
రేపటి నుంచి జైల్లో జగన్ నిరాహార దీక్ష
హైదరాబాద్ : వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి రేపటి నుంచి జైల్లోనే నిరవధిక నిరాహార దీక్ష చేపడతారని ఆ పార్టీ కేంద్ర పాలకమండలి సభ్యుడు కొణతాల రామకృష్ణ తెలిపారు. విభజన వల్ల తలెత్తే సమస్యలకు పరిష్కారం చూపకుండా కాంగ్రెస్ పార్టీ ఏకపక్షంగా, నిరంకుశంగా నిర్ణయం తీసుకుందని ఆయన అన్నారు.
చంచల్గూడ జైల్లో శనివారం జగన్ను కలిసిన అనంతరం కొణతాల పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై జగన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారన్నారు. ఈ పరిణామాలను కాంగ్రెస్, టీడీపీలు ఎందుకు ఆలోచించలేకపోతున్నాయని బాధపడ్డారని, అలాగే విజయమ్మ దీక్షను భగ్నం చేసిన తీరుపట్ల జగన్ ఆవేదన చెందారని కొణతాల తెలిపారు.
జగన్‌ను అణగదొక్కాలన్న కుట్రతోనే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజనకు సిద్ధమయ్యిందన్నారు. ప్రజలకు భరోసా ఇచ్చేందుకు, వారికి అండగా ఉండి ధైర్యం నింపేందుకు షర్మిల త్వరలో బస్సుయాత్ర చేపడతారని కొణతాల చెప్పారు. ఓట్లు, సీట్లకోసం కాంగ్రెస్, టీడీపీ మౌనం వహించడం బాధ కలిగించిందని జగన్ అన్నారని, ఈ సమయంలో స్పందించకుంటే రాష్ట్రం ఎడారి అవుతుందని ఆయన తెలిపారని కొణతాల పేర్కొన్నారు. చంద్రబాబు స్పందించకపోవటం దారుణమని, బాబు, టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామా చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదన్నారు.