
సాక్షి, తిరుపతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్‌కు కాబోయే ముఖ్యమంత్రి వైస్ జగన్‌మోహన్‌రెడ్డి తిరుమల వెళ్లనున్నారు. ఈనెల 28వ తేదీ (మంగళవారం) సాయంత్రం 5 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని ప్రత్యేక విమానంలో ఆయన తిరుమలకు బయలుదేరి వెళతారు. సాయంత్రం ఏడు గంటలకు తిరుమలకు చేరుకుంటారు. రాత్రికి తిరుమలలో బసచేసి 29వ తేదీ ఉదయం స్వామివారిని దర్శించుకుంటారు. అనంతరం వైఎస్సార్ జిల్లాలోని ఇడుపులపాయకు చేరుకుని దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి సమాధికి నివాళులర్పించి ఆశీస్సులు తీసుకుంటారు. అనంతరం కడప పెద్ద దర్గాను దర్శించి ఆశీస్సులు పొందుతారు. ఆ తర్వాత తాడేపల్లిలోని నివాసానికి చేరుకుంటారు. 30వ తేదీ మధ్యాహ్నం విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం చేస్తారు.
సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి :
రేపు తిరుమల వెళ్లనున్న వైఎస్ జగన్
టీటీడీ పాలకమండలిని రద్దు చేయాలి
కాగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న వైఎస్ జగన్ శ్రీవారిని దర్శించుకోనున్నట్లు జీడీ నెల్లూరు ఎమ్మెల్యే నారాయణ స్వామి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీడీపీ ప్రభుత్వం రద్దు అయిన వెంటనే నామినేటెడ్ పోస్ట్‌ల్లో ఉన్నవారు వెంటనే తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అలాగే టీడీపీ పాలకమండలిని కూడా వెంటనే రద్దు చేయాలని, వారు తమ పదవులుకు రాజీనామా చేయాలన్నారు. అలాగే రేపు ఉదయం జరిగే పాలకమండలి సమావేశాన్ని కూడా రద్దు చేయాలని నారాయణస్వామి అన్నారు.
రాజీనామా చేసిన రాఘవేంద్రరావు
శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ చైర్మన్ పదవికి దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు రాజీనామా చేశారు. వయోభారం వల్ల చైర్మన్ పదవికి రాజీనామా చేసినట్టు ఆయన తెలిపారు. టీటీడీ యాజమాన్యానికి, సిబ్బందికి ఆ తిరుమలేశుడి ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. తనకు ఇన్నాళ్లు సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.