కౌరవ సభను తలపిస్తున్నారు | ys jaganmohanreddy fire on tdp leaders | Sakshi
Sakshi News home page

కౌరవ సభను తలపిస్తున్నారు

Published Sun, Sep 7 2014 1:20 AM | Last Updated on Fri, May 25 2018 9:17 PM

కౌరవ సభను తలపిస్తున్నారు - Sakshi

కౌరవ సభను తలపిస్తున్నారు

మీ మనస్సాక్షిని ప్రశ్నించుకోండి.. ప్రభుత్వ తీరుపై జగన్‌మోహన్‌రెడ్డి ఆగ్రహం
 
విపక్ష నేతకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండానే అసెంబ్లీలో బీసీ తీర్మానానికి ఆమోదం
అవకాశం ఇవ్వాలని కోరిన విపక్ష నేత..   చర్చ ముగిసిందన్న స్పీకర్
బీసీల గురించి మాట్లాడతానంటే ఎందుకు భయం? సర్కారుకు జగన్ ప్రశ్న
గందరగోళంలోనే ద్రవ్య వినిమియ బిల్లుకు ఆమోదం.. సభ నిరవధిక వాయిదా

 
హైదరాబాద్: వెనుకబడిన తరగతుల సంక్షేమానికి చర్యలు చేపట్టాలని కేంద్రాన్ని కోరుతూ అసెంబ్లీలో చేసిన తీర్మానంపై ప్రతిపక్ష నేతగా తనకు మాట్లాడే అవకాశం ఇవ్వనందుకు వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర నిరసన, అభ్యంతరం వ్యక్తంచేశారు. విపక్ష నేతకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండానే తీర్మానానికి ఆమోదముద్ర పడిందని ప్రకటించడమేమిటని ప్ర శ్నించారు. అవకాశం ఇవ్వాలని అడిగితే హేళనగా మాట్లాడుతున్నారని అధికారపక్షం తీరుపై ఆయన విరుచుకుపడ్డారు. ‘‘మీరు మనుషులేనా? మానవత్వం ఉందా? లేదా ? అని మనస్సాక్షిని ప్రశ్నించుకోండి’’ అని మండిపడ్డారు. కౌరవసభను మరిపిస్తున్నారంటూ ధ్వజమెత్తారు.

శనివారం ఏపీ అసెంబ్లీలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన బీసీ తీర్మానంపై తనకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని విపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డి పలుమార్లు విజ్ఞప్తి చేసినా స్పీకర్ కోడెల శివప్రసాదరావు సానుకూలంగా స్పందించలేదు. చర్చ ముగించి తీర్మానికి ఆమోదం తెలిపి తర్వాత తిరిగి అదే అంశం మీద చర్చించడం సాధ్యం కాదని చెప్తూ విపక్ష నేతకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. ‘‘నేను విపక్ష నేత వైపు చూస్తూనే ఉన్నా. మాట్లాడటానికి అవకాశం ఇవ్వమన్నట్లుగా ఆయన చేయి ఎత్తలేదు. చేయి ఎత్తి ఉంటే తప్పకుండా అవకాశం ఇచ్చేవాడినే. బీసీ తీర్మానంపై మాట్లాడుతారంటూ ప్రతిపక్షం ఇచ్చిన జాబితాలోనూ జగన్ పేరు లేదు. ద్రవ్య వినిమయ బిల్లును ఆర్థికమంత్రి ప్రవేశపెట్టిన నేపథ్యంలో.. బిల్లుపై మాట్లాడే సమయంలో బీసీ ల గురించీ మాట్లాడండి’’ అని విపక్ష నేతకు సూచించా రు. దీనికి జగన్ సమ్మతించలేదు. తాను పలుమార్లు చే యి ఎత్తి మాట్లాడటానికి అవకాశం ఇవ్వాలని అడిగానని, కానీ తనను పట్టించుకోకుండా తీర్మానాన్ని పాస్ చేయిం చారని నిరసన వ్యక్తంచేశారు. తమ నేతకు మాట్లాడే అవకాశం ఇవ్వాల్సిందేనని విపక్ష సభ్యులు స్పీకర్ పోడియం వద్ద నిలబడి గట్టిగా నినాదాలు చేశారు. సభలో గందరగోళ పరిస్థితుల మధ్య ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోదముద్ర పడినట్టు ప్రకటించి సభను స్పీకర్ నిరవధికంగా వాయిదా వేయడం చకచకా జరిగిపోయాయి.

సభలో జరిగింది ఇదీ...

బీసీ తీర్మానాన్ని సీఎం చంద్రబాబు శనివారం సభలో ప్ర వేశపెట్టారు. 45నిమిషాలకు పైగా తీర్మానం మీద మాట్లాడారు. తర్వాత అధికార, విపక్ష సభ్యులు చర్చలో పాల్గొన్నారు. తనకు అవకాశం ఇవ్వాలని విపక్ష నేత చేయి ఎత్తు తూ సంకేతాలు ఇచ్చారు. విపక్ష నేతకు మాట్లాడటానికి అవకాశం ఇవ్వకుండానే తీర్మానాన్ని స్పీకర్ ఓటింగ్‌కు పెట్టారు. మూజువాణి ఓటుతో తీర్మానం ఆమోదం పొం దిందని ప్రకటించారు. వెంటనే ప్రతిపక్ష నేత జగన్ లేచి.. తనకు చర్చలో పాల్గొనే అవకాశం ఇవ్వలేదని, మాట్లాడటానికి అవకాశం ఇవ్వాలని స్పీకర్‌కు విజ్ఞప్తి చేశారు.

తర్వాత సభలో సంబాషణలు సాగిన తీరిదీ..

స్పీకర్ : మీ పార్టీ నేతలు లిస్ట్ ఇచ్చారు. ఆ మేరకు నేను సభ్యులకు అవకాశం ఇచ్చాను. అందులో మీ పేరు లేదు. మీరు చేయి ఎత్తుతారేమోనని చూశాను. ఎత్తలేదు. అందుకే అవకాశం ఇవ్వలేదు. చేయి ఎత్తి ఉంటే తప్పకుండా అవకాశం ఇచ్చేవాడిని. విపక్ష నేతకు సభలో రెండో ప్రాధాన్యత ఉంటుంది.

సీఎం: విపక్ష నేతకు బీసీలపై మాట్లాడానికి ఇష్టం లేనట్లుందని మంత్రి అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించిన తర్వాత కూడా జగన్ స్పందించలేదు. మాట్లాడాలనుకుంటే విప్ ద్వారా స్పీకర్‌కు పేరు పంపించవచ్చు కదా! యనమల: పాయింట్ ఆఫ్ ఆర్డర్. పూర్తయిన అంశం మీద చర్చ చేపట్టడానికి లేదు.

జగన్: ఇంత దారుణమైన, అన్యామైన రాజకీయాలు ఎక్కడా చూడలేదు. మీ మంత్రులతో మీరే వ్యాఖ్యలు చేయిస్తారు. మరోవైపు మాట్లాడటానికి అవకాశం ఇవ్వకుండానే తీర్మానాన్ని ముగిస్తారు. మీరు మనుషులేనా? మనుషులైతే మానవత్వం ఉండాలి. మానవత్వం లేకుండా మనుషులు కారు. రాక్షసులు అవుతారు. మనుషులకు, రాక్షసులకు తేడా మానవత్వమే. మానవత్వం ఉందా? లేదా? అని మనస్సాక్షిని ప్రశ్నించుకోండి. బీసీల సంక్షేమం గురించి గొప్పగా మాట్లాడారు. అవతల వాళ్లు ఏం చేశారో చెప్పడానికి అవకాశం ఇవ్వాలి. వినడం నేర్చుకోండి. అప్పుడే మానవత్వం బయటకు వస్తుంది. మనుషులో, రాక్షసులో నిర్ణయించుకోగలరు.

 స్పీకర్: ద్రవ్య వినిమయ బిల్లుపై మాట్లాడేటప్పుడు బీసీల గురించి చర్చించండి. మీ వాళ్లు ఇచ్చిన లిస్ట్‌లో మీ పేరు లేదు.
 యనమల : మీ వ్యాఖ్యలను మీ ఇష్టానికే వదిలిపెడుతున్నా. గతంలోనూ ఇలాగే మాట్లాడారు.

జగన్: చర్చలో పాల్గొనాలంటే ప్రతిపక్ష నేత పేరు ఇవ్వక్కర్లేదు. సభ్యులు మాట్లాడతారు. విపక్షనేత ముగింపిస్తారు.

యనమల: తీర్మానం మీద విపక్ష నేత ముగింపు ఉండదు. నిబంధనలు చదువుకోవాలి. ద్రవ్య వినిమయ బిల్లు మీద విపక్ష నేత ముగింపు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. విపక్ష నేత వాడిన పదాలు ఉపసంహరించుకోవాలి.

జగన్: బీసీ తీర్మానం ఈ రోజు అజెండాలో లేదు. హఠాత్తుగా సీఎం వచ్చి తీర్మానం చదివి వినిపించారు.

యనమల: స్పీకర్‌కు ఈ రోజు ఉదయం సమాచారం ఇచ్చాం. చర్చలో మీ పార్టీ సభ్యుల పేర్లు మీ అనుమతితోనే ఇచ్చి ఉంటారు. మీ పేరు ఎందుకు పంపలేదు?

స్పీకర్: బీసీ తీర్మానం గురించి ఉదయం చెప్పారు. వెంటనే మీకు తెలియజేయాల్సిందిగా అసెంబ్లీ కార్యదర్శికి చెప్పాను. మీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి తెలియజేశారు. తర్వాతే మీ సభ్యుల లిస్ట్ వచ్చింది.

జగన్: బీసీ తీర్మానం మీద మాట్లాడతానంటే.. ఎందుకు భయపడుతున్నారు? సమాధానం చెప్పే ధైర్యం ఉందా?

సీఎం: అత్యవసర సందర్భాల్లో.. సీఎం, మంత్రులు షార్ట్ నోటీస్ ఇచ్చి ప్రకటన చేయవచ్చు. కొత్త సభ్యులకు ప్రొసీజర్ తెలియదు. ప్రజా సమస్యలపై ఎప్పుడైనా సభలో ప్రకటన చేసే హక్కు ప్రభుత్వానికి ఉంటుంది.

జగన్: ప్రకటనకు, తీర్మానానికి తేడా ఏమిటనే విషయం సీఎంకు తెలియదు. తీర్మానం మీ ఇష్టప్రకారం ప్రవేశపెట్టడానికి కుదరదు. ముందస్తుగా నోటీస్ ఇచ్చి ప్రవేశపెట్టాలి. దాని మీద చర్చ కూడా జరగాలి. బీసీ తీర్మానం గురించి కనీసం సంకేతాలు కూడా ఇవ్వకుండా ప్రవేశపెట్టారు. తీర్మానాన్ని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం.

స్పీకర్ : బీసీ తీర్మానం మీద మాట్లాడటానికి అవకాశం లేదు. ద్రవ్య వినిమయ బిల్లు మీద చర్చలో బీసీల గురించి మాట్లాడండి.

జగన్ : ప్రభుత్వం ప్రకటన అని చెప్తూ బుల్డోజ్ చేస్తున్నారు. తీర్మానం ప్రవేశపెట్టడానికి ఉన్న నిబంధనలు చూపిస్తే.. మళ్లీ బుల్డోజ్ చేస్తున్నారు. బీసీల సంక్షేమం పట్ల ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉందంటే.. విపక్ష నేతకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా, ఏం చెబుతారో వినికుండా తీర్మానం చేస్తున్నారు.(వైఎస్సార్ సీపీ సభ్యులు విపక్ష నేతకు మాట్లాడే అవకాశం ఇవ్వాలంటూ స్పీకర్ పోడియం వద్ద నిలబడి నినాదాలు చేశారు.)

స్పీకర్ : విపక్ష నేతకు విజ్ఞప్తి చేస్తున్నా. ద్రవ్య వినిమయ బిల్లు మీద జరిగే చర్చలో బీసీల గురించి మాట్లాడండి. తీర్మానం మీద చర్చకు అనుమతించడానికి వీలు కాదు.

జగన్: అధికారపక్ష సభ్యులు కౌరవసభను మరిపిస్తున్నారు. న్యాయం, ధర్మం లేకుండా మాట్లాడుతున్నారు. కౌరవులు ఎలా ఉంటారో నాకు తెలియదు. మిమ్మల్ని (టీడీపీ సభ్యులను) చూస్తే కౌరవులు కూడా సిగ్గుతో తలదించుకుంటారు. కౌరవులకు క్షమాపణ చెప్పాలని అడుగుతున్నారు. కౌరవులకంటే అన్యాయంగా ఉన్నారు. గంట నుంచి సభలోనే ఉన్నా. మాట్లాడటానికి అవకాశం ఇవ్వాలని చేయి ఎత్తుతూనే ఉన్నా. కానీ తీర్మానం పాస్ అయిపోయిందంటున్నారు.

స్పీకర్: స్పీకర్ స్థానానికి దురుద్దేశాలు ఆపాదించడం సరి కాదు. మీరు చేయి ఎత్తలేదు కనుక అవకాశం ఇవ్వలేదు.

జగన్: జరిగిన ప్రక్రియను తప్పుపడుతున్నా. విపక్ష నేత కు విస్మరించి తీర్మానం ఆమోదం పొందడం ధర్మం కా దు. సిద్ధాంతపరంగా.. నేను దీనికి అంగీకరించలేదు. ఇం త అన్యాయమా అని అడిగితే.. కౌరవసభలో మాదిరి హే ళన చేస్తున్నారు. చర్చ పూర్తికాక ముందే నేను చేయి ఎత్తా ను. ఒక కెమెరా నా మీదే ఫోకస్ చేసి ఉంటుంది. వీడియో క్లిప్పింగ్స్ చూడండి తెలుస్తుంది. విపక్ష నేత మాట్లాడకుండా.. తీర్మానం పాస్ అనడం ఎంత వరకు న్యాయం?

 స్పీకర్: స్పీకర్ స్థానం మీద ఆరోపణలు చేస్తున్నారు. మీరు చేయి ఎత్తి, నేను చూడకపోతే.. మీ సభ్యులు ఎవరైనా వచ్చి చెప్పవచ్చు. వీడియో క్లిప్పింగ్స్ చూడాల్సిన అవసరం లేదు.

 జగన్: వీడియో క్లిప్పింగ్స్ చూస్తే నేను ఎన్నిసార్లు చేయి ఎత్తినాననే విషయం తెలుస్తుంది.  ... ఒకవైపు విపక్ష నేత అభ్యంతరం వ్యక్తం చేస్తుండగా, మరోవైపు విపక్ష సభ్యులు స్పీకర్ పోడియం వద్ద నిలబడి నినాదాలు చేస్తున్నప్పుడే.. ద్రవ్య వినిమయ బిల్లుకు సభ ఆమోదం తెలిపింది. అనంతరం స్పీకర్ సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement