సాక్షి, గుంటూరు : ముస్లిం మైనారిటీలకు అండగా ఉంటానని నమ్మబలుకుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్వహించిన 'నారా హమారా.. టీడీపీ హమారా' సభలో న్యాయం కోసం నినదించిన యువకులను అరెస్ట్ చేయడంపై వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి మండిపడ్డారు. టీడీపీ ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని యువకులు గుర్తు చేయడం తప్పా అంటూ ప్రశ్నించారు. ఈ మేరకు గురువారం వైఎస్ జగన్ ఒక ట్వీట్ పెట్టారు.
'గుంటూరు మీటింగ్‌కు రమ్మని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ముస్లింలను పిలిచింది మీరే కదా ? అక్కడకు వచ్చిన వారు మీరిచ్చిన హామీలనే నిలబెట్టుకోమని ప్రజాస్వామ్యయుతంగా అడిగితే, ప్లకార్డులు ప్రదర్శిస్తే వారిపట్ల పాశవికంగా వ్యవహరిస్తారా? వాళ్లు చేసిన తప్పేంటి ? మీరు మేనిఫెస్టోలో చెప్పినట్టుగా ఉర్దూ మీడియం పాఠశాలలు ఎక్కడని అడగడం తప్పా? మదర్సా విద్యార్థులకు ఉచిత బస్సుపాసులు, స్కూలు యూనిఫామ్స్ ఎక్కడిచ్చారని ప్రశ్నించడం పాపమా? స్వాతంత్ర్యం వచ్చాక ఎప్పుడూ లేని విధంగా ముస్లింలకు రాష్ట్రంలో మంత్రి పదవి ఇవ్వకపోవడాన్ని లేవనెత్తుతూ మీరు చేసిన అన్యాయాన్ని గుర్తు చేయడం నేరమా? 30 గంటలపాటూ ఎక్కడ ఉంచారో కూడా తెలియనీయకుండా వారిని నిర్భంధించి, హింసించి తర్వాత కేసులు బనాయించి జైల్లో పెట్టడం న్యాయమేనా? ఈ రాష్ట్రంలో మానవహక్కులు లేవా? మానవత్వం ఉందా మీకు? ముఖ్యమంత్రిగారూ.. తక్షణమే ఆ యువకులపై పెట్టిన తప్పుడు కేసులను బేషరతుగా ఉపసంహరించుకుని వారికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాను' అని ట్విటర్‌లో పోస్ట్ చేసిన ఓ లేఖలో వైఎస్ జగన్ పేర్కొన్నారు.
గుంటూరులో మంగళవారం నిర్వహించిన ‘నారా హమారా..టీడీపీ హమారా’ సభకు నంద్యాల పట్టణానికి చెందిన ముస్లిం యువకులు మహబూబ్ బాషా, అబిద్, అక్తర్ సల్మాన్ జిగ్రియా, ముర్తుజావలి, మహమ్మద్ ఇలియాస్, సౌదిజిబేర్, మహమ్మద్ జిబేర్, ముజాహిద్ వెళ్లారు. సీఎం చంద్రబాబు ప్రసంగిస్తుండగా.. ముస్లింలకు న్యాయం చేయాలని కోరుతూ వారు ప్లకార్డులు చూపించడంతో 8 మంది ముస్లిం యువకులను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. వారి వద్ద నుంచి సెల్‌ఫోన్లు సైతం లాక్కొని.. యోగక్షేమాలు కూడా తల్లిదండ్రులకు, కుటుంబ సభ్యులకు తెలియకుండా చేశారు.
Comments
Please login to add a commentAdd a comment