పనుల్లేక అల్లాడిపోతున్నాం నాయనా..
కదిరి: ‘నాయనా.. ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి వానలు లేవు. తాగడానికి నీళ్లు లేక అల్లాడిపోతున్నాం.. అందరం కూలి పని చేసుకునేటోళ్లం.. ఉపాధి పనులు చేసుకోమ్మని చెబితే వచ్చాం. అక్కడేమో అధికారులు (ఫారెస్టోళ్లు రిజర్వ్ ఫారెస్ట్‌లో) పనులు చేయడానికి వీళ్లేదని చెబుతున్నారు. మీరు ఈ దావన వస్తున్నారంటే.. మా బాధలు మీకన్నా జెప్పుకుందామని ఉన్నాం’ అని కదిరి రూరల్ పరిధిలోని కే కుంట్లపల్లికి చెందిన ఉపాధి కూలీలు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి తమ బాధలు తెలిపారు. వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి గురువారం బెంగళూరు నుంచి కదిరి మీదుగా పులివెందుల వెళ్లారు. ఈ సందర్భంగా ఉపాధి కూలీలు సోమేష్‌నగర్ వద్ద ఆయనను కలిసి తమ గోడును వెల్లబోసుకున్నారు. తమకు న్యాయం చేయాలని మొర పెట్టుకున్నారు. ఇందుకు ఆయన తన పక్కనే ఉన్న కదిరి ఎమ్మెల్యే అత్తార్ చాంద్‌బాషాతో మాట్లాడుతూ వెంటనే వారి సమస్య పరిష్కారమయ్యేలా అధికారులతో మాట్లాడాలని సూచించారు.
మన ప్రభుత్వమొస్తే మంచి రోజులొస్తాయి..
కదిరి పట్టణంలోని డిగ్రీ కళాశాల వద్ద అంగన్‌వాడీ కార్యకర్తలు జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి తమ సమస్యలు విన్నవించుకున్నారు. తమ చేత గొడ్డుచాకిరీ చేయిస్తూ తక్కువ వేతనం ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ఆయన స్పందిస్తూ అసెంబ్లీ సమావేశాల్లో మీ సమస్యలపై చంద్రబాబు సర్కారును నిలదీస్తామన్నారు. మన ప్రభుత్వం అధికారం లోకి రాగానే మీకు మంచి రోజులు వస్తాయని అని భరోసా ఇచ్చారు. అంగన్‌వాడీ కార్యకర్తలు మాబున్నీసా, సాయిలక్ష్మి, సుజాత, ఉష, సంధ్య, మాధవి, సీఐటీయూ డివిజన్ కార్యదర్శి నరసింహులు, వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లు, ఆ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
వైఎస్ జగన్‌కు ఘన స్వాగతం
హిందూపురం(చిలమత్తూరు) : వైఎస్సార్ సీపీ అధినేత వై.ఎస్.జగన్ మోహన్‌రెడ్డికి గురువారం చిలమత్తూరు మండల సరిహద్దులోని టోల్‌గేట్ వద్ద ఆ పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. వైఎస్సార్ జిల్లా పర్యటనలో భాగంగా ఆయన బెంగళూరు నుంచి పులివెందులకు వెళ్తుండగా మార్గమధ్యలో పార్టీ శ్రేణులు ఆయనను కలిసి సమస్యలపై వినుతులను అందజేశారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ శంకర్‌నారాయణ, కదిరి ఎమ్మెల్యే చాంద్‌భాషా, హిందూపురం నియోజకవర్గ సమన్వయకర్త నవీన్ నిశ్చల్, చిలమత్తూరు మండల పార్టీ కన్వీనర్ సదాశివారెడ్డి, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు జగన్‌మోహన్‌రెడ్డి, రామచంద్రప్ప, కోడూరు సింగిల్ విండో అధ్యక్షులు నరసింహారెడ్డి, ఎంపీటీసీలు చెన్నక్రిష్ణ, లక్ష్మీరెడ్డి, నాగభూషణాచారి, సూర్యనారాయణ, సర్పంచ్ శ్రీకళ, విద్యార్థి సంఘం నాయకులు రామక్రిష్ణారెడ్డి, రైతు సంఘం నాయకులు రంగారెడ్డి, ప్రచార కార్యదర్శి భోగిరెడ్డి, శివశంకర్‌రెడ్డి, మైనార్టీ సెల్ నాయకులు ఫరూక్, కొడికొండ రామచంద్రారెడ్డి, గోవిందరెడ్డి, అంజినరెడ్డి,గోరంట్ల సింగిల్ విండో అధ్యక్షులు వెంకట రమణారెడ్డి, మాజీ జెడ్పీటీసీ వెంకటరెడ్డి, తదితరులు వున్నారు.