సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం జిల్లా కలెక్టర్లు, ముస్లిం మతపెద్దలతో వీడియో కాన్ఫరెస్స్ నిర్వహించారు. ఇళ్లలోనే రంజాన్ ప్రార్థనలు చేసుకోవాలని ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ ముస్లింలకు విజ్ఞప్తి చేశారు. ప్రపంచంలో, దేశంలో ఏం జరుగుతుందో అందరికీ తెలిసిందేనని అన్నారు. కరోనా వైరస్‌ను అధిగమించేందుకు గత కొన్ని రోజులుగా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్టు సీఎం వైఎస్ జగన్ చెప్పారు. కరోనా కారణంగా ఉగాది, శ్రీరామనవమి, గుడ్ ఫ్రైడే, ఈస్టర్ పండగలను ఇళ్లలోనే చేసుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయని గుర్తుచేశారు. ఇప్పుడు రంజాన్ సమయంలో కూడా ఇళ్లలో ఉండి ప్రార్థనలు చేసుకోవాల్సిన తప్పనిసరి పరిస్థితులు నెలకొన్నాయని అన్నారు. ప్రతి ఒక్కరు ప్రభుత్వానికి సహకరించి ఇళ్లలోనే రంజాన్ ప్రార్థనలు చేసుకోవాలని కోరారు. ఈ విషయాన్ని అందరికి తెలియజేయాలని చెప్పారు. ఇది మనసుకు కష్టమైన మాట అయినా చెప్పక తప్పని పరిస్థితి అని సీఎం వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు.
నకిలీ వార్తలు, తప్పుడు ప్రచారాలపై చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ముస్లిం మతపెద్దలు సీఎం వైఎస్ జగన్‌కు విజ్ఞప్తి చేశారు. ‘కర్నూలు జిల్లాలో కరోనా నివారణ చర్యలు బాగున్నాయి. అందరు కరోనా నివారణకు సహకరిస్తున్నారు. మీరు తీసుకుంటున్న చర్యలు బాగున్నాయి. కానీ కొన్ని చానళ్లు, పత్రికలు ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం చేస్తున్నాయి. నకిలీ వీడియోలు, నకిలీ వార్తలు ప్రచారం చేస్తూ ప్రజల్లో లేనిపోని అపోహలు, భయాందోళనలు కలిగిస్తున్నాయి. కర్నూలు ఎమ్మెల్యేపై కూడా లేని పోని ప్రచారాలు చేస్తున్నారు. వీటిపై మీరు కఠిన చర్యలు తీసుకోవాలి’ అని ముస్లిం మత పెద్దలు కోరారు. వారి విజ్ఞప్తిపై స్పందించిన సీఎం వైఎస్ జగన్.. అటువంటి ప్రచారం చేసేవారిపై నివేదిక పంపాలని కలెక్టర్లకు, ఎస్పీలకు సూచించారు. నకిలీ వార్తలు, తప్పుడు ప్రచారాలు చేసే వారిపై చర్యలు తీసుకోవాలని డీజీపీ గౌతం సవాంగ్‌ను ఆదేశించారు.
ఇళ్లలోనే రంజాన్ ప్రార్థనలు చేసుకోవాలి : సీఎం జగన్
Published Mon, Apr 20 2020 2:12 PM | Last Updated on Mon, Apr 20 2020 3:29 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment