట్లాడుతారు. నాకు బాగా గుర్తింది ఆ వేళ.. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అవ్వాతాతలకు ముష్టి వేసినట్లు కేవలం రూ. 70 మాత్రమే పెన్షన్లు ఇచ్చేవారు. అది కూడా గ్రామంలో 20-30 మంది కంటే ఎక్కువ మందికి పెన్షన్లు ఉండే వి కాదు. ఊళ్లో ఎవరైనా ఒకరు చనిపోతేగాని మరొకరికి పెన్షన్ ఇవ్వని దుస్థితి. చంద్రబాబు హయాంలో పెన్షన్ల సంఖ్య కేవలం 16 ల క్షలు మాత్రమే. ఆ తరువాత ప్రియతమ నాయకుడు వైఎస్సార్ ముఖ్యమంత్రి స్థానంలోకి వచ్చారు. 16 లక్షలు ఉన్న పెన్షన్లను ఏకంగా 71 లక్షలకు తీసుకొని పోయారు. రూ. 70 ఇచ్చే పెన్షన్‌ను రూ. 200 పెంచి ఆ అవ్వాతాతల గుండెల్లో కొలువయ్యాడు. అదీ రామరాజ్యం అంటే..సువర్ణయుగమంటే.’’
 
 జగన్ వెంట యాత్రలో..
 
 జగన్ వెంట యాత్రలో పాల్గొన్న నేతల్లో జిల్లా పార్టీ కన్వీనర్ నారాయణస్వామి, మాజీమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యే భూమన, ఎమ్మెల్సీ దేశాయి తిప్పారెడ్డి, తాజా మాజీ ఎమ్మెల్యేలు అమరనాథ్‌రెడ్డి, ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, పార్టీ కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురాం, పార్టీ నాయకులు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, మిథున్‌రెడ్డి, షమీం అస్లాం, డి.ఉదయ్‌కుమార్  తదితరులు పాల్గొన్నారు.
 
 బాబు రూపాయి ఇస్తానన్నా ప్రజలు నమ్మరు..
 ‘‘ఇదే చంద్రబాబు మైకులు పట్టుకొని నిన్న మాట్లాడుతూ... కాపు కులస్తులకు రిజర్వేషన్లు ఇస్తానని వాగ్దానం చేశారు. 9 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నావు కదయ్యా... ఆ రోజు కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని నీకు తట్టిందా? లేదు. విశ్వసనీయత గురించి ఇంకొక మాట చెప్పాలి. చంద్రబాబు ప్రజలకు ఒక్క రూపాయి ఇస్తానంటే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. అదే జగన్‌మోహన్‌రెడ్డి ప్రజలకు రూ. 50 ఇస్తానని చెప్పినా కూడా ప్రజలంతా హర్షధ్వానాలతో నమ్మే పరిస్థితి ఉంది. కారణం చంద్రబాబు 9 ఏళ్లు పరిపాలన చేసినపుడు రూపాయి ఇస్తానని వాగ్దానం చేసినప్పుడు కనీసం 10 పైసలు కూడా ప్రజలకు మేలు చేసిన దాఖలాలు లేవు.’’
 
 జగన్‌కు జనం బ్రహ్మరథం


 సాక్షి ప్రతినిధి, తిరుపతి: ‘సమైక్య శంఖారావం’ యాత్ర చిత్తూరు జిల్లాలో మంగళవారం ఉత్సాహంగా సాగింది.  పుంగనూరు నియోజకవర్గం నుంచి మంగళవారం ప్రారంభమైన యాత్రకు మదనపల్లె వరకూ ప్రజలు బ్రహ్మరథం పట్టారు. సుగాలిమిట్టలో జగన్ వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. రాంపల్లె, ఈడుగపల్లె, 150 మైలు, వలసపల్లె, మొలకలదిన్నె, బసినికొండ, నిమ్మనపల్లె క్రాస్ మీదుగా యాత్ర చేశారు. మధ్యలో వలసపల్లెలో వైఎస్‌ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. మదనపల్లెలోని చిత్తూరు బస్టాండ్ మీదుగా, బెంగళూరు బస్టాండ్ చేరుకుని అక్కడ జంక్షన్‌లో భారీ బహిరంగ సభలో ప్రసంగించారు.


 ముగిసిన రెండో విడత: చిత్తూరు జిల్లాలో రెండో విడత సమైక్య శంఖారావం, ఓదార్పు యాత్ర మంగళవారంతో ముగిసింది. మదనపల్లె బహిరంగ సభలో ప్రసంగించిన జగన్ రోడ్డు మార్గంలో నేరుగా బెంగళూరు విమానాశ్రయానికి వె ళ్లిపోయారు. అక్కడి నుంచి విమానంలో హైదరాబాద్ చేరుకున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు యాత్ర ఏడు రోజులు కొనసాగింది. మొదటి విడతలో రెండు కుటుంబాలను, రెండవ విడతలో ఐదు కుటుంబాలను మొత్తం ఏడు కుటుంబాలను జగన్  ఓదార్చినట్లు వైఎస్సార్ సీపీ నేత తలశిల రఘురాం తెలిపారు. రెండో విడత యాత్ర నాలుగు రోజులు కొనసాగింది. ఈ నెల 28న అనంతపురం జిల్లా కొత్తచెర్వు వద్ద జరిగిన నాందేడ్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాద బాధితులను పరామర్శించారు. 4 నుంచి తిరిగి యాత్ర ప్రారంభమవుతుంది.
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement