ఏఎన్‌యూ: ఆచార్య నాగార్జున యూనివర్సిటీపై మహానేత డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి చెరగని ముద్ర వేశారు. నాలుగు దశాబ్దాల చరిత్ర ఉన్న ఏఎన్‌యూకు ఆయన చూపిన ప్రేమ ప్రత్యేకమైనది. మూడు దశాబ్దాలుగా అందని ద్రాక్షగా మిగిలిన ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటులో ఆయన చూపిన చొరవ ప్రశంసనీయమని అప్పటి యూనివర్సిటీ ఉన్నతాధికారులు పలు వేదికలపై పలుమార్లు కొనియాడారు. ముఖ్యమంత్రిగా గుంటూరు జిల్లా పర్యటనకు వచ్చిన వైఎస్సార్‌ను అప్పటి వైస్ చాన్సలర్ కలిసి ఏఎన్‌యూలో ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కోరగా, ఏఎన్‌యూకు ఇంజినీరింగ్ కళాశాల లేదా ఇదేం పరిస్థితి అని ఆశ్చర్యం వ్యక్తం చేసిన ఆయన వెంటనే ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటుకు సంబంధించిన ఫైల్ సిద్ధం చేసుకుని తనను కలవాలని వీసీకి సూచించారు.
గ్రామీణ విద్యార్థులకు సాంకేతిక విద్యను అందించేందుకు యూనివర్సిటీలో ఇంజినీరింగ్ కళాశాల ఎంతో అవసరమని వైఎస్సార్ స్పష్టం చేశారు. తదనంతరం ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటుకు అన్ని అనుమతులు ఇప్పించిన వైఎస్సార్ 2009లో ఏఎన్‌యూలో ఇంజినీరింగ్‌తోపాటు ఫార్మసీ, ఆర్కిటెక్చర్ కళాశాలలను తన చేతుల మీదుగా ప్రారంభించారు. అదే వేదికపై ఓసీ(ఓపెన్ కేటగిరీ)లోని పేద విద్యార్థులకు కూడా ఈబీసీ కింద ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇస్తామని వైఎస్సార్ ప్రకటించారు. తర్వాత కాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలు చేశారు.
అంతేకాదు దశాబ్దాకాలంపైగా పెండింగ్‌లో ఉన్న యూనివర్సిటీ అధ్యాపక పోస్టుల మంజూరులోనూ ఆయన ప్రత్యేక శ్రద్ధ కనబరిచారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఏఎన్‌యూకు రెండు విడతలు రెగ్యులర్ అధ్యాపక పోస్టులు మంజూరు చేసి, వాటి నియామకాలు జరిగేలా ప్రత్యేక చర్యలు చేపట్టారు. యూనివర్సిటీ ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయిలో పెంపొందింపజేస్తూ అప్పటి వరకు నాగార్జున యూనివర్సిటీగా ఉన్న యూనివర్సిటీ పేరును ఆచార్య నాగార్జున యూనివర్సిటీగా మార్చుతూ అసెంబ్లీలో తీర్మానం చేయించారు. ముఖ్యమంత్రులు ఏఎన్‌యూలో అడుగుపెడితే వారికి అరిష్టమనే నానుడిని తిప్పికొడుతూ ముఖ్యమంత్రిగా ఏఎన్‌యూలో జరిగిన స్నాతకోత్సవంలో పాల్గొన్నారు. ఏఎన్‌యూపై చెరగని ముద్ర వేశారు.
Comments
Please login to add a commentAdd a comment