అలుపెరగని బాటసారి, వైఎస్సార్ సీపీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విశాఖ జిల్లాలో జనహృదయాలను తాకింది. లక్షలాది జనం ఆయన వెంట అడుగులో అడుగులేయడమే కాదు.. ఆయన చేతి స్పర్శ కోసం తహతహలాడారు. ఆయన పలుకు వినాలని ఉత్సుకత చూపారు. ఆయనతో మాట్లాడాలని ఉత్సాహంతో ఉరకలెత్తారు. చెంతకు రాగానే వారి ఆనందానికి అవధుల్లేవు. పసిపాపల నుంచి పండు ముసలి వరకు రాజన్న బిడ్డను చూసి పులకించిపోయారు. కుండపోత వాన, నిప్పులు చెరిగే ఎండలను సైతం లెక్కచేయకుండా జననేత పాదయాత్రను చూసి జనం చలించి పోయారు. గన్నవరం మెట్ట మొదలు కొత్తవలస వరకు దారిపొడవునా వరుణుడు వెంటపడుతూనే వచ్చాడు. మబ్బులతో మేఘచత్రం పడుతూనే తడిసిముద్ద చేశాడు. అయినా చలించని మొక్కవోని సంకల్పంతో ముందుకు సాగిన జననేత కోసం దారిపొడవునా వేలాది మంది బారులు తీరారు.
సాక్షి, విశాఖపట్నం: ప్రజా సంకల్పయాత్ర విశాఖ జిల్లా గన్నవరం మెట్ట వద్ద అడుగుపెట్టింది మొదలు విజయనగరం జిల్లా ఎస్.కోట నియోజకవర్గంలో ప్రవేశించే వరకు ఎన్నో అపూరమైన ఘట్టాలు చోటు చేసుకున్నాయి. ఆగష్టు 14న జిల్లాలో అడుగుపెట్టిన జననేత సెప్టెంబర్ 24న కొత్తవలస వద్ద విజయనగరం జిల్లాలోకి ప్రవేశించారు. జిల్లాలో ఉండగానే పలు పండగలు, వేడుకల్లో పాల్గొని ప్రజలకు మరిచిపోలేని అనుభూతిని కలిగించారు. జిల్లాలో అడుగు పెట్టిన మరుసటి రోజునే స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జోరు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఆ తర్వాత దార్లపూడి వద్ద ముస్లిలతో కలిసి బక్రిద్ పండుగ చేసుకున్నారు. రాఖీపౌర్ణమి, వరలక్ష్మి వ్రతం రోజుల్లో సాగిన పాదయాత్రలో దారి పొడవునా వేలాది మంది మహిళలు జననేతకు రాఖీలు కట్టేందుకు పోటీపడ్డారు. ‘జగనన్నకు రాఖీ కట్టడం మా అదృష్టం. ఈ అవకాశం మాకు దక్కుతుందని ఎన్నడూ అనుకోలేదు. మా ఈ కోరిక నెరవేరింది. మేమంతా అన్నతో సెల్ఫీ కూడా తీసుకున్నాం’ అంటూ నర్సీపట్నంలోని వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హాస్పటల్ నర్సింగ్ సిబ్బంది ఆనందంతో పరవశించిపోయారు.
గొట్టివాడలో అపూరూప ఘట్టం
పాదయాత్ర సమయంలో ఓ అరుదైన అపూరూపమైన ఘట్టం కోటవురట్ల మండలం గొట్టివాడలో చోటు చేసుకుంది. ఆ రోజు ఆ ఊళ్లో గ్రామదేవత పరదేశమ్మ అమ్మవారి పండుగ. కొండల మధ్య కొలువైన శక్తి వంతమైన అమ్మవారు. శ్రావణమాసంలో తొలి మంగళవారం ఈ అమ్మవారికి పండుగ చేస్తారు. పాత గొట్టివాడ, కొత్తగొట్టివాడ, ములగల్లోవ, గుడెప లోవ, రామచంద్రాపురం గ్రామానికి చెందిన ప్రజలు మొక్కులు తీర్చుకుని అమ్మవార్ని దర్శించుకునేందుకు పోటెత్తారు. అయితే ఆ భక్తజనం అటువైపుగా వెళ్తున్న జనవేల్పును చూసేందుకు బారులు తీరారు. జననేత ఆత్మీయ స్పర్శ కోసం గంటల తరబడి వేచి ఉన్నారు. మండుటెండను సైతం లెక్కచేయకుండా నడిరోడ్డుపైనే గంటల తరబడి నిల్చొండిపోయారు. గుండెల్లో దైవంగా కొలుచుకుంటున్న రాజన్న బిడ్డను చూసి పరవశించిపోయారు. తనను చూసేందుకు బాలురు తీరిన వేలాది భక్తులను ఏమాత్రం నిరుత్సాహపర్చకుండా ప్రతి ఒక్కర్నీ పలకరించారు. తమ మనసులోని కోర్కెలను మహానేత తనయుడికి చెప్పుకుని సాంత్వన పొందారు. ఆత్మీయ నేతతో మాట్లాడి..కరచాలనం చేసి తమ గుండె లోతుల్లోని బాధను చెప్పుకున్నారు.
ఆ రైతే ఉచిత విద్యుత్‌కు ప్రేరణ
మహానేత వైఎస్సార్ బస్సుయాత్రలో భాగంగా ఆ గ్రామానికి వచ్చినప్పుడు తన కష్టాలు చెప్పుకునేందుకు ఆడారి పోలయ్య అనే రైతు కలిసాడు. బెల్లం రైతులే కాదు.. రైతుల బతుకలే బాగులోదు సారూ అనగానే నీకేం కావాలో చెప్పు.. ఏం చేస్తే మీ బతుకులు బాగుంటాయో చెప్పు అని ఆ మహానేత అడిగారు. ‘అయ్యా మాకు విడతల వారీగా కాకుండా పగటి పూటే కరెంట్ ఇప్పించండి. సాగునీటి వసతి కల్పించండి.. ఉచితంగా కరెంట్ ఇస్తే రైతు ఉన్నంత కాలం ఎప్పుడు మిమ్మల్ని మర్చిపోడు. అంతేకాదు వ్యవసాయానికి ఉచితంగా కరెంట్ ఇస్తే బోర్లు వేసుకుని సాగునీరు లేని ఇతర రైతులకు కూడా ఉచితంగా సాగునీరిస్తాం.. తద్వారా సాగు విస్తీర్ణం పెరుగుతుంది రైతులు బాగుపడతారు’ అని చెప్పగానే మహానేత ముగ్దుడయ్యారు. తప్పకుండా పోలయ్య మంచి మాట చెప్పావు. మనం అధికారంలోకి రాగానే మీ అందరికి ఉచిత కరెంట్ ఇప్పిస్తా అని భరోసా ఇచ్చాడు. అన్నట్టుగానే 2004లో అధికారంలోకి రాగానే ఉచిత విద్యుత్ ఫైల్‌పై తొలిసంతకం చేశాడు. అప్పుడు మహానేతతో తన అనుభవాలను పాదయాత్రలో తమ ప్రాంతానికి వచ్చిన వైఎస్ జగన్‌ను కలిసి పంచుకున్నారు. వైఎస్ మాదిరిగానే మీరు కూడా రైతుకు మేలు చేసేలా పథకాలు అమలు చేయాలని కోరాడు. జగన్‌కు బెల్లం దిమ్మ, చెరుకు గెడలను బహూకరించి మురిసిపోయాడు.
అమ్మా.. అన్న పిలుపుతో పరవశం
మహానేత తమ కుటుంబానికి చేసిన మేలుకు గుర్తుగా నాతవరం మండలం ములగపూడి గ్రామానికి చెందిన కొన్నపులోవ తన కుమార్తెకు విజయమ్మ అని పేరు పెట్టుకున్నారు. తమ గ్రామానికి వచ్చిన ఆయన తనయుడు జగనన్ను కలిసి తన బిడ్డను ఆశీర్వదించమన్నారు. ఆ బిడ్డకు మీ అమ్మగారి పేరే పెట్టామని చెప్పగానే జననేత కూడా ఒకింత ఉద్వేగానికి లోనయ్యారు. అమ్మా..అమ్మా అంటూ ఆ చిన్నారిని పిలిచి ఆప్యాయంగా గుండెకు హత్తుకున్నారు. నాతవరం మండలం పీకే గూడెంకు చెందిన పైలా రమణ బాబు, పద్మ దంపతులు కృష్ణాపురం వద్ద జగన్‌ను కలిసి తమ కవలలకు పేర్లు పెట్టమ ని కోరగానే, జననేత వారికి హర్షవర్థని, వర్షవర్థని అని నామకరణం చేశారు. దీంతో ఆ తల్లిదండ్రుల ఆనందానికి అవధుల్లేవు.. ఇలా చెప్పుకుంటూ పోతే విశాఖ జిల్లా పర్యటనలో కనీసం పది మందికి పైగా చిన్నారులకు నామకరణాలు, 50 మంది చిన్నారులకు అక్షరాభ్యాసాలు చేయించారు. ఎంతో మంది వృద్ధులు, చిన్నారులు జననేతతో సెల్ఫీలు తీసుకుని ఆ మధుర జ్ఞాపకాన్ని తమ గుండెల్లో దాచుకున్నారు.
తాపీమేస్త్రి పాటకు విశేష ఆదరణ
తగరపువలస: ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రపై చిట్టివలసకు చెందిన తాపీమేస్త్రి ముని రమేష్ రచించిన ‘అన్న వస్తున్నాడు...నవ రత్నాలు తెస్తున్నాడు’పాటకు విశేష ఆదరణ లభించింది. మూడో తరగతి వరకు మాత్రమే చదువుకున్న రమేష్ రెండు నెలల పాటు శ్రమించి తన ఆలోచనలకు పాట రూపం కల్పించాడు. ప్రతిరోజూ దినపత్రికలను చదువుతూ వైఎస్ జగన్‌పై జరుగుతున్న కుట్రలను, ప్రజలు అతనిపై పెట్టుకున్న ఆశలను ఈ పాటలో పొందుపరిచాడు. పాట రాయడానికి చదువు అక్కరలేదని స్పందించే హృదయం ఉంటే చాలని రమేష్‌ను అందరూ మెచ్చుకుంటున్నారు.
జగనన్నతో సెల్ఫీ.. మరిచిపోలేను
జగనన్నను చూడాలని ఎన్నాళ్ల నుంచో ఎదురు చూస్తున్నాను. మాగ్రామానికి వస్తున్నారని తెలిసి చూడటం కోసం కాలేజీ మానేశాను. జగనన్నతో సెల్ఫీ దిగడం ఎప్పటికీ మరిచిపోలేనని ఎస్.రాయవరం మండలం దార్లపూడికి చెందిన పద్మిని తెలిపింది. బాగా చదువుకోవాలని ఎంత ఖర్చయినా తానే భరిస్తానని జగనన్న ఇచ్చిన హామీ నాకెంతో భరోసానిచ్చిందని చెప్పింది. – పద్మిని, దార్లపూడి
2019లో నువ్వే సీఎంవని దీవించా..
నాయనా నిండు నూరేళ్లు చల్లగా ఉండు. నీ కష్టం వృథాగా పోదని, 2019లో నువ్వే సీఎం అవుతావని దీవించానని ఎస్.రాయవరం మండలం దార్లపూడికి చెందిన వెంకటనర్సయ్యమ్మ తెలిపారు. 98 ఏళ్ల వయసులో కూడా ఈమె పాదయాత్రలో దార్లపూడి వద్ద జగన్‌ను కలిశారు. నష్టాల్లో ఉన్న ఏటికొప్పాక చక్కెర కర్మాగారాన్ని ఆదుకోవాలని, కార్మికులకు జీతాలు సక్రమంగా ఇవ్వాలని కోరినట్టు ఆమె తెలిపారు. ఏటికొప్పాక సుగర్ ఫ్యాక్టరీ గేటు వద్ద కుర్చీలో కూర్చొని జగన్ రాకకోసం ఎదురు చూసిన ఈమెను జననేత పలకరించి అధికారంలోకి వస్తే తప్పకండా నష్టాల్లో ఉన్న చక్కెర ఫ్యాక్టరీలను, కార్మికులను ఆదుకుంటానని భరోసా ఇచ్చారు. – వెంకటనర్సయ్యమ్మ,
Comments
Please login to add a commentAdd a comment