
నేడు రాష్ట్రపతితో జగన్ భేటీ
వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పలువురు పార్టీ ఎంపీలతో కలసి మంగళవారం ఉదయం ఢిల్లీకి వెళుతున్నారు. రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీని, కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను కలసి సంచలనం సృష్టిస్తున్న ఓటుకు నోటు వ్యవహారంపై ఫిర్యాదు చేస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి.
- ‘ఓటుకు నోటు’..చంద్రబాబు అవినీతిపై ప్రణబ్‌కు, కేంద్ర హోంమంత్రికి ఫిర్యాదు చేయనున్న ప్రతిపక్ష నేత
హైదరాబాద్: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పలువురు పార్టీ ఎంపీలతో కలసి మంగళవారం ఉదయం ఢిల్లీకి వెళుతున్నారు. రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీని, కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను కలసి సంచలనం సృష్టిస్తున్న ఓటుకు నోటు వ్యవహారంపై ఫిర్యాదు చేస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి.
జగన్ రెండురోజుల పాటు హస్తినలో ఉండే అవకాశం ఉంది. ఆయన సోమవారం తన నివాసంలో పార్టీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక్క ఓటు కోసం రూ.5 కోట్ల మేరకు ఎర చూపి అడ్డంగా దొరికిన రేవంత్‌రెడ్డి కేసు వ్యవహారంలో స్వయంగా చంద్రబాబునాయుడు పాత్ర ఉన్నట్టు ఆడియో టేపులు వెల్లడైన నేపథ్యంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు. ముఖ్యమంత్రిగా నిత్యం నీతి వచనాలు వల్లిస్తూ మరోవైపు సభ్య సమాజం తలదించుకునేలా అనైతిక చర్యలకు పాల్పడటం ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజల మనోభావాలను బాబు దెబ్బతీశారన్న అభిప్రాయం వ్యక్తమైంది.
ఈ పరిణామాలను మంగళవారం రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీని కలసి వివరించాలని నిర్ణయించారు. ఇలావుండగా ఏపీలో స్థానిక సంస్థల కోటాకు సంబంధించి శాసనమండలికి జరిగే ఎన్నికల నోటిఫికేషన్ మంగళవారం జారీ కానున్న నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహంపై కూడా జగన్ నేతలతో చర్చించారు. ఈ సమావేశంలో పార్టీ నేతలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వి.విజయసాయిరెడ్డి, ఎంవీ మైసూరారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కె.పి.సారథి, సజ్జల రామకృష్ణారెడ్డి, బొత్స సత్యనారాయణ, గడికోట శ్రీకాంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.