నెల్లూరు(పొగతోట), న్యూస్‌లైన్: ప్రజలను మభ్యపెట్టే ఉద్దేశంతో వివిధ పేర్లతో పథకాలను ఆర్భాటంగా ప్రకటిస్తున్న పాలకులు వాటి అమలు విషయాన్ని గాలికొదిలేస్తున్నారు. ఇదే అదునుగా వచ్చే అరకొర నిధులను క్షేత్రస్థాయిలో కొందరు స్వాహా చేస్తున్నారు. లబ్ధిదారుల జాబితాలో బినామీ పేర్లను నమోదుచేసి అందినకాడికి దోచుకుంటున్నారు. ఇందిరమ్మ అమృతహస్తం పథకం అమలు అస్తవ్యస్తంగా మారడమే ఇందుకు నిదర్శనం.
గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అమలులోకి తెచ్చింది. వారికి అమృతం లాంటి ఆహారం అందించడం ఈ పథకం ప్రధాన ఉద్దేశం. అయితే క్షేత్రస్థాయిలో గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందడం రికార్డులకే పరిమితమవుతుండటంతో పథకం అమలు పక్కదారి పడుతోంది. సరుకుల సరఫరా కూడా అంతంత మాత్రంగానే ఉంది.
పౌష్టికాహారం అందించే అంగన్‌వాడీ కేంద్రాల్లో పనిచేసే సిబ్బందికి రెండు నెలలుగా వేతనాలు పంపిణీ కూడా నిలిచిపోయింది. ఈ ఏడాది జనవరి నుంచి ఇందిరమ్మ అమృతహస్తం పథకం అమలులోకి వచ్చింది. మాతాశిశు మరణాలను తగ్గించేందుకు వారి ఆరోగ్యం, పోషణ పద్ధతులను పోషకాహారంతో మెరుగు పరచడం ఈ పథకం లక్ష్యం. ఉదయగిరి, సీతారామపురం, వరికుంటపాడు, మర్రిపాడు, ఆత్మకూరు, ఏఎస్‌పేట, అనంతసాగరం, వెంకటాచలం, ముత్తుకూరు, మనుబోలు, రాపూరు, సైదాపురం, గూడూరు రూరల్, చిల్లకూరు మండలాల్లోని 1002 అంగన్‌వాడీ కేంద్రాల్లో అమృత హస్తం పథకం అమలవుతుంది. వీటిలో 957 కేంద్రాలు ఐసీడీఎస్, 45 ఐకేపీ పర్యవేక్షణలో నడుస్తున్నాయి.
సుమారు 14 వేల మంది గర్భిణులు, బాలింతలు లబ్ధిదారులు పథకంలో లబ్ధిదారులుగా నమోదయ్యారు. వీరికి నిత్యం 125 గ్రాముల బియ్యం, 30 గ్రాముల కందిపప్పు, 16 గ్రాముల నూనె, 50 గ్రాముల కూరగాయలు, 200 మిల్లీలీటర్ల పాలుతో పాటు ఓ కోడిగుడ్డు పంపిణీ చేయాలి. ఈ క్రమంలో అక్రమాలు చోటుచేసుకుంటున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. పౌష్టికాహార సామగ్రి పొందుతున్న వారి పేర్లు రోజూ రికార్డుల్లో నమోదం చేయడం లేదు. వారు పూర్తి స్థాయిలో హాజరైనట్లు కేంద్రాల నిర్వాహకులు రికార్డుల్లో పేర్కొంటున్నట్లు తెలిసింది. ఐకేపీ ఆధ్వర్యంలో నడిచే చిల్లకూరు మండలంలోని ఏరూరు, మోమిడి, వరగలి, తమ్మినపట్నం, లింగవరం తదితర ప్రాంతాల్లోని ఫీడింగ్ సెంటర్లలో ఆహార సరుకుల పంపిణీ నిలిచిపోయింది. ఫలితంగా ఆయా ప్రాంతాల్లో అనారోగ్యానికి గురవుతున్న గర్భిణులు, బాలింతల సంఖ్య ఎక్కువవుతోంది. ఉదయగిరి, మర్రిపాడు, వరికుంటపాడు, సీతారామపురం, ఆత్మకూరు, అనంతసాగరం, ఏఎస్‌పేట మండలాల్లోని పలు కేంద్రాల్లో కందిపప్పు, నూనె పంపిణీ సక్రమంగా లేదు. కోడిగుడ్డు పంపిణీ రికార్డులకే పరిమితమవుతోంది. ఈ గుడ్ల పంపిణీని పర్యవేక్షిస్తున్న ఐసీడీఎస్ సీడీపీఓల్లో కొందరు వాటిని సరఫరా చేయకుండానే చేసినట్లు కేంద్రాల నిర్వాహకుల నుంచి సంతకాలు సేకరిస్తున్నారని తెలిసింది.
ఈ విధంగా స్వాహా చేసిన నగదును కింది స్థాయి నుంచి ఉన్నతాధికారుల వరకు వాటాలు పంచుకుంటున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. పోషకాహార పంపిణీ కేంద్రాల నిర్వాహకులకు రెండు నెలలుగా జీతాలు పంపిణీ కావడం లేదు. జిల్లా అధికారులు స్పందించి అమృతం హస్తం పథకాన్ని సక్రమంగా అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని లబ్ధిదారులు కోరుతున్నారు.
అమృత హస్తవ్యస్తం
Published Mon, Oct 14 2013 2:15 AM | Last Updated on Fri, Nov 9 2018 5:52 PM
Advertisement
Advertisement