![YS Rajasekhara Reddy Birth Anniversary Celebrations At AP Bhavan - Sakshi](/styles/webp/s3/article_images/2019/07/7/ysr-birth-day.jpg.webp?itok=O0oP13kD)
న్యూఢిల్లీ : దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి నిబద్ధత, అంకితభావానికి మారుపేరని భారత ఎన్నికల సంఘం మాజీ ప్రధాన అధికారి వీఎస్ సంపత్ అన్నారు. మహానేత జయంతి వేడుకలను ఆదివారం ఏపీ భవన్‌లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆడిటోరియంలో అధికారులు ఘనంగా నిర్వహించారు. సోమవారం మహానేత జయంతిని పురస్కరించుకుని అధికారులు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏపీ భవన్‌లో మహానేత పాదయాత్ర నేపథ్యంగా తెరకెక్కిన ‘యాత్ర’ చిత్రాన్ని ప్రదర్శించారు. ఈ వేడుకల్లో సంపత్‌కుమార్, రెసిడెంట్ కమిషనర్ ప్రవీణ్ ప్రకాశ్‌లు పాల్గొన్నారు. మహానేతతో తమకున్న అనుబంధాన్ని వారు గుర్తుచేసుకున్నారు. యాత్ర సినిమా విరామ సమయంలో వారు చిన్నారులతో కలిసి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా సంపత్ మాట్లాడుతూ.. అధికారుల సమన్వయంతో ప్రజల సంక్షేమం, అభివృద్ధి పథకాల లక్ష్య సాధనకు వైఎస్సార్ స్థిర సంకల్పంతో కృషి చేశారని కొనియాడారు. ఆరోగ్యశ్రీ, 108 సేవలతో ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారని గుర్తుచేశారు. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ కార్యదర్శిగా ఉన్నప్పుడు వైఎస్సార్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.
ప్రవీణ్ ప్రకాశ్ మాట్లాడుతూ.. ప్రజల హృదయాల్లో స్థిరస్థాయి ముద్ర వేసుకున్న ప్రజానాయకుడు వైఎస్సార్ అని కొనియాడారు. సోమవారం వైఎస్సార్ జయంతిని పురస్కరించుకుని హస్తినాలోని తెలుగువారి కోసం ఏపీ భవన్‌లో యత్రా చిత్రం ప్రదర్శించినట్టు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment