వైఎస్‌కు పేరొస్తుందనే ప్రాజెక్టులపై నిర్లక్ష్యం
- ముఖ్యమంత్రి తీరు హుందాగా లేదు: జ్యోతుల నెహ్రూ
సాక్షి, హైదరాబాద్: శాసనసభ శీతాకాల సమావేశాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హుందాగా వ్యవహరించలేదని వైఎస్సార్ సీపీ శాసనసభా పక్షం ఉపనేత జ్యోతుల నెహ్రూ విమర్శించారు. ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎంతో హుందాగా వ్యవహరించి ప్రజా సమస్యలను సభలో ప్రస్తావిస్తే అధికారపక్షం ఎదురుదాడికి దిగి ఆరోపణలు చేయడమే పనిగా పెట్టుకుందన్నారు. జ్యోతుల నెహ్రూ బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. కొత్త రాజధాని నిర్మాణానికి తమ పార్టీ వ్యతిరేకం అంటూ టీడీపీ చేస్తున్న దుష్ర్పచారాన్ని ఖండించారు. రాయలసీమకు మంచినీరు ఇవ్వాలంటే తాము అడ్డుపడుతున్నట్లుగా ప్రభుత్వం అసత్య ప్రచారం చేస్తోందన్నారు. గాలేరు-నగరి, హంద్రీ-నీవా ప్రాజెక్టులపై టీడీపీ ప్రభుత్వం ఎందుకు శ్రద్ధ వహించడం లేదని ప్రశ్నించారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో చేపట్టిన ప్రాజెక్టులు పూర్తయితే ఆయనకు మంచి పేరు వస్తుందోనన్న భయంతో బాబు వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు.
బాబును పొగడటానికే అసెంబ్లీ: గడికోట, విశ్వేశ్వర్‌రెడ్డి
సీఎం చంద్రబాబునాయుడును పొగుడుతూ ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డిని దూషించడానికే శాసనసభా సమావేశాలు నిర్వహించినట్లుగా ఉందని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు గడికోట శ్రీకాంత్‌రెడ్డి, వై.విశ్వేశ్వర్‌రెడ్డి ధ్వజమెత్తారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద వారు మాట్లాడుతూ, రాష్ట్రంలో ముఖ్యంగా రాయలసీమలో నెలకొన్న తీవ్ర కరువు పరిస్థితులపై అసెంబ్లీలో చర్చించడానికి తాము ఎంత పట్టు పట్టినా సాధ్యం కాలేదన్నారు.
ప్రభుత్వం పారిపోయింది: ఎస్వీ, బుడ్డా
అసెంబ్లీ సమావేశాలు ఎక్కువ రోజులు నిర్వహిస్తే ప్రజా సమస్యలపై ప్రతిపక్షం అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం భయపడి పారిపోయిందని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు ఎస్వీ మోహన్‌రెడ్డి, బుడ్డా రాజశేఖరరెడ్డిలు ధ్వజమెత్తారు. సాధారణంగా 10 నుంచి 15 రోజులు జరిగే శాసనసభ శీతాకాల సమావేశాలను టీడీపీ ప్రభుత్వం ఈ దఫా ఐదు రోజులకే పరిమితం చేసిందన్నారు.