దేవుడి ఆశీస్సులతో.. | YS Jagan Visits Tirumala Temple | Sakshi
Sakshi News home page

దేవుడి ఆశీస్సులతో..

Published Thu, May 30 2019 2:33 AM | Last Updated on Thu, May 30 2019 2:33 AM

YS Jagan Visits Tirumala Temple - Sakshi

సాక్షి, తిరుపతి/తిరుమల/కడప/గన్నవరం/ విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌ నిశ్చయ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం రోజంతా దైవార్చన, ప్రార్థనల్లో పాల్గొన్నారు. తొలుత తిరుమల శ్రీవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. అనంతరం కడప పెద్ద దర్గా, పులివెందుల సీఎస్‌ఐ చర్చి లో ప్రార్థనలు జరిపారు. తరువాత ఇడుపులపాయ చేరుకుని దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డికి నివాళి అర్పించారు. అక్కడి నుంచి విజయవాడ చేరుకుని కనకదుర్గమ్మను దర్శించుకుని పూజలు జరిపారు. 

సామాన్య భక్తుడిలా తిరుమలకు.. 
సంప్రదాయ దుస్తులు, నుదుటిన తిరునామం ధరించి సామా న్య భక్తుడిలా తిరుమల శ్రీవారిని వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దర్శించుకున్నారు. వైకుంఠం–1 నుంచి మహాద్వారం వద్దకు చేరుకున్నారు. అక్కడ టీటీడీ అధికారులు, ఆలయ అర్చకులు ఘనస్వాగతం పలికారు. శ్రీవారి ఆలయంలోని ధ్వజస్తంభానికి నమస్కరించి.. వెండివాకిలి దాటుకుని బంగారు వాకిలి మీదు గా గర్భాలయంలోకి ప్రవేశించారు. తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని పూజలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు అన్నివిధాలా మేలు చేయాలని.. ప్రజారంజక, సుపరిపాలన అందిం చేలా తనను ఆశీర్వదించాలని శ్రీ వెంకటేశ్వరస్వామిని కోరుకున్నారు. అనంతరం వకుళామాతను, ఆలయ ప్రదక్షిణ చేసి విమాన వెంకటేశ్వరస్వామిని, సబేరా, భాష్యకార్ల సన్నిధి, యో గ నరసింహస్వామిని దర్శించుకుని హుండీలో కానుకలు సమ ర్పించుకున్నారు. శ్రీవారి సేవలో గడిపిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి రంగనాయకుల మండపంలో వేదపండితులు ఆశీర్వచ నం అందించారు. శాలువాతో సత్కరించి.. శ్రీవారి చిత్రాన్ని అందించారు. ఆయన వెంట ఎంపీలు విజయసాయిరెడ్డి, వేమి రెడ్డి ప్రభాకరరెడ్డి, ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, భూమన కరుణాకర్‌రెడ్డి, ఆర్కే రోజా, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, నారాయణస్వామి, బియ్యపు మధు సూదన్‌రెడ్డి, జంగాలపల్లి శ్రీనివాసులు, వెంకటేశ్‌గౌడ్, నవాజ్‌ బాషా, ఎంఎస్‌ బాబు, ఆదిమూలం తదితర ఎమ్మెల్యేలు, పలువురు నాయకులు ఉన్నారు. ఏ కార్యక్రమమైనా చేపట్టేముందు భగవంతుని ఆశీర్వాదం తీసుకోవడం వైఎస్‌ జగన్‌కు ఆనవా యితీ. పాదయాత్రకు ముందు, ముగిసిన తర్వాత కూడా ఆయన శ్రీవారిని దర్శించుకున్నారు. గురువారం ఆంధ్రప్రదేశ్‌ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో ముందుగా శ్రీవారిని దర్శించుకు న్నారు. అనంతరం రోడ్డు మార్గాన రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి విమానంలో వైఎస్సార్‌ కడప పయనమయ్యారు.  

కడప పెద్ద దర్గాలో ప్రార్థన చేస్తున్న వైఎస్‌ జగన్‌ 

కడప పెద్ద దర్గాలో.. 
ఎన్నికల్లో అఖండ విజయం సాధించాక ఏపీ నిశ్చయ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ తొలిసారి సొంత జిల్లా వైఎస్సార్‌ కడపకు వచ్చారు. కడప ఎయిర్‌ పోర్టు నుంచి 11.55 గంటలకు పెద్ద దర్గాకు చేరుకున్నారు. దర్గా పీఠాధిపతి హజరత్‌ సయ్యద్‌షా ఆరీఫుల్లా హుసేనీ సాహెబ్‌ వైఎస్‌ జగన్‌ను సాదరంగా ఆహ్వానించి.. సంప్రదాయాన్ని పాటిస్తూ తలపాగా చు ట్టారు. అనంతరం ఆయన హజరత్‌ పీరుల్లామాలిక్‌ మజార్‌ను దర్శించుకుని చాదర్, పూల చాదర్‌ సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఆ తర్వాత దర్గా ఆవరణలోని ఇతర గురువులు, మజార్లను కూడా దర్శించి ఫాతెహా చేశారు. దర్గా పీఠాధిపతి వైఎస్‌ జగన్‌కి గురువుల విశిష్టతను తెలియజేసి, జ్ఞాపికతో సత్కరించారు. పీఠాధిపతితో సమావేశమై ఆశీస్సులు తీసుకున్నారు.  

పులివెందుల సీఎస్‌ఐ చర్చిలో జగన్‌ను దీవిస్తున్న పాస్టర్లు  

సీఎస్‌ఐ చర్చిలో.. 
పులివెందుల చేరుకున్న వైఎస్‌ జగన్‌ కుటుంబ సభ్యులతో కల సి సీఎస్‌ఐ చర్చిలో బిషప్‌ వరప్రసాద్‌బాబు, పాస్టర్‌ జెనహర్‌బాబు నేతృత్వంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.  

ఇడుపులపాయలో.. 
అక్కడి నుంచి ఇడుపులపాయ చేరుకుని తన తండ్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఘాట్‌లో ఘనంగా నివాళులు అర్పించారు. తండ్రి విగ్రహానికి పూలమాలలు సమర్పించారు. ఈ కార్యక్రమాల్లో రాజ్యసభ సభ్యుడు విజయసా«యిరెడ్డి, కడప, రాజంపేట ఎంపీలు వైఎస్‌ అవినాష్‌రెడ్డి, పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, ఎమ్మెల్యేలు ఎస్‌బీ అంజాద్‌బాషా, డాక్టర్‌ సుధీర్‌రెడ్డి, కొరముట్ల శ్రీనివాసులు, పి.రవీంద్రనాథ్‌రెడ్డి, డాక్టర్‌ వెంకటసుబ్బయ్య, శెట్టిపల్లె రఘురామిరెడ్డి, రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి, మేడా మల్లికార్జునరెడ్డి, పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు సురేశ్‌బాబు, ఆకేపాటి అమర్‌నాథరెడ్డి, ఎమ్మెల్సీ గోవింద్‌రెడ్డి, జిల్లా పరిషత్‌ చైర్మన్‌ గూడూరు రవి, వైఎస్‌ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. 

ఇడుపులపాయలో వైఎస్సార్‌ఘాట్‌ వద్ద నివాళులర్పిస్తున్న వైఎస్‌ జగన్, వైఎస్సార్‌సీపీ నేతలు అంజద్‌బాషా, అవినాశ్‌రెడ్డి, రాచమల్లు, రఘురామిరెడ్డి, ఆకేపాటి, విజయసాయిరెడ్డి, కొరుముట్ల తదితరులు ​​​​​​​

ఆప్యాయంగా పలకరిస్తూ.. 
శ్రీవారి దర్శనార్థం తిరుమలకు చేరుకున్న నిశ్చయ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి టీటీడీ అధికారులు, అర్చకులను పేరుపేరునా ‘బాగున్నారా’అంటూ ఆప్యాయంగా పలకరించారు. కడప, పులివెందుల, ఇడుపులపాయలోనూ తనను చూడటానికి వచ్చిన వారందరినీ పలకరించారు. ‘ఏమన్నా ఎలా ఉన్నావ్‌... చిన్నాన్నా బాగున్నావా.. మామయ్యా ఆరోగ్యం ఎలా ఉంది.. పెద్దనాన్నా బాగున్నావా.. ఆరోగ్యం జాగ్రత్త’అంటూ అందరి యోగక్షేమాలను ఆరా తీశారు. తమ అభిమాన నేతకు శుభాకాంక్షలు తెలిపేందుకు అభిమానులు, కార్యకర్తలు, అనుచరులు పోటెత్తగా.. మరోవైపు రక్త సంబంధీకులు, ఆత్మబంధువులు సైతం పెద్దఎత్తున తరలివచ్చారు. అందరి ఆశీర్వాదాలు అందుకుని విజయవాడకు బయలుదేరి వెళ్లారు. తిరుపతి, కడప జిల్లాల్లో రెండు రోజుల పర్యటనను పూర్తి చేసుకున్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం సాయంత్రం 4.35 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయనకు రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం, పలువురు అధికారులు స్వాగతం పలికారు. రన్‌వే నుంచి కాన్వాయ్‌లో బయటకు వచ్చిన ఆయన స్వాగతం పలికేందుకు వచ్చిన అభిమానులకు అభివాదం చేస్తూ రోడ్డు మార్గం ద్వారా విజయవాడ వెళ్లారు.

 బుధవారం విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గమ్మకు పట్టువస్త్రాలు తీసుకువస్తున్న నిశ్చయ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ​​​​​​​
​​​​​​​

దుర్గమ్మకు చీర, పసుపు–కుంకుమ సమర్పణ 
 విజయవాడలో ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న కనకదుర్గమ్మ వారిని నిశ్చయ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి బుధవారం సాయంత్రం దర్శించుకున్నారు. ఆలయ ఈ వో వి.కోటేశ్వరమ్మ, ప్రధాన అర్చకుడు ఎల్‌డీ ప్రసాద్, స్థానాచార్య వి.శివప్రసాద్‌ ఆలయ సంప్రదాయాలతో స్వాగతం పలికారు. అర్చకులు వైఎస్‌ జగన్‌ శిరస్సుకు పరివట్టం ధరింపచేశారు. మేళతాళాలు, వేద మంత్రోచ్ఛారణల నడుమ పూ ర్ణకుంభంతో ఆలయంలోకి తీసుకువెళ్లారు. అమ్మవారిని ద ర్శించుకున్న జగన్‌మోహన్‌రెడ్డి అమ్మవారికి పట్టుచీర, పసు పు, కుంకుమ, పండ్లు, పూలు సమర్పించారు. ఆయన గోత్రనామాలతో అమ్మవారికి ఖడ్గమాల స్తోత్ర పూజలు చేసిన అర్చకులు కోటా ప్రసాద్, కోటా రవి, రంగావఝల శ్రీనివాసశాస్త్రి హారతులు ఇచ్చారు. ఆలయం తరఫున అమ్మవారి చిత్రపటం, శేషవస్త్రాలతోపాటు పంచ ప్రసాదాలను దేవాదా య కమిషనర్‌ ఎం.పద్మ అందజేశారు. పుస్తక రూపంలో ముద్రించిన సుప్రభాత సేవ స్తోత్రాలను జగన్‌ ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఆయన వెంట రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, ఎంపీలు అవినాష్‌రెడ్డి, మిథున్‌రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీకాంత్‌రెడ్డి, మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాస్, జోగి రమేష్, పారిశ్రామికవేత్త పొట్లూరి వరప్రసాద్‌ ఉన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement