
జగన్ మెల్లగా కొలుకుంటున్నారు: నిమ్స్ వైద్యులు
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆరోగ్యంపై నిమ్స్ వైద్యులు ఆదివారం మధ్యాహ్నం 12.00 గంటలకు హెల్త్ బులెటన్ విడుదల చేశారు. వైఎస్ జగన్ ఆరోగ్యం మెల్లగా కుదుటపడుతోందని వైద్యులు తెలిపారు. ఆయనకు ఇంకా ప్లూయిడ్స్ అందిస్తున్నట్లు వివరించారు. ఆయన కొలుకోవడానికి కొంత సమయం పడుతోందని చెప్పారు. మరో రెండు రోజుల వరకు ఆయనకు విశ్రాంతి అవసరమని వారు విడుదల చేసిన హెల్త్ బులెటన్లో వివరించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ పార్టీ వైఖరికి నిరసనగా గత ఏడు రోజుల పాటు ఎస్ జగన్ ఆమరణ దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. ఆరోగ్యం పూర్తిగా క్షీణించడంతో నిమ్స్ ఆసుపత్రి వైద్యులు శనివారం ఆయనకు బలవంతంగా ఫ్లూయిడ్స్(గ్లూకోజ్) ఎక్కించారు. దీంతో వారం రోజులుగా ఆయన చేస్తున్న నిరాహార దీక్షను భగ్నం చేసినట్లయింది. కాగా, ఆస్పత్రిలో ఉన్న జగన్ ఇంకా నీరసంగానే ఉన్నారని ఆయన సతీమణి వైఎస్ భారతి ఈ ఉదయం తెలిపారు.
మరోవైపు నిజామ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ (నిమ్స్) డైరెక్టర్‌గా నియమితులయిన డాక్టర్ లావు నరేంద్రనాథ్... ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో సమావేశమయ్యారు. తనను నిమ్స్ డైరెక్టర్ గా నియమించినందుకు సీఎంకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. వైఎస్ జగన్ ఆరోగ్య పరిస్థితిపై ముఖ్యమంత్రికి ఆయన వివరించారని సమాచారం.