
జగన్నాథ యాత్రలా..
* జైలు నుంచి జనం మధ్యకు జగన్
* అభిమానుల పూల వర్షం నడుమ ఇంటికి
* సునామీని తలపిస్తూ పోటెత్తిన జనప్రవాహం
* చంచల్‌గూడ నుంచి లోటస్‌పాండ్ దాకా ప్రభంజనమే
* 20 కి.మీ. దూరానికి ఏకంగా ఐదున్నర గంటల పైనే
* అందరినీ పలకరిస్తూ, అభివాదం చేస్తూ సాగిన జగన్
* హారతి పట్టిన షర్మిల.. స్వాగతం పలికిన విజయమ్మ, భారతి
జనం.. జనం.. జనం.. పిల్లలు మొదలుకుని చంటిపిల్లల తల్లుల దాకా... యువతీయువకుల నుంచి వయోవృద్ధుల దాకా...
చంచల్‌గూడ నుంచి లోటస్‌పాండ్ దాకా ఎటు చూసినా సముద్రాన్ని తలపిస్తూ జనమే. 20 కిలోమీటర్ల దారి పొడవునా అడుగడుగునా జగన్నామ జపం చేస్తూ జన ప్రభంజనమే. 16 నెలల చెర వీడి తిరిగి తమ మధ్యకు వస్తున్న ప్రియతమ నేతను కళ్లారా చూసుకోవడానికి, హృదయపూర్వకంగా స్వాగతం పలకడానికి రాష్ట్రం నలుమూలల నుంచీ అశేష సంఖ్యలో అభిమానులు హైదరాబాద్‌కు పోటెత్తారు.
మంగళవారం ఉదయానికే చంచల్‌గూడ వద్ద పిల్ల కాలువలా మొదలైన జన సందోహం మధ్యాహ్నానికల్లా వెల్లువలా మారింది. ఇక జన నేత బయటికి వచ్చే సమయానికైతే జైలు వద్ద జన ప్రవాహం అచ్చంగా సునామీనే తలపించింది. అంతా ఆత్రుతతో, ఎంతో ఉత్కంఠతో, అంతులేని ప్రేమాభిమానాలతో ఎదురు చూసిన సమయం ఎట్టకేలకు రానే వచ్చింది. మధ్యాహ్నం 3.55కు జైలు నుంచి జగన్ బయటికి అడుగు పెట్టారు. అంతే. కట్టలు తెంచుకున్న అభిమానంతో జనమంతా ఒక్కసారిగా ఆయనకేసి దూసుకెళ్లారు. తమ నేతను కళ్లారా చూసుకునేందుకు, కరచాలనం చేసేందుకు అంతా ఒక్కసారిగా మున్ముందుకు తోసుకెళ్లారు. ‘జై జగన్’ అంటూ పెద్దపెట్టున వారు చేసిన నినాదాలతో చంచల్‌గూడ పరిసరాలన్నీ ప్రతిధ్వనించాయి. ముందు జాగ్రత్తగా పోలీసులు పకడ్బందీగా ఏర్పాటు చేసిన మూడంచెల ముళ్ల కంచెలు కూడా అభిమాన జన ప్రవాహంలో కొట్టుకుపోయాయి.
జాతీయ వార్తా చానళ్లన్నీ జగన్ విడుదలకు విశేష ప్రాధాన్యమిచ్చాయి. పలు చానళ్లు ప్రత్యేక బులెటిన్లు కూడా నడిపాయి. ఇక రాష్ట్ర చానళ్లయితే మధ్యాహ్నం నుంచీ రాత్రి దాకా ప్రత్యక్ష ప్రసారం చేశాయి. అంతర్జాతీయ మీడియా కూడా జగన్ విడుదల వార్తను ప్రముఖంగా ప్రసారం చేసింది. ఇక ఫేస్‌బుక్, ట్విట్టర్ వంటి సోషల్ సైట్లయితే మంగళవారం పూర్తిగా జగన్‌మయంగా మారాయి.
మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా ఉదయం నుంచీ టీవీలకే అతుక్కుపోయిన కోట్లాది మంది రాష్ట్ర ప్రజలు కూడా హర్షధ్వానాలు చేస్తూ, కేరింతలు కొడుతూ, పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకుంటూ, మిఠాయిలు పంచుకుంటూ, బాణసంచా కాల్చుకుంటూ సంతోషంలో మునిగిపోయారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా పండుగ వాతావరణం నెలకొంది. చెరగని చిరునవ్వుతో అభిమానులను పలకరిస్తూ, అడుగడుగునా కురిసిన పూల వర్షంలో తడుస్తూ జగన్ ఒక్కో అడుగూ ముందుకు సాగారు. వీలున్న చోటల్లా వాహనం దిగారు. అవ్వా అక్కలను పలకరించారు. పసిపిల్లలను ఎత్తుకుని ముద్దు చేశారు. అందరి అభినందనలను, అభివందనాలను ప్రేమాప్యాయతలతో స్వీకరించారు. జన నేతను తమ సెల్ ఫోన్లలో వీడియో తీసేందుకు దారి పొడవునా ప్రజానీకం పోటీలు పడ్డారు.
జగన్ యాత్ర అచ్చంగా జగన్నాథ రథయాత్రను తలపించింది. మధ్యాహ్నం 3.55కు చంచల్‌గూడ వద్ద మొదలై, 20 కిలోమీటర్ల దూరంలోని లోటస్‌పాండ్ నివాసానికి చేరుకునేందుకు ఏకంగా ఐదున్నర గంటలు పట్టింది. రాత్రి 9.30 తర్వాత ఇంటికి చేరుకున్న జగన్‌కు ఘన స్వాగతం లభించింది. సోదరి షర్మిల హారతి పట్టారు. మాతృమూర్తి విజయమ్మ, భార్య భారతి, పిల్లలు ఆనందబాష్పాలు రాల్చారు. బంధుమిత్రులు సాదరంగా ఆహ్వానం పలికారు.