వైఎస్ ఫొటో యథాస్థానంలో ఉంచాలి
⇒ అసెంబ్లీ లాంజ్‌లోనే ఉంచాలని స్పీకర్‌కు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల వినతిపత్రం
⇒ స్పష్టమైన హామీ ఇవ్వకపోవడంతో తీవ్ర అసంతృప్తి
సాక్షి, హైదరాబాద్: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఫొటోను అసెంబ్లీ లాంజ్‌లో తొలగించిన చోటే పునరుద్ధరించే విషయంలో ఏపీ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు స్పష్టమైన హామీ ఇవ్వకపోవడంపై వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. శుక్రవారం కోడెలను కలిసిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వైఎస్ సహా తొలగింపునకు గురైన దామోదరం సంజీవయ్య, ప్రకాశం పంతులు, పొట్టి శ్రీరాములు ఫొటోలనూ యథాస్థానంలో ఉంచాలని గట్టిగా పట్టుపట్టారు. ఈ మేరకు వారొక వినతిపత్రాన్ని స్పీకర్‌కు అందజేశారు. వైఎస్ ఫొటోను పెట్టకూడదని నిర్ణయం తీసుకున్నట్లుగా ఈ నెల 11న ప్రభుత్వ చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు విలేకరుల సమావేశంలో చేసిన వ్యాఖ్యలను ఎమ్మెల్యేలు స్పీకర్ దృష్టికి తీసుకువచ్చారు. ఆ వ్యాఖ్యలతో తమకు ఎలాంటి సంబంధం లేదని, దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పీకర్ వారికి తెలిపారు. సానుకూలమైన సమాధానం రాకపోవడంతో కొద్దిసేపు ఆయన ఛాంబర్‌లో నిరసన తెలిపిన ప్రజాప్రతినిధులు తాము అసంతృప్తితోనే వెనుదిరుగుతున్నామని స్పష్టం చేశారు.
నమ్మకం కలిగించే రీతిలో స్పీకర్ వ్యవహరించలేదు: జ్యోతుల నెహ్రూ
వైఎస్ ఫొటోను తిరిగి ఏర్పాటు చేసే విషయంలో స్పీకర్ ఇచ్చిన ‘నాకు వదిలేయండి’ అనే సమాధానం తమకు అసంతృప్తిని కలిగించిందని, నమ్మకం కలిగించే రీతిలో ఆయన వ్యవహరించలేదని వైఎస్సార్‌సీపీ శాసనసభాపక్ష ఉప నేత జ్యోతుల నెహ్రూ చెప్పారు. స్పీకర్‌తో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి చర్చించిన అనంతరం ఆయన మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. మరమ్మతు పనులు చేపట్టాల్సి ఉన్నందున ఆ ఫొటోలన్నింటినీ పక్కన పెట్టినట్లుగా స్పీకర్ తమకు వివరించారన్నారు. తొలగించిన ఫొటోలన్నింటినీ ఏఏ స్థానాల్లో పెట్టాలో ఓ నిర్ణయం తీసుకుంటామని తెలిపారన్నారు. ఫలానా సమయంలోపుగా వైఎస్ ఫొటోను పెడతామని చెబితే హామీని నమ్ముతామని అడిగామని అందుకు ఆయన ఏమీ చెప్పలేదన్నారు.
స్పీకర్ ఎలాంటి హామీ ఇవ్వలేదు: అసెంబ్లీ కార్యదర్శి సత్యనారాయణ
అసెంబ్లీ లాంజ్‌లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ చిత్రపటం పునరుద్ధరిస్తామని స్పీకర్ కోడెల శివప్రసాదరావు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలకు ఎలాంటి హామీ ఇవ్వలేదని అసెంబ్లీ ఇన్‌ఛార్జి కార్యదర్శి కె.సత్యనారాయణ శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. చిత్రపటం తొలగింపు అంశాన్ని అసెంబ్లీ జనరల్ పర్పస్ కమిటీకి నివేదించామని సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటామని’ సభాపతి తెలిపారని ఆ ప్రకటనలో వివరించారు.
మాకు ప్రజా సమస్యలే ముఖ్యం
ప్రజాసమస్యలను శాసనసభలో చర్చకు రాకుండా చేసేందుకే టీడీపీ వైఎస్ ఫొటో తొలగించి వివాదం సృష్టిం చిందని తాము భావిస్తున్నామని వారి రాజకీయ ఎత్తుగడలో తాము పడేందుకు సిద్ధంగాలేమని నెహ్రూ అన్నారు. తమకు ప్రజాసమస్యలే ముఖ్యమని, వాటిపై అసెంబ్లీలో చర్చకు గట్టి గా ప్రయత్నిస్తామన్నారు. ఒక వే ళ స్పీకర్ సానుకూల నిర్ణయం తీసుకోనట్లయితే తమ పోరాటాన్ని కొనసాగిస్తామన్నారు. ఎన్టీఆర్ మరణించిన 20 ఏళ్ల తర్వాత ఆయన ఫొటోనూ అసెం బ్లీలో పెట్టాలన్న ఆలోచన రావడం సంతోషమేనని, తాము వైఎస్ ఫొటో వ్యవహారం లేవనెత్తినందు వల్లనే వారికి ఎన్టీఆర్ గుర్తుకు వచ్చారన్నారు.
ఈ నెల 10న ప్రత్యేక హోదా సాధన కోసం ఢిల్లీ వెళ్లిన వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలకు ఏపీ భవన్‌లో గదులు కేటాయించిన అధికారిని విధుల నుంచి తప్పించే నీచమైన స్థాయికి టీడీపీ ప్రభుత్వం దిగజారిందని ఆయన విమర్శించారు. శాసనసభాపక్ష ఉపనేత ఉప్పులేటి కల్పన, ఎమ్మెల్యేలు భూమా నాగిరెడ్డి, మేకా ప్రతాప అప్పారావు, కె.జోగులు, సీహెచ్ రామచంద్రారెడ్డి, కె.సంజీవయ్య, జగ్గిరెడ్డి, కె.రఘుపతి, అఖిలప్రియ, దాడిశెట్టి రాజా, ఆళ్ల రామకృష్ణారెడ్డి, ముత్యాలనాయుడు, అశోక్‌రెడ్డి, జయరాములు, ఎ.సురేష్, వి.సుబ్బారావు, బాలనాగిరెడ్డి, సాయిప్రసాద్‌రెడ్డి, విశ్వేశ్వర్‌రెడ్డి, మహ్మద్ ముస్తఫా, శ్రీకాంత్‌రెడ్డి, ఎమ్మెల్సీలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, అప్పారావు స్పీకర్‌ను కలిసిన వారిలో ఉన్నారు.