సాక్షి, రాజమహేంద్రవరం: మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి మన మధ్య నుంచి దూరమై అప్పుడే పదేళ్లయిపోయింది. పెద్దాయన దూరమై ఇన్నేళ్లయినా ఆయన జ్ఞాపకాలు జిల్లా ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయి. ఆయన హఠాన్మరణాన్ని తట్టుకోలేక రాష్ట్రవ్యాప్తంగా గుండెలాగిపోయిన అభిమానుల సంఖ్య జిల్లాలోనే అత్యధికం కావడం గమనార్హం. మహానేత మరణించిన తరువాత ఆ దుఃఖం తట్టుకోలేక మన జిల్లాలో 80 మంది పైచిలుకు అభిమానులు తనువు చాలించారు. వైఎస్ పదేళ్ల క్రితం వేసిన అభివృద్ధి బాటలను ఇప్పటికీ ఎవ్వరూ మరువలేరు.
ప్రధానంగా జిల్లాలోని రెండు ప్రాంతాల మధ్య అభివృద్ధి సమతుల్యతను సాధించడానికి ఆయన ఉన్నంత కాలం ఎంతో పరితపించారు. ఒకపక్క బీడువారిన భూములతో ఉన్న మెట్ట ప్రాంతం, మరోపక్క సమృద్ధిగా సాగునీరందే డెల్టా. ఈ రెండింటి మధ్య అభివృద్ధిలో తీవ్ర వ్యత్యాసం ఉండటాన్ని రైతు పక్షపాతిగా నాడు వైఎస్సార్ గుర్తించారు. ఆయన హయాంలో తీసుకున్న నిర్ణయాలే నేడు ఉన్నంతలో జలవనరులను పూర్తిగా వినియోగించుకునే అవకాశాన్ని మెట్ట ప్రాంతానికి అందించాయి. మన్యంలో గిరిజనం సుదీర్ఘకాలంగా నిరీక్షిస్తున్న భూమిపై హక్కులు కల్పించిన ఘనత కూడా వైఎస్‌కే సొంతం.
జలయజ్ఞం
మెట్టప్రాంతాన్ని సస్యశ్యామలం చేసే లక్ష్యంతో పుష్కర ఎత్తిపోతల పథకాన్ని 2008లో సోనియాగాంధీతో ప్రారంభింపచేశారు వైఎస్సార్. తద్వారా మెట్ట రైతుల మేలు కోసం పరితపించిన నేతగా ముద్ర వేసుకున్నారు. రూ.600 కోట్లతో పురుషోత్తపట్నం నుంచి గోదావరి జలాలను తుని వరకు తీసుకువచ్చారు. జగ్గంపేట, గండేపల్లి మండలాల్లో సుమారు 40 వేల ఎకరాలకు సాగునీరంది, పంటలు పండుతున్నాయంటే పెద్దాయన చలవేనని అక్కడి రైతులు ఇప్పటికీ గుర్తు చేసుకుంటారు.
► ధర్మవరం వద్ద ఏలేరు ఆధునీకరణకు రూ.132 కోట్లతో 2009లో శంకుస్థాపన చేసి ప్రాజెక్టును పరుగులు పెట్టించారు.
► రంపచోడవరం ఏజెన్సీలో భూపతిపాలెం, ముసురుమిల్లి ప్రాజెక్టుల ద్వారా సుమారు 35 వేల ఎకరాలకు సాగునీరందించారు.
► తూర్పు గోదావరి, విశాఖ జిల్లాల్లో 51,460 ఎకరాలకు సాగునీరందించే తాండవ ఆధునికీకరణ కూడా ఆయన పుణ్యమే. 2003 పాదయాత్రలో రాజశేఖరరెడ్డికి ఈ ప్రాంత రైతులు తమ సమస్యను వివరించారు. నాడు ఇచ్చిన మాటకు కట్టుబడిన ఆయన, సీఎం అయ్యాక తాండవ కాలువల సీసీ లైనింగ్ అభివృద్ధికి రూ.55 కోట్లు మంజూరు చేశారు. స్వయంగా పనులను ప్రారంభించి, రైతులకు ఎంతో మేలు చేశారు.
► డెల్టాలో సమృద్ధిగా నీరున్నా మురుగునీటి పారుదల, ఏటిగట్ల ఆధునికీకరణ లేక రైతులు పడుతున్న కష్టాలను తెలుసుకున్నారాయన. అప్పటి వరకూ ఏ సీఎం తీసుకోనివిధంగా గోదావరి డెల్టా ఆధునికీకరణకు సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా 2007–08లో రూ.1660 కోట్లు కేటాయించారు. దాదాపు రూ.500 కోట్లతో పనులు పూర్తి చేశారు.
► ఉభయ గోదావరి జిల్లాల్లో ఏటిగట్ల ఆధునికీకరణకు రూ.489 కోట్లు కేటాయించగా 400 కిలోమీటర్ల మేర ఈ పనులు పూర్తయ్యాయి.
మౌలిక సదుపాయాలపై..
► రైతులే కాదు.. ప్రజల మౌలిక సదుపాయాల కల్పనపై కూడా వైఎస్సార్ ఎంతో శ్రద్ధ చూపారు.
► పశువుల్లంక మొండి రేవులో గోదావరి పాయపై వంతెన నిర్మాణానికి 2008లో ఆయన శంకుస్థాపన చేశారు. దీని పనులు రూ.35 కోట్లతో చురుకుగా జరుగుతున్నాయి. వాస్తవానికి ఆయన తదనంతరం వచ్చిన పాలకులు వైఎస్ ఆకాంక్షలకు అనుగుణంగా దీనిని పూర్తి చేసి ఉంటే.. పశువుల్లంకలో ఏడు నిండు ప్రాణాలు జలసమాధి అయ్యే పరిస్థితి తప్పేది.
► వైఎస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించిన ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకానికి 2006 ఏప్రిల్ 1న కపిలేశ్వరపురం మండలం పడమ ఖండ్రికలో శ్రీకారం చుట్టారు.
► రామచంద్రపురం పట్టణ ప్రజల దాహార్తి తీర్చేందుకు 2010లో రూ.21 కోట్లతో సీపీడబ్ల్యూసీæ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. మున్సిపాలిటీలో 17 వేల కుటుంబాలకు రక్షిత మంచినీరందించే ఈ ప్రాజెక్టు ఆయన మరణానంతరం నిలిచిపోయింది.
► కాకినాడలో జేఎన్‌టీయూ, రాజమహేంద్రవరంలో ఆదికవి నన్నయ్య యూనివర్సిటీని ఆయన హయాంలోనే ఏర్పాటు చేశారు. తద్వారా జిల్లా విద్యాభివృద్ధికి కొత్త బాటలు పరిచారు.
► కాకినాడలో పెరిగిన జనసమ్మర్థాన్ని దృష్టిలో ఉంచుకొని సినిమా రోడ్డులో రెండో ఫ్లైఓవర్ వంతెన నిర్మించారు. ఆయన మరణానంతరం ఆ వంతెనకు వైఎస్సార్ వారధిగా నామకరణం చేశారు.
► డైయిరీ ఫారం సెంటర్‌లో పేదలకు బహుళ అంతస్తుల భవనాలను రాజీవ్ గృహకల్ప పథకం కింద నిర్మించి, రాష్ట్రంలోనే తొలిసారి పూర్తి చేశారు. ఇలా మహానేత వైఎస్ అభివృద్ధి అడుగుజాడలు జిల్లాలో ఏ మారుమూల చూసినా సాక్షాత్కరిస్తాయి. అందుకే భౌతికంగా దూరమై ఇన్నేళ్లయినా ఆయన అందరి గుండెల్లోనూ ఇప్పటికీ కొలువై ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment